ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకున్నారు?

– వివరాలు తెలపాలి
– రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
– కేసు విచారణ ఈ నెల 10కి వాయిదా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ముగ్గురిపై తీసుకున్న చర్యలేంటో తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ.వివేకానంద వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే… ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కొత్తగూడెం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను తొలుత స్పీకర్‌ కార్యాలయం తీసుకోలేదు. దాంతో వారు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌ కార్యాలయానికి ఫిర్యాదులు అందజేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్‌ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో స్పీకర్‌ కార్యాలయం ద్వారా వివరాలు తెలుసుకుని కోర్టుకు సమర్పించాలని పేర్కొన్న హైకోర్ట్‌… తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ వి విజయసేనరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చట్టసభ సభ్యులపై కేసులను సత్వర విచారణ చేయాలి: హైకోర్టు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై నమోదైన కేసుల్ని సత్వర విచారణ చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్ట్‌ జారీ చేసిన మార్గదర్శకాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్ట్‌ బుధవారం వాటిపై విచారించింది. చట్ట సభ్యుల కేసుల విచారణ విషయంలో గతంలో ఇదే హైకోర్ట్‌ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధంగా అమలు చేయాలని ఆదేశించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8లో పేర్కొన్న కేసుల్ని జాప్యం లేకుండా వెంటనే విచారించాలని గత ఏడాది సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలపై చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది.