ఏం తేల్చుతారో?

What do you think?– చాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ భేటీ నేడు
దుబాయ్‌: 2025 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ వేదిక వ్యవహారం మరింత ముదిరింది. పాకిస్థాన్‌లో పర్యటించలేమని భారత క్రికెట్‌ నియంతణ్ర మండలి (బీసీసీఐ) ఐసీసీకి రాసిన లేఖను.. తాజాగా పీసీబీకి అందజేశారు. భారత్‌ నిర్ణయంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మోషిన్‌ నక్వీ స్పందించారు. ‘భారత్‌లో ఐసీసీ టోర్నీలకు పాకిస్థాన్‌ జట్టు అక్కడికి వెళ్లింది. కానీ పాక్‌లో ఐసీసీ టోర్నీకి భారత్‌ ఇక్కడకు రావటం లేదు. ఇటువంటి అసమాన వైఖరిని అంగీకరించం. భవిష్యత్‌లో భారత్‌లో జరిగే టోర్నీలకు సైతం పాక్‌ జట్టును పంపబోమని’ నక్వీ అన్నారు.
నేడు కీలక సమావేశం: చాంపియన్స్‌ ట్రోఫీ వేదిక, నిర్వహణ మోడల్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నేడు నిర్ణయం తీసుకోనుంది. భారత్‌ కోరుతున్నట్టుగా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలా? లేదంటే పీసీబీ డిమాండ్‌ చేస్తున్నట్టు పూర్తి టోర్నమెంట్‌ పాక్‌లోనే జరపాలా? అనే అంశంపై ఐసీసీ బోర్డు సమావేశంలో తేల్చనున్నారు. అవసరమైతే ఈ అంశంలో సభ్య దేశాలను ఐసీసీ ఓటింగ్‌కు కోరే అవకాశం ఉంది. మరో వారంలో జై షా ఐసీసీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే ఇతర దేశాల క్రికెట్‌ బోర్డులు బీసీసీఐకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఎక్కువ. ఐసీసీ బోర్డు సమావేశంలో హైబ్రిడ్‌ మోడల్‌కు మొగ్గుచూపితే.. పాకిస్థాన్‌కు మరో గత్యంతరం ఉండదు. దీంతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పాక్‌ ప్రభుత్వంతో చర్చించి క్రికెట్‌ అభిమానులకు శుభ వార్త చెప్పేందుకు ప్రయత్నిస్తామని నక్వీ అన్నారు. ఐసీసీ బోర్డు నేడు వర్చువల్‌ సమావేశం కానుంది.