సుప్రీంలోనే ‘దైవాధీనం తీర్పు’లయితే – ప్రజలేం కావాలి?

If the Supreme Court is 'divine judgment' - what do the people want?”మా ముందు కొన్ని సంక్షిష్టమైన, సున్నిత మైన కోర్టుకేసులు వచ్చినపుడు తీర్పు ఎలా ఇవ్వాలో మాకు అంతు పట్టదు. అలా ఈ దేశంలో చాలాకాలంగా నానుతూ వస్తున్న బాబ్రీ మసీదు కేసు నాముందు మూడు నెలలుగా ఉన్నప్పుడు – నాకు ఎటూ పాలుపోలేదు. అప్పుడు నేను దేవుడి ముందు కూర్చుని ప్రార్థించాను. దీనికో పరిష్కారం చూపమని అర్థించాను. చివరకు ఆ భగవంతుడే నాకొక దారిచూపాడు. ఆయన కరుణాకటాక్షంతోనే నేను బాబ్రీ మసీదు తీర్పు రాయగలిగాను” – అని బాహాటంగా బహిరంగ సభలో సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ప్రకటించారు. ప్రకటించారు సరే, కానీ- ఆ ప్రకటన ఈదేశ జన బాహుళ్యాన్ని భయకంపితుల్ని చేసింది. తీర్పులు-ఈ దేశ రాజ్యాంగం ప్రకారం, ఇక్కడ అమలవుతున్న చట్టాలను అనుసరించి కదా న్యాయమూర్తులు తీర్పుఇవ్వాలీ? మరి ఇదేమిటీ? దేవుడి ఆదేశానుసారం ఒక ‘దైవాధీనం తీర్పు’నిచ్చానని స్వయంగా సీజేఐ, డి.వై. చంద్రచూడ్‌ అలా ఎందుకు చెప్పుకున్నారూ? ఆయనకు ఏమైందీ? వాస్తవ ప్రపంచంలోంచి ఆయన భ్రమల్లోకి జారు కున్నారా? సుప్రీంకోర్టు పట్ల, న్యాయవ్యవస్థ పట్ల ఈ దేశ ప్రజలకున్న నమ్మకాన్ని అలా ఎందుకు బద్దలు కొట్టారు?
2024 నవంబర్‌ రెండోవారంలో పదవీ విరమణ చేయడానికి కొన్ని వారాల ముందు తన స్వగ్రామం – పూణేలోని ఖేడ్‌ తాలూకా కన్హర్‌సర్‌ గ్రామంలో ఒక బహిరంగసభలో తన గ్రామస్తులను ఉద్దేశించి ఛీఫ్‌ జస్టిస్‌ మాట్లాడిన మాటలవి. ఆ రకంగా ఆయన తనను తాను దిగజార్చుకున్నారు. సుప్రీంకోర్టు స్థాయిని దిగజార్చారు. అంతే కాదు, దేశ రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేశారు. 16వ ఛీఫ్‌ జస్టిస్‌ అయిన యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ కుమారుడు ధనుంజరు యశ్వంత్‌ చంద్రచూడ్‌ 50వ ఛీఫ్‌ జస్టిస్‌ అయ్యారు ఢిల్లీ విశ్వ విద్యాలయం, కేంబ్రిడ్జి హార్వర్డ్‌ లా స్కూల్‌లో విద్యనభ్యసించారు. అనేక ఉన్నత పదవులు నిర్వహించిన తర్వాత 2022 నుండి ఛీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాగా సుదీర్ఘకాలం కొనసాగారు.
2024 పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఈ దేశ ప్రధాని నరేంద్రమోడీ తనకూ తన తల్లికి బయలాజికల్‌గా సంబంధం ఉన్నట్టు లేదని- నేరుగా ఆ భగవంతుడే తనను ఈ పవిత్ర భారతావనికి పంపించాడని ప్రకటించు కున్నారు. ఏం సామాన్యుల్ని కాల్చుకుతింటూ, కార్పోరేట్లను బతికించమని, బలిపించమనీ పంపించాడా? పైగా తానొక భగవత్‌ స్వరూపుడని తన అంధ భక్తులతో పొగిడించుకున్నారు కూడా! ఇవన్నీ కాకుండా సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ ఇంటికి పరుగెత్తుకెళ్లి, అక్కడ ఆయన ఇంట్లో గణేష్‌పూజ చేసి వచ్చారు. ప్రధాని, ఛీఫ్‌ జస్టిస్‌ ఇద్దరూ హిందు వులమని, దైవభక్తి గలవారమని బాహాటంగా చెప్పుకున్నట్లయ్యింది. తాము భ్రమల్లో బతుకుతున్నామని కూడా దేశ ప్రజలకు చెప్పినట్లయ్యింది. వాస్తవంలో బతుకుతున్న దేశ ప్రజలకు వారి మాటల పట్ల అభ్యంతరాలు ఉండటం సహజం. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి, రాజ్యాంగం ప్రకారం ప్రమాణాలు చేసి, ఆయా పదవుల్లో కూర్చున్న వారు – రాజ్యాంగాన్ని చులకన చేయవచ్చా? న్యాయమూర్తులు తీర్పులు రాజ్యాంగ బద్దంగా కాకుండా – దేవుడి మీద భారం వేసి విధులు నిర్వహించవచ్చా ? ఇదేక్కడి పద్దతీ?
కింది కోర్టు నుంచి, సుప్రీం కోర్టు దాకా ఏ జడ్జి అయినా, న్యాయశాస్త్ర గ్రంథాలు ముందేసుకుని కూచోవాలి. అధ్యయనం చేయాలి.అందులోని చట్టాలను అనుసరించి తీర్పులు రాసుకోవాలే గానీ, దేవుడి పటాల ముందు కూర్చుని, ఆయన మీద భారం వేసి, ప్రార్థనలూ, భజనలూ చేస్తూ తీర్పులు రాసుకుంటే ఎలా? వైజ్ఞానిక స్పృహ కాదు గదా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తే ఎలా? విశ్వాసాలేవైనా ఉంటే ఉండొచ్చు. వాటిని వ్యక్తిగత స్థాయి లోనే ఉంచుకోవాలి! రాజ్యాంగాన్ని తక్కువ చేసి, తమ వ్యక్తిగత విశ్వాసాల్ని పెద్దవి చేసుకుని -వాటినే జనం కూడా నమ్మాలనుకోవడం- మూర్ఖత్వమవుతుంది. ఉన్నత పదవులకు చేరుకున్న వారు, వారి మూర్ఖత్వాన్ని కాస్త దాచి పెట్టు కోవాలి కదా? న్యాయమూర్తులు ప్రజలకూ, ఈ సమాజానికీ ఉపయోగపడాలంటే వారు తమ వివేకాన్ని తట్టి లేపాల్సి ఉంటుంది. వైజ్ఞానిక అవగాహనతోనే న్యాయానికి దారులు వేయాల్సి ఉంటుంది. చంద్రచూడ్‌ చెప్పిన మాటే ఇతర మతాలకు చెందిన న్యాయమూర్తులు చెబితే ఎలా ఉండేదీ? మా అల్లా చెప్పిన విధంగా తీర్పిచ్చానని ఓ ముస్లిం జడ్జి, మా యోహోవా ప్రభువు చెప్పిన విధంగా తీర్పిచ్చానని ఓ క్రిస్టియన్‌ జడ్జి, వాయుగురు చెప్పిన విధంగా తీర్పిచ్చానని ఓ సిక్కు జడ్జి చెబితే – దేశం ఇలా ఇంత ప్రశాంతంగా ఉండేదా? ఆరెస్సెస్‌, బీజేపీకి చెందిన అన్ని విభాగాలు, అన్ని శాఖలు కలిసి మూకుమ్మడిగా ఎన్ని మారణహోమాలు సృష్టించేవీ? ఊహకే అందదు కదా?
సుప్రీంకోర్టు మాజీ జడ్టి మార్కండేయ కాట్జూ ఈ విషయం మీద మాట్లాడుతూ – ‘భగవంతుడి సలహామేరకు డి.వై.చంద్రచూడ్‌ సరైన తీర్పులిస్తున్నట్లయితే… మరి గతంలో తను, పదవిలో ఉండగా ఇచ్చిన తీర్పులన్నీ సరైనవి కావని అర్థం! ఎందుకంటే కోర్టు తీర్పుల విషయంలో తను ఎన్నడూ భగవంతుడి సహాయం కోరలేదు – చట్టబద్దంగా, రాజ్యాంగ బద్దంగా మాత్రమే తీర్పులిచ్చాను. కారణం నేను ఒక హేతువాదిని! నేను ఏ దేవుణ్ణీ, ఏ అతీతశక్తినీ నమ్మను”. – అని అన్నారు. దేశంలో ఉన్న ‘సింబల్‌ ఆఫ్‌ జస్టిస్‌’ (ప్రతిమను) ఛీఫ్‌ జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ ఇటీవల మార్పించారు. ఎప్పుడో బ్రిటీష్‌ కాలం నుండి న్యాయానికి సంకేతంగా ఉన్న గుర్తును ఇప్పుడు ఈయన మార్పించారు. పాత ప్రతిమకు కండ్లకు గంతలు కట్టి ఉంటాయి. ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో ఖడ్గం ఉంటుంది. ఆ ప్రతిమకు ఉన్న అర్థం ఏమి టంటే – ”న్యాయం కోసం వచ్చేవాళ్లూ ఎవరూ అన్నది చూడను. ఇరుపక్షాల వాదనలు విని, సమంగా తూకం వేసి, తప్పు చేసినవారికి శిక్ష వేస్తాను” – అని! ఇప్పుడు ఆ ప్రతిమను మార్పించి, చంద్రచూడ్‌ ఒక హిందూ దేవతను తయా రు చేయించారు. ఈ ప్రతిమ కండ్లు, కప్పి ఉండవు- న్యాయం కోసం వచ్చినవారు ఎవరన్నది స్పష్టంగా చూస్తుంది. కులం, మతం, ఆర్థిక స్థోమత, వారి ఆలోచనా ధోరణి – అన్నింటినీ స్పష్టంగా చూసే తీర్పు ఇస్తుందన్నమాట! ఒక చేతిలో యధావిధిగా త్రాసు ఉంది. మరొక చేతిలో చిన్న పుస్తకం ఉంది. అయితే ఆ పుస్తకం మీద ‘రాజ్యాంగం’ అని రాసి లేదు గనక అధికారంలో ఉన్నవారు దాన్ని ‘మనుస్మృతి’గా భావించినా భావించుకోవచ్చు. పోనీ చేతలోని పుస్తకం రాజ్యాంగమే అనుకున్నా – హిందూ దేవత నిలువెత్తు విగ్రహం చేతిలో అది అప్రధానమై పోయింది. తీర్పు రాజ్యాంగ బద్ధంగా కాకుండా, హిందూ దేవత ఇష్టానుసారం ఉంటుందని – ఛీఫ్‌ జస్టిస్‌ ఈ దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నారా? అధికారంలో ఉన్నవారికి అనుగుణంగా తీర్పులుంటాయని చెప్పదలుచు కున్నారా?
మార్పించిన సింబల్‌ ఆఫ్‌ జస్టిస్‌ ప్రతిమను – సుప్రీంకోర్టు లైబ్రరీ హాల్లో చంద్రచూడ్‌ పెట్టించారు. అది ఇప్పుడు వివాదాస్పదమైంది. ఏదైనా మనం అన్వయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. నిజమే. కానీ, ఛీఫ్‌ జస్టిస్‌ ఏమి ఆశించి, అధికారంలో ఉన్నవారికి వంత పాడుతున్నారో తెలియదు. పదవీ విరమణకు ముందు చంద్రచూడ్‌ తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకున్నారా? అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన విమర్శలను తట్టుకోలేక చంద్రచూడ్‌, వితండ వాదన చేశారు. ”ప్రభుత్వధినేత అయిన మోడీని కలవడం తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఏ మాత్రం కాదు.
ఛీఫ్‌ జస్టిస్‌ ఆఫీసుకు మోడీ వచ్చినా, ప్రైం మినిష్టర్‌ ఆఫీసుకు ఛీఫ్‌ జస్టిస్‌ వెళ్లినా – అదీ అధికారి కంగా వెళ్తే ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. అనధికారికంగా ఒకరి ఇంట్లో ప్రత్యేకంగా కలిసి గణేష్‌ పూజ చేయడం- ఆ వెనువెంటనే బాబ్రీ మసీదు తీర్పు దైవ సహాయంతో ఇచ్చానని చెప్పుకోవడం – చంద్రచూడ్‌ ఛీఫ్‌ జస్టీస్‌గా తన వ్యక్తిత్వాన్ని, స్థాయిని తానే పూర్తిగా భూస్థాపితం చేసుకున్నట్లయ్యింది.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఎంత ముఖ్యమో అడ్వొకేట్‌లు కూడా అంతే ముఖ్యం. అడ్వోకేట్లు కేసు తెచ్చి వాదించకపోతే, న్యాయమూర్తులు తీర్పులు వేటిమీద ఇస్తారూ? ఆ వ్యవస్థలో ఎవరినీ తక్కువచేసి చూడలేం. అలాంటప్పుడు ‘సింబల్‌ ఆఫ్‌ జస్టీస్‌’కు ‘ఒక హిందూ దేవత ఆకారం, పైగా కండ్లు తెరచి చూస్తున్న ప్రతిమ తయారు చేయించి పెట్టించినపుడు చంద్రచూడ్‌ బార్‌ అసోసియేషన్‌ను సంప్రదించాల్సింది. వారి అభిప్రాయం కూడా తీసు కున్న తర్వాతే ప్రతిమను తయారు చేయించాల్సింది. తాను ఛీఫ్‌ జస్టీస్‌ కాబట్టి, తనకు ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదనుకున్నాడేమో – బహుశా – ఆ అహంకారమే కొంపముంచింది. రాజ్యసభ సభ్యుడైన కపిల్‌ సిబల్‌ అధ్యక్షుడిగా ఉన్న సుప్రీంకోర్టు, బార్‌ అసోసియేషన్‌ – కొత్తగా రూపొందించిన ‘సింబల్‌ ఆఫ్‌ జస్టీస్‌’ పట్ల తమ తీవ్ర అసంతృప్తిని తెలియజేసింది. సుప్రీంకోర్టు అడ్వోకేట్లందరూ సంతకాలు చేసి తమ నిరసనను తెలియజేస్తూ లేఖ రాశారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని అధికారంలో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి, దేశంలోని అధిక సంఖ్యాకులైన బహుజనులు, ఇతర మతాల ప్రజలు ఈ హిందూ దేవత ప్రతిమను వ్యతిరేకించే అవకాశం ఉంది.
ఈ కొత్త ప్రతిమ దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా వివాదాస్పదమైంది. ”సింబల్‌ ఆఫ్‌ జస్టిస్‌కు కండ్లగంతలు విప్పేశారు. నిజమే కానీ, ఏ ట్రయలూ లేకుండా నాలుగేండ్లుగా జైల్లో మగ్గుతున్న విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలిద్‌ విషయం సుప్రీంకోర్టు ఇకనైనా తేలుస్తుందా?” అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రశ్నించింది. అంతేకాదు, చంద్రచూడ్‌ ప్రజల పక్షాన నిలిచి ఇచ్చిన తీర్పులేవీ? ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా డబ్బు దండుకోవడం నేర మన్న చంద్రచూడ్‌, బీజేపీ నేతల్ని శిక్షించలేదు ఎందుకూ? ఫాదర్‌ స్టాన్‌స్వామి, జి.ఎస్‌ సాయిబాబాల మరణాలకు చంద్రచూడ్‌ బాధ్యత వహిస్తాడా? జమ్మూ కాశ్మీర్‌ విషయంలో ఆర్టికల్‌ 370ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసినపుడు అంతా చట్టబద్దమే – అని కప్పిపుచ్చారు కదా? హిడెన్‌ బర్గ్‌ విషయంలో ఆదానీకి క్లీన్‌చీట్‌ ఇచ్చినవారు, మహారాష్ట్రలో చట్టవిరుద్దంగా ఏర్పడ్డ షిండే, అజిత్‌ పవార్‌ల ప్రభుత్వాన్ని సమర్థించినవారు. ‘చరిత్ర నన్నెలా గుర్తుపెట్టు కుంటుందని’ పాపం తెగ బాధపడిపోయారు. ”చేతిలో అధికారం ఉండగా ఒక మనిషి, దానితో ఏం చేశాడన్న దాని మీదే అతనేమిటన్నది కొలవగలం!” – అని అన్నాడు ప్లేటో. ఇప్పుడు అది చంద్రచూడ్‌కు వర్తిస్తుంది.
– సుప్రసిద్ద సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ (మెల్బోర్న్‌ నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు