వచ్చేది సంకీర్ణమే

What comes is a coalition– బీజేపీకి 200సీట్లు కూడా డౌటే
– మోడీ ఛోటే భారులు అదానీ, రేవంత్‌
– సింగరేణిని ముంచేందుకు కుట్రలు
– బీఆర్‌ఎస్‌ బలంగా ఉంటేనే కాంగ్రెస్‌ వాగ్దానాలు నెరవేరుస్తది : రామగుండం బస్సుయాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ – రామగుండం/ గోదావరిఖని
ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని, బీజేపీ 200 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 48 గంటల నిషేధం తర్వాత బీఆర్‌ఎస్‌ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండంకు చేరుకుంది. వేలాది మంది నాయకులు, కార్యకర్తల ర్యాలీ నడుమ రామగుండం కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్‌ నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల బిల్లులు చెల్లించడం లేదని, దీంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదనతో ఒక మాట అన్నందుకే ప్రభుత్వం కక్ష్య గట్టి ఈసీకి ఫిర్యాదు చేసి తనపై నిషేధం విధించేలా చేశారన్నారు. ఇదే ప్రధాని, కేంద్ర మంత్రి ఇష్టానురీతిగా మాట్లాడితే ఎన్నికల కమిషన్‌ ఎలాంటి నిషేధాలు విధించడం లేదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఐదు నెలల కిందటి పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని, జిల్లాలో 50వేల ఎకరాలకుపైగా పంట ఎండిపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీరు అందక పంట ఎండిపోయిన దాఖాలాలు లేవని, కరెంట్‌ కోతలు లేవని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో పాత పరిస్థితులే ఎదురవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్న బస్సు ఫ్రీని సమర్ధిస్తున్నామని, తమకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ దీనివల్ల ఎంతో మంది ఆటో కార్మికులు కుటుంబం గడవక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేసేలా ఉద్యమించాలని, దానికి అండగా తాము అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అమలు చేయడంలేదన్నారు. సింగరేణిని నిండా ముంచిందే కాంగ్రెస్‌ అని, గతంలో వారసత్వ ఉద్యోగాలను తిరిగి కారుణ్య నియామకాల కింద అమలు చేయించి, 19వేల మంది పిల్లలకు ఉద్యోగాలు కల్పించామని, సింగరేణి పేరిట మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయించామని తెలిపారు. ఇప్పుడు నరేంద్ర మోడీ, రేవంత్‌ రెడ్డి కలిసి సింగరేణిని ప్రయివేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, కార్మికులు జాగ్రత్తగా ఉండాలన్నారు. సింగరేణి ప్రయివేటీకరణను అడ్డుకోవాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎంపీలుగా గెలవాలని, ఆ బాధ్యత ప్రజలపైనే ఉందని, ఈ సారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుడిగా పని చేసిన, కార్మిక కష్ట సుఖాలు తెలిసిన కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌, జెడ్పీ చైర్మెన్‌ పుట్ట మధూకర్‌, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, బాల్క సుమన్‌, దాసరి మనోహర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు కౌశిక హరి, టీబీజీకేఎస్‌ నాయకులు మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.