– నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ
నవతెలంగాణ-హైదరాబాద్
ఐపీఎల్ 17 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. రాజస్థాన్, కోల్‌కత దాదాపుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. చెన్నై, లక్నో, హైదరాబాద్‌లు టాప్-4లో చోటు కోసం పోటీపడుతున్నాయి. ఈ మూడు జట్లు 11 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో సమవుజ్జీలుగా కొనసాగుతున్నాయి. చివరి మూడు మ్యాచుల్లో మెరిసిన జట్టును ప్లే ఆఫ్స్ బెర్త్ వరించనుంది. నేడు ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో సూపర్‌జెయింట్స్ ఢకొీట్టనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఓ అడుగు ముందుకేయనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి మూడు మ్యాచులను సొంతగడ్డపైనే ఆడనుంది. ఇది పాట్ కమిన్స్ సేనకు అతిపెద్ద అనుకూలత. ఈ సీజన్లో ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట సన్‌రైజర్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఐపీఎల్ బ్యాటింగ్ రికార్డులను తిరగరాసింది. బౌలర్లు సైతం అద్భుతంగా రాణిస్తున్నారు. కొత్త బంతితో భువనేశ్వర్ కుమార్, మిడిల్ ఓవర్లలో పాట్ కమిన్స్, డెత్ ఓవర్లలో నటరాజన్ అదరగొడుతున్నారు. స్పిన్నర్లు సైతం మెరిస్తే హైదరాబాద్ బౌలింగ్‌కు ఎదురులేదు. ట్రావిశ్ హెడ్, అభిషేక్ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. హెన్రిచ్ క్లాసెన్ ఫామ్ కోల్పోయాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన సమయంలో క్లాసెన్ ఫామ్ సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకం. నితీశ్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ మరింత క్రీయాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.