ఇది గణాంకాల కాలం. ఇది ఇండ్లు మారే కాలం. కొత్త ఇండ్లు చూసుకునే కాలం. ఇండ్లు మార్చే, శుభ్రం చేసుకునే కాలం. ఇది కొత్త పాటలు పాడే కాలం. పక్షులన్నీ బయటకొచ్చి కూసే కాలం, అందులో కోయిలలుంటాయి మిగతావీ ఉంటాయి. కాకి కూత మనకిష్టం లేకపోయినా అది మనకు చేసే మంచిని చూడం. కొత్త విలువలంటూ పాత విలువల్ని, పాత మనుషుల్ని వదిలి కొత్త గూటిలోకి అడుగుపెట్టే కాలం. ఇది కలల్ని, కాలాన్ని, అవకాశాన్ని మార్చుకునే కాలం. పాత మనుషుల్నే కొత్తగా కలుసుకునే కాలం. ఇవన్నీ కాదు కాని ఇది ఇచ్చిపుచ్చుకునే కాలం. ఇవ్వడానికి, తీసుకోవడానికి, లాక్కోవడానికి, లాక్కున్నది పంచడానికి ఇది అనువైన కాలం. కాలం పరుగులు పెడుతున్న కాలంలో ఆ కాలనికి అనువుగా కదిలే కాలం.
అలా చెప్పుకుంటూ పోతే మొత్తం పేజీ నిండిపోతుంది. చట్టసభల్ని కొత్త కొత్త వాళ్లతో నిండడం చూస్తున్నాం. పేరంటంగా కాదు, అతిధిగానూ కాదు ”మీ ఇంట” కొలువుండడానికే వస్తున్నాను అని మురిసిపోతూ చీమల మాదిరి మనుషులు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. కొన్ని మినహా అవే రోడ్లు, అవే వాహనాలు, అదే మనుషులు కాని ట్రాఫిక్ రోజూ కొత్తగా కనిపిస్తుంది. ఎడమ వైపు పోయేవాళ్లు కుడివైపు పోయేవాళ్లు, మధ్యలో పోయేవాళ్లు పోతూనే ఉంటారు. యూ టర్న్ వచ్చేదాకా ఎవరి వేగం, ఎవరి గమ్యం ఏమిటో తెలియదు. గమ్మత్తుగా అనిపిస్తుంది కాని గమ్యస్థానం ముఖ్యమైనదని మరువరాదు. అందులో ఏ గమ్యం ఎవరికి ఎంత ప్రాముఖ్యత ఉందో, సంతరించుకుందో దాన్ని బట్టి ఏ యూ టర్న్ దగ్గర ఎవరు తిరుగుతారో మనం తెలుసుకోగలగాలి. ఒక్కోసారి అకస్మాత్తుగా కూడా తిరిగే జనాలుండొచ్చు, అది వారి ”గమ్య” స్థానాన్నిబట్టి ఉంటుంది.
అప్పుడెప్పుడో వస్తు మార్పిడి అంటే బార్టర్ సిస్టం గురించి విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న మానవుడు తన శ్రమని వస్తువుల్లో చూసుకొని తనక్కావలసినవి తీసుకొని తనకు వచ్చే వస్తువుల్ని చేసి మార్చుకున్నాడు. ఇప్పుడు ఆధునిక మానవుడు, అత్యాధునిక రాజకీయ మానవుడు వచ్చాడు. ప్రపంచమే చిన్నదైపోయిందని చెబుతారు, ఇదీ అంతే అన్నీ చిన్నవైపోయాయి విలువలతో సహా. మంచి మంచిగా కనపడదు, చెడు చెడుగా అనిపించదు. కనిపించగపోగా, అనిపించకపోగా రివర్సులో తారుమారుగా కనిపిస్తాయి ఒకదానికొకటి. ఆ.. ఇప్పుడు విలువలెక్కడున్నాయండీ, అన్నీ అడుగంటి పోయినాయని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే మన పనైపోతుంది. ఇప్పుడున్న విలువలు అవి అని తెలుసుకోవాలి. అవి బాగా అనిపించనప్పుడు తెలియజేయాలి. సీదాగా తెలపడం చేతకానప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, దాన్ని వాడుకోవాలి. అంతెందుకు సాఫ్టువేరు ఉద్యోగాలే తీసుకొండి, ఒకే కంపెనీలో చేసేవారికంటే అందులో చేసి రెండు మూడు కంపెనీలు మారి తిరిగొచ్చినవాళ్ళు అంతకుముందు వారికంటే ఉన్నత స్థాయిలో కూచుంటారు. మేము రిస్కు తీసుకున్నాము, ప్రమాదమని తెలిసీ అంతా తిరిగొచ్చామని తమ గొప్పతనం చెప్పొచ్చు. ”ప్యాకేజీలు” ఊరకేరావు అని ఇంకెవరో చెప్పిన డవిలాగులను చెప్పుచ్చు కూడా. నిజమే అనిపిస్తుంది పైపైన చూస్తే. ఒకే చెట్టు మీద నివసిస్తే ప్రయోజనమేముంది? అలా ఒక్కో చెట్టు మీద కొంత కాలం ఉండి రాకూడదూ అని చిలుక పలుకులు పలకొచ్చు. అలా చెట్టు మారడం, చెట్టేమిటి ఏకంగా అడవే మారడం నేటి రాజకీయ జీవులకు వచ్చి ఉండవలసిన విద్య. అందులోనే వాళ్లకి ఆనందం ఉంటే దానికి మనం అడ్డు చెప్పగలమా.
పార్టీలకు మించి కూటమి అన్నది పెద్ద భావన అంటే కాన్సెప్టు. కూటము అన్న పదంలోనుండి కూటమి వచ్చిందని వైద్యులు, రచయిత డా.పూర్ణచందు గారు ఈమధ్యే ఒక వ్యాసంలో రాశారు. అది చదివితే ఈ కూటమి అన్నది మంచిపనులకోసమా కాదా అన్న విషయం కూడా మనకు తెలిసిపోతుంది. ఇంకా శోధనలోకి పరిశోధనలోకి పోతే ఈ కూటమిలో కొన్నేళ్లు గడిచాక తమ ఉనికికే ప్రమాదం తెచ్చుకున్నామే అని బాధపడే పార్టీలూ ఉన్నాయి. మా పార్టీలోకి కాదు కాదు మా కూటమిలోకి వస్తే ఏం తెస్తావు, ఏమి ఇస్తావు అన్న మాట అటుంచి అసలు గల్లంతయ్యే వాళ్లూ ఉన్నారు. చివరికి నామరూపాల్లేకుండా వీధిలో పడే రోజులూ ముందుంటాయి. ఈ రాజకీయాల్లో అది మామూలే కదా అనుకుంటే సమస్యే లేదు. వారసులకోసం ఏం చేశావని తరువాత కొందరు ప్రశ్నలేస్తే చెప్పడానికి సమాధానమే సరిగా ఉండదు.
మా మిత్రుడు పిన్నధరి గారు ఇందాకే వాట్సప్పులో మంచి సందేశమొకటి పంపారు. అదేమంటే ”అవసరాన్ని బట్టి మాట్లాడేవాళ్లు, ఆపదను బట్టి దగ్గరయ్యేవాళ్ళు ఎప్పటికీ ఉపయోగపడరు” అన్నది ఆ సందేశం. ఈ రాజకీయాలను, ఈ కూటకీయాలను గమనిస్తుంటే ఒక సందేహం కలిగింది, అదేమంటే వాళ్లు వేరేవాళ్లకు పనికిరారేమో కాని ఆ కూటమి వాళ్లకు, బయటనుండి మద్దతు ఇచ్చే వాళ్లకు మాత్రం మస్తు మస్తుగా ఉపయోగపడతారు, తమ ఉపయోగం చూసుకుంటారు. అలాగే కూటమి కదా అని తమ పక్కన ఫొటోలు పెట్టి మరీ గౌరవిస్తే త్వరలో పుత్రరత్నం ఫొటో కూడా గోడపై చేరుతుందని అనుకునేవాళ్లూ ఉంటారు. పెద్దాయన ఫొటో కూడా ఉండాలని అడిగేవాళ్లూ ఉండొచ్చు. ఏదేమైనా కాని, ఎలా జరిగినా కాని, ఇవన్నీ కూటమిలో పెద్దాయనకు నచ్చినన్ని రోజులు మాత్రమే అని గమనించాలి. ఇప్పటికే తమ ఫొటో గల్లంతైనవాళ్లు అనేక చోట్ల ఉన్నారన్న విషయం మరచిపోకూడదు. తరువాత కూటహ, కూటస్య, కూటోభ్యహ అని ఏదో సినిమాలో డైలాగు చెప్పుకున్నంత సులభంగా ఉండవు పరిస్థితులు.
– జంధ్యాల రఘుబాబు, 9849753298