తెలంగాణ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు రైతులకు రూ.2లక్షల పంట రుణమాఫీని ఆగస్టు 15లోపు అమలు చేస్తానని ప్రకటించి మూడు విడతలుగా రూ.18వేల కోట్లు 22 లక్షల మందికి బ్యాంకుల్లో జమచేసింది. వాస్తవానికి రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులు బ్యాంకుల నుండి రుణం పొందారు. వీరిలో అర్హులైన వారికి రూ.31వేల కోట్లు మాఫీచేయాల్సి వస్తుందని ప్రభుత్వం మొదట అంచనా వేసింది. మూడు విడతలుగా మాఫీ ప్రకటించినా రూ.18వేల కోట్ల కు మించలేదు. అర్హత ఉండి అమలు కాని రైతులు ఆందోళనకు గురౌతున్నారు. ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకోవడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి, సాంకేతిక శాఖ మంత్రి, భవన నిర్మాణ శాఖామాత్యులు మాత్రం అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రకటనలు చేస్తున్నారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో సహజంగానే ఆందోళన పెద్ద ఎత్తున ఉంటుంది. రుణమాఫీకి వస్తున్న ఆటంకాలేమిటి?
రుణమాఫీ కోసం ప్రభుత్వం జీవో 567 తేదీ15జులై2024న తెచ్చింది. ఆ జీవోలో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అంశాలతో సంబంధం వున్నప్పటికీ, అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. స్వయానా ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించారు.అయినప్పటికీ అనేక జిల్లాల్లో ఆధార్, రేషన్ కార్డును గమనంలోకి తీసుకొని రుణమాఫీని వర్తింపజేయనున్నట్లు ప్రకటనలు వస్తున్నాయి. 12డిసెంబర్2018 నుండి 09డిసెంబర్2023 వరకు బాకీ పడి ఉన్న వారికి రుణమాఫీ వర్తిస్తుందని, రూ.2 లక్షలకు పైన బాకీ ఉన్నవారు పై మొత్తం చెల్లిస్తే వారికి కూడా వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది.
బ్యాంకుల నిర్లక్ష్య పాత్ర
రాష్ట్రస్థాయిలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకులన్నీ ప్రతీ ఏటా ”రుణప్రణాళిక” ప్రకటించడం, అమలు జరపడం ఏడాదిలో నాలుగుసార్లు సమీక్షలు జరుపడం ఆనవాయితీగా వస్తున్నాయి. ఈ విధానాన్ని అమలు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ నాయకత్వాన జిల్లా లీడ్ బ్యాంకు నేతృత్వంలో సమావేశాలు నిర్వహించి రుణ సమస్యలను పరిష్కరించాలి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని కూడా రాష్ట్ర, జిల్లాల లీడ్ బ్యాంకులు తగిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చి మాఫీ పరిహారాన్ని తెప్పించుకుని రైతుల ఖాతాల్లో జమచేయాలి. 2001 నుండి రాష్ట్రంలో లీడ్ బ్యాంకు పాత్ర పూర్తిగా తగ్గింది. శాస్త్రీయత లేని రుణ ప్రణాళికలు ప్రకటించడం, అవి అమలు జరుపకపోవడం పరిపాటిగా వస్తున్నవి. 2014 నుండి 2023 వరకు రెండు విడతలుగా రైతులు రుణమాఫీ ప్రకటించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు బ్యాంకులకు చెల్లించడానికి పదేండ్ల కాలాన్ని తీసుకుంది. రెండు విడతలుగా ప్రకటించిన మాఫీకి మొదటి విడత రూ.16,140 కోట్లు, రెండోవిడత రూ.19,300కోట్లు చెల్లించారు. ఈ చెల్లింపుల్లో జరిగిన కాలయాపన వల్ల మొదటి విడత రూ.9,400 కోట్లు, రెండవ విడత రూ.10,200 కోట్లు రైతులు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మాఫీలో 50శాతం వడ్డీలకే సరిపోయింది. ప్రభుత్వం మాఫీ ప్రకటించడంతో 2014 నుండి బ్యాంకులు రైతులకు నేరుగా రుణాలివ్వకుండా ”బుక్ అడ్జస్ట్‌మెంట్” రెన్యూవల్, రీ-షెడ్యూల్ చేసి వడ్డీలకు వడ్డీలు పెంచి రైతులపై భారాన్ని మోపాయి. కొత్త అప్పులివ్వకపోవడం వల్ల రైతులు వ్యవసాయ రుణాల కోసం ప్రయివేటు రుణాలపై ఆధారపడి అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 18శాతం పంటరుణాలకు 22శాతం వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు నిర్దేశించినప్పటికీ దాన్ని ఖాతరు చేయడం లేదు. వ్యవసాయ రుణాల్లో 15శాతం దళిత, గిరిజనులకు ఇవ్వాలని, మొత్తం రుణంలో 8.3శాతం సన్న, చిన్న కారు రైతులకు ఇవ్వాలని కూడా ఆదేశించింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులందరికీ పంట రుణాలివ్వాలి. కానీ ప్రస్తుతం ఉన్న రైతుల్లో సగం మందికి మాత్రమే బ్యాంకుల్లో అరకొర రుణాలిస్తున్నారు. ఆ రుణాలు పెట్టుబడికి సరిపోకపోవడం వల్ల వారంతా ప్రయివేటు రుణాల ఊబిలోకి నెట్టబడుతున్నారు.
కార్పొరేట్ల ప్రయోజనాల కోసమేనా?
2020 జూన్ 5న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పదొండు నెలల పాటు జరిగిన మహాపోరాటంలో రోజూ లక్షలాది మంది రైతులు పాల్గొన్నారు. చివరికి 2021 నవంబర్‌న కేంద్రం దిగొచ్చింంది. నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటూ ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ పోరాట సందర్భంగా కిసాన్ సంయుక్త మోర్చా తరపున పార్లమెంటులో 1. రుణవిమోచన చట్టం 2. కనీస మద్దతు ధరల చట్టం ప్రతిపక్ష సభ్యుల ద్వారా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదిస్తానని నాడు ప్రధాని హామీనిచ్చారు. 2022 నుండి నేటికీ ఆ చట్టాలను పార్లమెంట్‌లో చర్చకు తీసుకురాలేదు. ప్రతీ రాష్ట్రంలో నేటికీ రైతులు రుణభారం భరించలేక ఉద్యమాలు సాగిస్తూనే ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ధర అనునిత్యం పెరగటం, అదే సందర్భంలో వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గటం వల్ల రైతులు రుణగ్రస్తులు అవుతున్నారు. ఈ రెండు సమస్యల పరిష్కారం జరిగినప్పుడే రైతుల ఆత్మహత్యలు నివారించబడతాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు అంశాలను మినహా ఇతర అనేక అంశాలపై పథకాలను రూపొందిస్తున్నాయి. ఈ రెండు పథకాలు అమలు జరిపినచో కార్పొరేట్ సంస్థల ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని గుర్తించి వాటిని అమలు జరపడం లేదు. ఈ విధానాలను కార్పొరేట్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర స్థాయిలో బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 10-11శాతం మాత్రమే వ్యవసాయ రుణాలిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాపితంగా రూ.18లక్షల కోట్లు పంటరుణాలిస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో రూ.11.5లక్షల కోట్లకు మించలేదు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలలోని శాస్త్రీయతను దెబ్బకొట్టింది. గతంలో కేంద్రం రూ.72 వేల కోట్లు మాఫీ ప్రకటించినప్పుడు ఒకే విడతగా రైతులకు చెల్లించి రైతులను రుణవిముక్తులను చేశారు. ప్రస్తుత రుణ మాఫీ పథకాన్ని కూడా ఒకే విడతగా అమలు చేయాలని 2014 నుండి 2023 వరకు ఆందోళనలు కొనసాగాయి. దాని ఫలితం రాలేదు. ఇందుకు బ్యాంకులు కూడా సహకరించలేదు.
బాధ్యత విస్మరించిన లీడ్ బ్యాంకు
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగానే రాష్ట్రంలోని లీడ్ బ్యాంకు అన్ని బ్యాంకుల నుండి రైతుల రుణ జాబితాలను సేకరించి ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం నుండి మాఫీ తెప్పించి రైతుల ఖాతాలలో జమచేయాలి. కానీ ఆ పనిచేయకుండా ప్రభుత్వం పథకం ప్రకటించిన తర్వాత కూడా రుణ వసూళ్లు, రెన్యూవల్స్, బుక్ అడ్జస్ట్‌మెంట్లు పెద్ద ఎత్తున చేశారు. కొన్ని సహకార సంఘాలు కూడా ప్రభుత్వానికి రుణగ్రస్తుల జాబితాలు పంపడంలో నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా అర్హత కలిగిన వారికి రుణమాఫీ వర్తించలేదు. 9డిసెంబర్2023 తర్వాత రుణం పొందిన వారికి రుణ మాఫీ వర్తించదని తెలిసినప్పటికీ అంతకుముందున్న రుణాన్ని 2024 సంవత్సరానికి రెన్యూవల్ చేశారు. ఫలితంగా ఆ రైతులు రుణమాఫీ నుండి మినహాయించబడ్డారు. 2018 తర్వాత బాకీ ఉన్నవారిని ”వాయిదా మీరిన బాకీదారులుగా” (ఎన్‌పిఎ) నమోదు చేశారు. వారు రుణమాఫీకి అనర్హులయ్యారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీని రైతులకందించాల్సిన ప్రధాన బాధ్యత లీడ్ బ్యాంకుది.కానీ ఆ లీడ్‌బ్యాంకే నివేదికలు తయారు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. కనీసం రిజర్వుబ్యాంకు ఆదేశాలను కూడా బ్యాంకులు పాటించడం లేదు.
పంటకాలం దాటుతున్నా అందని రుణాలు
2024 వానాకాలం పంటలకు నేటికీ రుణాలివ్వలేదు. పంట రుణాలు రూ.42వేల కోట్లుగా ప్రకటించి రూ.7200కోట్లు మాత్రమే ఇచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. దాదాపు పంటకాలం రెండొంతులు దాటింది. ప్రస్తుతం రైతులు పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్న వాస్తవం బ్యాంకులకు తెలియదా? ఒక వైపున రుణమాఫీ జరుగుతున్నప్పటికీ మరోవైపున వసూలు చేయడం, రెన్యూవల్ చేయడం సమంజసమేనా? ఈ పరిస్థితుల్లో ఇంకోవైపున అర్హత కలిగిన వారు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందటం సహజమేకదా! ప్రభుత్వం ప్రకటించిన నిబంధన ప్రకారం 12డిసెంబర్2018 నుండి 9డిసెంబర్2023 వరకు పంట రుణాలు రూ.2లక్షల లోపు ఉన్న జాబితాలను బ్యాంకులు తయారు చేయడం శ్రమతో కూడిన పనికాదు. అయినప్పటికీ అవి చేసిన అవకతవకల వల్ల రైతులు రుణమాఫీ అర్హతను కోల్పోతున్నారు. మాఫీకి ఇచ్చిన నిధులు రైతుల ఖాతాకే చెల్లించాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మాఫీ డబ్బులలో 70-80శాతం జమచేసి మిగిలిన డబ్బులను రైతుల ఇతర ఖాతాలకు మళ్లిస్తున్నారు. లేదా వేరేవిధంగా వినియోగిస్తున్నారు. మాఫీ కింద వచ్చిన డబ్బులను పూర్తిగా తమ ఖాతాలో జమ చేయలేదని అనేకమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనించి ప్రభుత్వం రుణమాఫీ అమలు తీరుపై విజిలెన్స్ శాఖను ఏర్పాటు చేయాలి. బ్యాంకుల్లో రైతుల ఖాతాలను పరిశీలించి అర్హత గలవారికి కలిగించిన నష్టానికి బ్యాంకులను బాధ్యులుగా చేసివారి నుండి పరిహారాన్ని రైతులకు చెల్లించాలి. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, లీడ్ బ్యాంకు నాయకత్వాన రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ రుణమాఫీ అమలయ్యే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. రైతులను రుణవిముక్తులను చేయాలి. తిరిగి కొత్త పంట రుణాలివ్వాలి.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666