ఐరోపా రైతాంగ ఆందోళనకు కారణాలేమిటి!

ఐరోపా రైతాంగ ఆందోళనకు కారణాలేమిటి!వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.ప్రపంచమంతటా పొలాల్లో పనిచేసేందుకు యువత ముందుకు రావటం లేదు.వ్యవసాయమే వృత్తిగా ఉన్న వారిని వివాహం చేసుకొనేందుకు కొన్ని చోట్ల యువతులు సుముఖత చూపటం లేదు. పర్యావరణం పేరుతో అనేక నిబంధనలు, సబ్సిడీల కోతలతో పాటు, చౌకగా ఉత్పత్తుల దిగుమతులతో సాగు గిట్టుబాటు కావటం లేదు. అనేక దేశాలు, ఐరోపా పార్లమెంట్‌కు ఎన్నికల సంవత్సరమిది. ‘మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్న మీరు మమ్మల్ని ఎలా ఓటు అడుగుతారో, మా జీవితాలను ఫణంగా పెట్టి పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటూ’ అనేక దేశాల్లో గ్రామీణులు ఆందోళన బాట పట్టారు. ఎక్కడైనా వ్యవసాయం ఒక్కటే, అందరూ రైతులే. అయితే ఒక్కో దేశంలో ఒక్కో సమస్య ముందుకు వస్తున్నది. రైతులను ఉద్యమాల్లోకి ముందుకు తెస్తున్నది. మార్కెట్‌ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడబడితే అక్కడ అమ్ముకొనేందుకు, నేరుగా ఎగుమతులు చేసుకొని భారీ మొత్తంలో రాబడి పొందేందుకు మూడు సాగుచట్టాలను తీసుకువచ్చినట్లు గతంలో నరేంద్రమోడీ రైతాంగాన్ని నమ్మించేందుకు చూసి, భంగపడి క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గారు.ప్రభుత్వం బాధ్యతలనుంచి తప్పుకొని ప్రయివేటు శక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుంది?
స్పెయిన్‌ అనుభవమే తీసుకుందాం. అక్కడ మార్కెట్‌ యార్డులు లేవు. ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఐరోపాలో జరుగుతున్న ఆందోళనలో స్పెయిన్‌ రైతులు ముందున్నారని పత్రికల్లో విశ్లేషణలొచ్చాయి. టోకు సూపర్‌మార్కెట్ల యజమానులు రైతాంగానికి సరసమైన చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అక్కడ చట్టం ఉంది. దాన్ని అమలు జరిపే నాధుడు లేకపోవటంతో రైతులు పోరుబాట పట్టారు. మనదేశంలో కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన సాగుతున్న సంగతి తెలిసిందే. వినియోగదారులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, తమ ఉత్పత్తులకు ధర రావటం లేదని, ఇతర దేశాల నుంచి పోటీ, 2012 నుంచి 2022 మధ్య కాలంలో దిగుమతులు ఎనభైశాతం పెరిగినట్లు స్పెయిన్‌ రైతులు చెబుతున్నారు. 2023 జూన్‌- సెప్టెంబరు మాసాల మధ్య అంతకు ముందు ఏడాది వచ్చిన సగటు ధరలకంటే రైతుల ఉత్పత్తుల ధరలు తొమ్మిదిశాతం తగ్గినట్లు తేలింది.మరోవైపున సాగు ఖర్చుల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ పేరుతో అమలు జరుపుతున్న నిబంధనలు, నియంత్రణ, చౌకధరలకు దిగుమతులతో తీవ్రమైన విదేశీ పోటీని అక్కడి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నది.దేశీయ రైతుల మీద నిబంధనలను గట్టిగా అమలు జరుపుతున్న పాలకులు కార్పొరేట్‌ కంపెనీల దిగుమతుల మీద ఉన్నవాటిని చూసీ చూడనట్లు వదలివేస్తున్నారు.
ఐరోపా పారిశ్రామిక, సేవారంగ కార్పొరేట్ల నుంచి వస్తున్న ఒత్తిడిని తక్కువ అంచనా వేయకూడదు. ఐరోపా సమాఖ్య దేశాల జీడీపీలో వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది కేవలం 1.4శాతం, ఉపాధి కల్పిస్తున్నది 4.2శాతం మందికి మాత్రమే కాగా సమాఖ్య బడ్జెట్‌లో వ్యవసాయ రంగం 30శాతం పొందుతున్నదని కొందరు లెక్కలు చెబుతున్నారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అంతకంటే తక్కువ ఖర్చుతో దిగుమతులు చేసుకొని కడుపునింపుకోవచ్చు, ఇక్కడ సాగు ఎందుకని ప్రశ్నించటమే. 1960లో స్పెయిన్‌ జీడీపీలో వ్యవసాయ వాటా 23.5శాతం కాగా 2022 నాటికి 2.6శాతానికి, ఉపాధి 39 నుంచి 3.6శాతానికి తగ్గింది. నియంత ఫ్రాంకో పాలనలో మార్కెట్‌ ఎకానమీకి మారిన తరువాత జరిగిన పరిణామమిది.పారిశ్రామిక రంగ జీడీపీ వాటా కూడా ఇదే కాలంలో .30.8 నుంచి 17.4శాతానికి తగ్గగా సేవారంగం 41.7 నుంచి 74.6శాతానికి పెరిగింది.ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో 11.3శాతం మందికి ఉపాధి దొరుకుతుండగా సేవారంగంలో 78.2శాతం ఉన్నారు. దేశంలో తొమ్మిది లక్షల కమతాలుండగా 6.6లక్షల యజమానులు ఏదో ఒక రూపంలో ఐరోపా సమాఖ్య సాయం పొందుతున్నారు. గతేడాది నలభైశాతం ప్రాంతంలో తీవ్రమైన కరవు ఏర్పడింది. తొంభైలక్షల మంది జనాభా మీద ఏదో ఒక నియంత్రణ అమల్లో ఉంది. తెలుగు ప్రాంతాల్లో వేరుశనగ నూనె వంటలకు వాడినట్లుగా స్పెయిన్‌లో ఆలివ్‌ నూనె వినియోగిస్తారు. గడచిన నాలుగేండ్లలో ఉత్పత్తి గణనీయంగా తగ్గి లీటరు ధర ఐదు నుంచి 14యూరోలకు పెరిగింది. దుకాణాల్లో దొంగతనాలు చేసే వస్తువుగా మారింది.
రైతుల ఆందోళన కారణంగా స్థానిక ప్రభుత్వాలు, ఐరోపా సమాఖ్య కొన్ని నిబంధనలను సడలించింది, మరికొన్నింటిని వాయిదా వేసినప్పటికీ మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉన్నాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి పర్యావరణానికి హానికలిగించే వాయువుల విడుదలను 2040 నాటికి తగ్గించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. మీథేన్‌, నైట్రోజన్‌ తదితర వాయువులను 30శాతం తగ్గించాలన్నది ఒకటి. ఓజోన్‌ పొరను దెబ్బతీసే వాయువులు వ్యవసాయ రంగం నుంచి 14.2శాతం వెలువడుతున్నాయని 2050 నాటికి వాటిని సున్నాకు తగ్గించాలన్నది మరొక లక్ష్యం. ఇందుకోసం నిబంధనల జారీ, వాటి అమలుతో రైతాంగం ఆందోళనబాట పట్టారు. మనమీద కూడా దాని ప్రభావం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు పంటలకు ఐదేండ్ల పాటు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తామని చెబుతూ పంటల మార్పిడి విధానం అనుసరించిన రైతులకే అది వర్తిస్తుందనే షరతు పెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడులు జరుపుతోంది గనుక అక్కడి నుంచి ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా 2025 జూన్‌ వరకు వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చని ఐరోపా సమాఖ్య అనుమతి ఇచ్చింది. రష్యాను త్వరలోనే ఓడిస్తామని మా ఆర్థిక మంత్రి చెబితే నిజమే అని నమ్మాం, ఇప్పుడు అలాంటి సూచనలేమీ కనిపించటం లేదు, అదే యుద్దం ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తోందని ఫ్రెంచి రైతులు చెబుతున్నారు.
ఐరోపా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఆధారం చేసుకొని అనేక దేశాల్లో మితవాద శక్తులు జనాల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుంటున్నాయి. జూన్‌లో జరిగే ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఈ శక్తులు బలం పుంజుకుం టాయనే విశ్లేష ణలు వెలువడుతున్నాయి. అనేక చోట్ల స్థానిక ఎన్నికల్లో అలాంటి ధోరణి వెల్లడైంది. పోర్చుగల్‌ ఎన్నికల్లో చెగా అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 7.2శాతం ఓట్లను 18.1కి పెంచుకుంది.
స్పెయిన్‌ రైతుల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఓక్స్‌ అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 24 పార్లమెంటు సీట్లను గతేడాది 33కు పెంచుకుంది. అనేక రాష్ట్రాలలో రైతుల ఓట్లు పార్టీల తలరాతలను మార్చి వేస్తున్నాయి. అనేక దేశాల్లో లాటిన్‌ అమెరికా దేశాలతో స్వేచ్చా, వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాన పార్టీలన్నీ ముందుకు వచ్చాయి. రైతుల ఆందోళన కారణంగా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. జూన్‌లో జరిగే ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ డిసెంబరులో సంతకం చేయాల్సిన ఒక ఒప్పందాన్ని వాయిదా వేయటానికి కారణం అక్కడి రైతుల ఆందోళనే. అదే విధంగా రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకంపై ఆంక్షలు విధించే బిల్లును కూడా వెనక్కు తీసుకున్నాడు. ఇలా తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఎన్నికల తరువాత ముందుకు పోతారని భావిస్తున్నారు. తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని కర్నాటక బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ప్రకటించిన సంగతి తెలిసిందే. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే గతంలో వెనక్కు తీసుకున్న మూడు సాగుచట్టాలను మరో రూపంలో తిరిగి ప్రవేశపెడతారనే భావం కార్పొరేట్లలో ఆశలు రేపుతోంది. అందుకే మద్దతిస్తున్నారు. అనేక దేశాల్లో జరుగుతున్న రైతు ఉద్యమాల నుంచి మనదేశంలో జరుగుతున్న దానిని వేరుచేసి చూడలేము.ప్రపంచీకరణ యుగంలో ప్రతి రంగంలోనూ విడదీయరాని బంధం ఉంటుంది.
లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ప్రచారానికి అనుమతి లేదంటూ పంజాబ్‌లోని అనేక గ్రామాలలో పోస్టర్లు వెలువడినట్లు జాతీయ పత్రికలు వెల్లడించాయి. ”మీరు మమ్మల్ని ఢిల్లీలో ప్రవేశించ నివ్వలేదు గనుక మీ నేతలను గ్రామాల్లోకి రానివ్వం ” అని పోస్టర్లలో హెచ్చరించారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రద్దు చేసిన సాగుచట్టాలను మరో రూపంలో ప్రవేశపెడతారని పంజాబ్‌లో జరుగుతున్న రైతుల సభల్లో హెచ్చరిస్తున్నారు. ఇటీవలనే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సునీల్‌ జక్కర్‌ మార్చినెల 24న భటిండాలో తలపెట్టిన బీజేపీ మహోత్సవ్‌ సభ రైతుల నిరసన కారణంగా రద్దు చేసుకున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది.
ఇలాంటి నిరసనలే అనేక గ్రామాల్లో వెల్లడవుతున్నాయి. రైతుల ఆందోళన పట్ల బీజేపీ వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం, ఎన్‌డిఏ నుంచి అకాలీదళ్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీతో సర్దుబాటు చేసుకొనేందుకు చూసిన బీజేపీ భంగపడింది. రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే బీజేపీతో చేతులు కలిపేందుకు ఆ పార్టీ భయపడిందని చెప్పవచ్చు.” బీజేపీ బండారాన్ని బయటపెట్టండి, బీజేపీని వ్యతిరేకించండి, బీజేపీని శిక్షించండి ” అంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రచారం చేస్తున్నది.
ఎం కోటేశ్వరరావు
8331013288