పార్లమెంటు ఎలక్షన్లు జరిగి కనీసం ఆర్నెల్లు కూడా పూర్తి కాలేదు. మన ప్రధాని మోడీగారు అప్పుడే వచ్చే సార్వత్రిక ఎన్నికల (2029) గురించి ఊదరగొట్టడం ప్రారంభించేశారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో మాట్లా డుతూ… ‘నాలుగోసారీ ఢిల్లీ పీఠం మాదే…’ అంటూ నొక్కి వక్కాణించారు. ఇప్పుడైతే చంద్రబాబు మీద, నితీశ్ మీద ఆధారపడి బండి లాగించేస్తున్నారు కాబట్టి, బీజేపీ కూసింత భయంతో, భక్తితో నడుచుకుంటున్నట్టు కనబడు తోంది. కానీ గత రెండు దఫాలు ఇష్టానుసారంగా పాలించి, జనంపై భారాల మీద భారాలేసి నడ్డి విరిచింది ఈ కాషాయ దళపతులే కదా? నిర్దిష్ట ప్రణాళిక లేకుండా అర్థంపర్థం లేకుండా చేసిన పెద్దనోట్ల రద్దుతో ముసలోళ్లను సైతం బ్యాంకుల ముందు క్యూలో నిలబెట్టిన ఘనత కమలాధీశులదే కదా? జీఎస్టీతో కాఫీ దగ్గర్నుంచి కార్ల వరకూ అన్నింటి మీద పన్నుల మీద పన్నులేసి ావబాదింది వారే కదా? పెట్రో భారాలను పెంచి నిత్యావసరాల ధరలతో మనకు చుక్కలు చూపించింది కూడా ’58 అంగులాల’ ఛాతి ఉన్నవారే కదా?
కరోనా సమయంలోనూ వంట గ్యాస్ ధరల పేరుతో రూ.400 ఉన్న బండ బరువును రూ.వెయ్యి దాకా పెంచి, అంబానీ, ఆదానీలో సేవలో తరించింది ‘ఈ మిత్రోన్’లే కదా? కోవిడ్ నివారణకు చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి, అప్పడాలు తినండంటూ ప్రచారం చేసింది ఈ ‘న.మో.’ గారు, ఆయన వీరభక్తులే కదా? ఇలా చెప్పుకుంటే పోతే…2014 నుంచి ఈ ‘అరివీర భయంకర దేశ భక్తులు’ చేసిన మోసాలు, జనానికి పెట్టిన వాతలు అన్నా..ఇన్నా…? అందుకే ఇటీవల మోడీ స్పీచ్ విన్న తర్వాత ఈ రిపోర్టర్ డైరీ రూపంలో ఆయనకు ఒకటే ఒక ప్రశ్న వేస్తున్నా… ‘ప్రధాని గారూ…గత పదేండ్లుగా మీరు ఏం ఇరగబొడిశారు…?’ జర చెప్పండి సార్!
– కేఎన్ హరి