బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఉద్యోగాల భర్తీ ఏది?

What are the job vacancies in BRS Manifesto?– కాంగ్రెస్‌ హామీలనే పెంచి చెప్పిన కేసీఆర్‌
– మేము రెండులక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాం… దాన్ని ఎందుకు పెంచలేదు?
– కేసీఆర్‌ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారు
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ పోటీ పడి ఉపఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయి
– ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే
– ఫోరెన్సిక్‌ నివేదిక రాక ముందే… డీసీపీ ప్రెస్‌ మీట్‌ ఎలా పెడతారు?
– డీసీపీపై ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తాం
– 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే 90 సీట్లతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం : రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు ఇస్తే, సీఎం కేసీఆర్‌ వాటినే పెంచి బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో అంటూ విడుదల చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ సంఖ్యను పెంచి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్‌ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాష్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనీ, వారంతా తమ తల్లిదండ్రులతో కలిసి 90 లక్షల మంది ఓట్లు వేస్తే కాంగ్రెస్‌పార్టీకి 90 సీట్లు వస్తాయన్నారు. ‘నిరుద్యోగ యువకులారా మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి.30 లక్షల నిరుద్యోగ యువకులారా మరో 45 రోజులు ప్రతీ నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్‌, కేటీఆర్‌ ఉద్యోగాలను ఊడగొట్టాలి’ అని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. మీ ఓటు వేసి కేసీఆర్‌, కేటీఆర్‌ ఉద్యోగం ఊడగొడితే చాలన్నారు. కాబట్టి నిరుద్యోగులే కథానాయకులై, మీరు కదనరంగంలోకి దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు జూపల్లి కృష్ణారెడ్డి, మల్లు రవి, అద్దంకి దయాకర్‌, ఫిరోజ్‌ఖాన్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లతో కలిసి విలేకర్లతో రేవంత్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలండర్‌ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతుందన్నారు.
మద్యం, డబ్బు పంచకుండా ఓట్లు అడగడానికి కేసీఆర్‌ సిద్ధమా?
కేసీఆర్‌ ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని రేవంత్‌ ఆరోపించారు. మ్యానిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు సవాల్‌ విసిరిన సంగతే తెలిసింది. అందుకు తగ్గట్టుగానే రేవంత్‌ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అయితే ఎలక్షన్‌ కోడ్‌ పేరుతో రేవంత్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అమరవీరుల స్థూపం వద్దకు అనుమతించకుండా రేవంత్‌రెడ్డిని గాంధీభవన్‌కు తరలించారు.
ఎక్కడ డబ్బులు దొరికినా కాంగ్రెస్‌వేనా?
పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు కోట్లకొద్దీ కరెన్సీ కట్టలు వస్తున్నాయని తమపై మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఆరోపణలు చేస్తున్నారని రేేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ డబ్బులు దొరికినా కాంగ్రెస్‌వే అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ెఎస్‌ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయన్నారు. హుజూరాబాద్‌, మునుగోడు ఉపఎన్నికలను దేశ ప్రజలంతా చూశారని, అక్కడ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే, పోటీగా బీజేపీ అలాగే ఖర్చు చేసిందన్నారు. ఇక్కడ కేసీఆర్‌ ప్రొటెక్షన్‌ మనీ కింద తమకు ఇచ్చిన మొత్తాన్ని బీజేపీ ఉపయోగించిందన్నారు. తమకు డబ్బులు రాలేదని అక్కడి ప్రజలు ధర్నా చేసేందుకు రోడ్డెక్కిన సందర్భాలు చూశామని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వైన్స్‌ దుకాణాల్లో ప్రతినెల రూ.60 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవనీ, కానీ మునుగోడు ఉపఎన్నిక సమయంలో 20 రోజుల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయని గుర్తు చేశారు.
అమరవీరుల స్థూపం వద్దకు వెళితే అరెస్టు చేస్తారా?
చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్‌కు సవాల్‌ విసిరానని రేవంత్‌ తెలిపారు. మంచి సంప్రదాయాన్ని అందిద్దామనే ఉద్దేశ్యంతో ఆయనను అమరవీరుల స్థూపం వద్దకు ఆహ్వానిస్తే ఆయన రాలేదన్నారు. కేసీఆర్‌ రాకపోగా అమరుల స్థూపం వద్దకు వెళితే నన్ను అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నిర్బంధించారన్నారు. కేసీఆర్‌ మాయ చేసి ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో సిద్ధాంతాలు ప్రచారం చేసి ఓట్లు అడుగుదామనీ, మ్యానిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. నిరుద్యోగ యువతి ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ప్రేమ విఫలమై చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రవళ్లికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్పారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళ్లిక గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రవళ్లిక విషయంలో ప్రెస్‌ మీట్‌ పెట్టిన డీసీపీపై కేసు పెడతామన్నారు. అమ్మాయి ఫోన్‌ సీజ్‌ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని నిలదీశారు. ఫోన్‌ ఓపెన్‌ చేయాలంటే, కోర్టు అనుమతి తీసుకోవాలని అన్నారు. ఫోన్‌ సమాచారం పై ఫోరెన్సిక్‌ నివేదిక రాక ముందే…డీసీపీ ప్రెస్‌ మీట్‌ ఎలా పెడతారని ప్రశ్నించారు. డీసీపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువకులారా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలని కోరారు. ప్రవళ్లిక కుటుంబ సభ్యులను రాహుల్‌గాంధీ వద్దకు తీసుకెళ్లాలనుకుంటే…బీఆర్‌ెఎస్‌ నేతలను పంపి ఆ కుటుంబాన్ని ప్రగతిభవన్‌లో బంధిస్తారనీ, కేసీఆర్‌ ఇంతటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
నేడు వరంగల్‌కు రాహుల్‌, ప్రియాంక గాంధీ
కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనున్న బస్సు యాత్రలో రాహుల్‌, ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని దర్శించుకుంటారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను శివుడి ముందుంచి పూజించి, ఆ తర్వాత బస్సు యాత్ర ప్రారంభిస్తారు. మొదటి రోజు ములుగు, భూపాలపల్లిలో మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. రెండో రోజు కరీంనగర్‌ జిల్లాలో, మూడో రోజు నిజామాబాద్‌ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది.
రజినీకి ఉద్యోగం రేవంత్‌ హామీ
నాంపల్లికి చెందిన వికలాంగులరాలు రజినీ మంగళవారం గాంధీభవన్‌లో రేవంత్‌ను కలిశారు. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదనీ, ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదంటూ రజినీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రేవంత్‌….డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే అర్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.
రేవంత్‌ను కలిసి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాపురావు
ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు మంగళవారం హైదరాబాద్‌లోని రేవంత్‌ నివాసంలో ఆయన్ను కలిశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని రేవంత్‌ సోమవారం రాత్రి ఆయన నివాసంలో కలిశారు.
కాంగ్రెస్‌లో చేరికలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ నాయకులు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. చేరిన వారిలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్య గౌడ్‌, సర్పంచ్‌ లక్ష్మణ్‌ నాయక్‌, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు ప్రతాప్‌, మంజుల, బాల్‌రాజు, గోపాల్‌, రాములు, యాదయ్య, జహంగీర్‌, కౌన్సిలర్లు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలానికి చెందిన పలువురు నాయకులు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.