ఏవి మన ప్రాధాన్యతలు

 Sampadakiyamఅవసరం.. అనివార్యత… ఈ రెండు అంశాలు మనిషిని బాగా ప్రభావితం చేస్తాయి. ఇవే వ్యవస్థలను సైతం శాసిస్తాయి. ప్రభుత్వాలు, పాలకులు కూడా ఈ సూత్రానికి భిన్నంగా వ్యవహరించలేరు. కానీ ఆ క్రమంలో వారి దృష్టి ఏయే వర్గాల వైపు ఉంది? దాని వల్ల ఎవరికి మేలు కలుగుతుందనేది ఇక్కడ కీలకం. నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్‌లైన్లతో కొనసాగిన తెలంగాణ ఉద్యమం తర్వాత గులాబీ దళపతి కేసీఆరే పదేండ్లపాటు రాష్ట్ర ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన సంగతి మనకు విదితమే. ఆ కాలంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళితుడికి సీఎం పదవి, దళితులకు మూడెకరాల భూమి, యువతకు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి తదితర అనేకానేక ప్రజోపయోగ హామీలన్నీ అటకెక్కగా… నూతన సచివాలయ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు, హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై అమరవీరుల స్థూపం, నగరంలో అనేక ఫ్లై ఓవర్లు, స్టీల్‌ బ్రిడ్జీల నిర్మాణాలు చకచకా జరిగిపోయాయి. అంతకుముందే సకల హంగులతో సర్వాంగ సుందరంగా ప్రగతి భవన్‌ను నిర్మించారు. ఇవన్నీ వాగ్దాన భంగాలు, నిర్మిత హంగులు.
కానీ ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క కౌలు రైతుకు రైతుబంధు ఇవ్వకపోగా, వారితో మాకు ఎలాంటి సంబంధమే లేదని బీఆర్‌ఎస్‌ బాస్‌ కొట్టిపారేశారు. అప్పట్లో పంట నష్టపరిహారం ఊసే లేకుండా పోయింది. పదేండ్ల ఆ పార్టీ ఏలుబడిలో గురుకులాల సంఖ్యను 300 నుంచి రెండు వేలకు పెంచినా, వాటిలో 500కు మించి సొంత భవనాల్లేక పోవటం అప్పటి సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో పెరిగిన వేతనాలే తప్ప తెలంగాణ వచ్చాక అసంఘటితరంగ కార్మికులకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా కనీస వేతన జీవోలను సవరించని ఘనత కేసీఆర్‌ సర్కారుదే. ఇక్కడే అసలు గమ్మత్తు దాగుంది. 2014 నుంచి 2018 దాకా మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్ర మంటూ ప్రకటించిన ‘కారు’సారు, ఆ తర్వాత ఒక్కసారిగా కరోనాతో రూ.రెండు లక్షల కోట్ల మేర ఖజానాకు నష్టం వాటిల్లింది, అందువల్ల దుబారాను తగ్గించండంటూ అధికారులకు హితోపదేశం చేయటం కడు విచిత్రం. అదే సమయంలో పైన చెప్పిన నిర్మాణాలన్నింటినీ చేపట్టడం గమనార్హం.
పదేండ్ల బీఆర్‌ఎస్‌ ఏలుబడితో తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరటం లేదనే అభిప్రాయానికొచ్చిన తెలంగాణ ప్రజానీకం గతేడాది ‘ఆరు గ్యారెంటీల’తో ముందుకొచ్చిన కాంగ్రెస్‌కు పట్టంగట్టారు. అప్పటి పీసీసీ చీఫ్‌, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ ఆ పదవిని చేపట్టి వచ్చే డిసెంబరు ఏడు నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. అయితే ఆ ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవటం హస్తం పార్టీ పాలన తీరుకు అద్దం పడుతోంది. మాజీ సీఎం కేసీఆర్‌ ఆర్భాటానికి పోయి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే, ప్రస్తుత సీఎం రేవంత్‌ రూ. లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన చేపట్టబోతున్నారనే వార్తలు ఆశ్చర్యకరమే. అక్కడా, ఇక్కడా ‘కమీషన్ల కహానీ’లే వినబడుతుండటం గమనార్హం.
తెలంగాణ తొలి సీఎం కొత్త సచివాలయాన్ని కడితే, తానేం తక్కువ కాదంటూ నేటి ముఖ్యమంత్రి నూతన శాసనమండలిని నిజాం నిర్మాణ శైలిలో నిర్మిస్తానంటూ గొప్పలకు పోవటం విడ్డూరం. ఉమ్మడి రాష్ట్రంలోని పాత సచివాలయానికి ఇంకో యాభై ఏండ్లు ఢోకా లేదంటూ ఇంజినీర్లు చెప్పినా వినకుండా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ దాన్ని కూల్చి కొత్త సెక్రటేరియట్‌ను కట్టింది, అదీ ప్రజలు అతలాకుతలమైన కరోనా కాలంలో. అధికారిక లెక్కల ప్రకారం దాన్ని కూల్చటానికి, తిరిగి కట్టడానికి సాలీనా రూ.5 వేల కోట్లు ఖర్చయింది. ఇప్పుడు ఆ సచివాలయానికి వాస్తు బాలేదంటూ ప్రధాన ద్వారాన్ని తీసేసి, మరోచోట ఇంకో ద్వారాన్ని నిర్మించబోతోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. దీనికి రూ.4 కోట్ల ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయంటే మన పాలకుల ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? వారి అడుగులు ఎటు పడుతున్నాయో తేలిగ్గానే తెలుసుకోవచ్చు.
ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే… రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాలు, పేదలకు అవసరమైన పథకాలకు డబ్బుల్లేవని చెబుతున్న పాలకులకు… ‘పెద్ద పెద్ద నిర్మాణాలకు’ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందులోని మర్మమేంటి? అంటే ప్రపంచ బ్యాంకు, జికా లాంటి సంస్థలు… ఇలాంటి అనుత్పాదక రంగాలకే డబ్బులిస్తాయి తప్ప ప్రజల ఆర్థిక స్వావలంబన, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక్క నయాపైసా ఇవ్వవు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాధినేతలు కూడా ఆయా సంస్థలు చెప్పే నియమ నిబంధనలు, షరతులకు తానా అంటే తందానా అంటున్నారు తప్పితే… ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టడం లేదు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాలు విడుదల చేసి, వాటి కిస్తీలు, వడ్డీల కోసం నెలకు రూ.ఆరు వేల కోట్లు చెల్లిస్తున్నామంటూ లబోదిబోమంటున్న రేవంత్‌ సర్కారుకు ఈ వైఖరి అస్సలు మంచిది కాదు. ప్రజాపాలన అని చెప్పుకునే సర్కార్‌ ప్రజల చుట్టూనే ఆలోచించడమే ఉచితం.