ఛండీఘర్‌లో ఏం జరిగిందంటే..!

What happened in Chandigarh..!ఇటీవల జరిగిన పంంజాబ్‌, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని ఛండీఘడ్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ బరితెగించింది. ఆ నగరంలో ప్రజల చేత ఎన్నికైన 35 మంది కౌన్సిలర్‌లు, ఒక పార్లమెంటు సభ్యుడు కలిసి నగర మేయర్‌ను ఎన్నుకోవాలి. ఎవరు ఎటుపక్క నిలిపి చేతులెత్తించినా చాలు. ఎన్నిక సుస్పష్టంగా తేలి పోతుంది, తెలిసిపోతుంది. బడిపిల్లలకైనా ఈ ప్రజా స్వామ్య ఎన్నిక ప్రక్రియ చాలా సులువుగా అర్థమై పోతుంది. కానీ బీజేపీ మసి పూసి మారేడుకాయ చేయదలచింది. ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన బీజేపీ వ్యక్తి ఎలాగైనా సరే తమ పార్టీ మనిషినే మేయర్‌గా చేయాలని భావించాడు. అందుకే కావాలని రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధ్దతికి పట్టు బట్టాడు. చేసేదిలేక కౌెన్సిలర్‌లు ఆ ఓటింగ్‌ పద్ధతిలో పాల్గొన్నారు. తమకు నచ్చిన వ్యక్తికి అను గుణంగా ఓట్లేసారు ఎన్నిక ముగిసాక, తీరా బాక్స్‌ లోని ఓట్లు తీసి లెక్కవేస్తూ ఎనిమిది మంది కాంగ్రెస్‌ కౌన్సి లర్‌ల ఓట్లు చెల్లవని అడ్డంగా గీతలు గీసాడు. మిగిలిన చెల్లిన ఓట్లలో ఆప్‌-కాగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థికన్నా బీజేపీ అభ్యర్థికే నాలుగు ఓట్లు అధికంగా వచ్చాయాని డిక్లేర్‌ చేసాడు. సి.సి.కెమెరాలతో సహా అందరూ చూస్తుండగానే ఈ ఘోరం జరిగిపోయింది. బీజేపీ నామినేటెడ్‌ కౌన్సిలర్‌ అనిల్‌ మాసి రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. తన బీజేపీ అభ్యర్థి మనోజ్‌ శంకర్‌ మేయర్‌ అని ప్రకటించాడు.
పట్టపగలు, నగరం నడిబొడ్డున జరిగిన ‘ప్రజాస్వామ్య హత్యగా’ ఈ ఘటనను రాజకీయ పరిశీలకులు అభి వర్ణిం చారు. ఎందుకంటే ఇది పొరపాటున జరిగిన తంతుకాదు. అత్యంత హేయమైన బీజేపీ లజ్జాకర బరితెగింపు గానే దానిని భావించాలి. కనుకనే ఈ కేసు ఘటన పూర్వాపరాలు నిశితంగా పరిశీలించిన సుప్రీం ధర్మాసనం భారత ఎన్నికల వ్యవస్థకు ఇది ‘మాయని మచ్చ’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యా నించింది. అక్కడితో ఆగకుండా తాజా మలి తీర్పులో… తొత్తడంగా మార్చిన ఆ బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లదంటూ, ఆప్‌ – కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి కులదీస్‌ కుమారే సిసలైన విజేత మేయర్‌గా ప్రకటించింది.
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు భారత ప్రజా స్వామ్య ప్రస్థానంలో నిస్సందేహంగా ఓ మైలురాయి వంటిదని న్యాయనిపుణులు అంటున్నారు. ఓ సాధారణ నగర మేయర్‌ ఎన్నికే కావచ్చు కానీ బీజేపీ దుర్మార్గ వైఖరికి ఇది చెంపపెట్టుగా నిలిచింది.ఇందుకోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 142 కింద తనకు దఖలైన విశిష్ట అధికారాలను సుప్రీం ఉపయోగించుకున్నది. రిటర్నింగ్‌ అధికారి చెల్లనివిగా ప్రకటించిన ఎనిమిది ఓట్లను సుప్రీం స్వయంగా పరిశీలించింది. అవి ఎందుకు చెల్లుబాటు కాలేదు? కారణం ఏమిటి? అని సుప్రీం ఆ రిటర్నింగ్‌ అధికారి ని నిగ్గదీసింది. సదరువ్యక్తి సరైన సమా ధానం చెప్పక నీళ్లు నమలడంతో, ఆ ఓట్లు వాస్తవంగా కులదీప్‌కుమార్‌కే పడ్డట్టు తేల్చి విజేతగా ఆ కుల దీప్‌నే ప్రకటిస్తూ విస్పష్ట తీర్పునిచ్చింది.
ఎన్నికల విషయంలో రిటర్నింగ్‌ అధికారి పాత్ర సక్రమంగా లేదని పేర్కొంటూ ఆ వ్యక్తి శిక్షా ర్హుడు అని ప్రకటించింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన బాధ్యత తమవంటి ధర్మాసనాల పైన ఉన్నదని ఆ తీర్పులో నొక్కి చెప్పింది కూడా, అందుకే ఇదో చారిత్రక తీర్పుగా విపక్షాలు భావి స్తున్నాయి. ఎన్నికను తొత్తడం చేయడం ఓ తప్పు అయితే, అంతా నిజమే చెప్తానని అబద్దం చెప్పడం మరో నేరమని సుప్రీం తెలిపింది. తప్పు జరిగింది కౌంటింగ్‌లో కనుక మొత్తం ఎన్నికల ప్రక్రియనే తిరగతోడాల్సిన అవసరంలేదని చెబుతూ బీజేపీ కుట్రను వమ్ము చేసింది. చివరి అంకంలో ఆ రిటర్నింగ్‌ అధికారి చేసి న కుట్రను సరిదిద్దేందుకే తాము నేరుగా జోక్యం చేసుకుని నిజమైన విజేతను ప్రకటించాల్సి వచ్చిందని వివరించింది.
చట్టాలకు దొరక్కుండా యధేచ్ఛగా తప్పించుకు తిరగ వచ్చని, ఒకవేళ దొరికినా తమని ఎవ్వరూ ఏమి చేయలేరనే తెంపరితనాన్ని ఈ తీర్పు పటాపంచలు చేసింది. కనుకనే బీజేపీ ఈ విషయంలో తేలుకుట్టిన దొంగలా మిన్నకుండి పోయింది. కెమెరా క్లిప్పింగ్‌ల ఆధారంగానే సుప్రీం ఈ తీర్పును వెల్లడి చేసింది. ఏ దేశ ప్రజా స్వామ్య వ్యవస్థకైనా ఎన్నికల ప్రక్రియే ప్రాణాధారం. అయితే ఆ ప్రక్రియ స్వేచ్ఛ గా, నిస్పక్ష పాతంగా, పారదర్శకంగా జరగ కుంటే ఆ ప్రక్రి యకు అర్థమే ఉండదు. అందుకే మహాకవి శ్రీశ్రీ ఏనాడో ప్రశ్నించాడు. ‘దొంగనోట్ల దొంగ ఓట్ల రాజ్యమొక రాజ్యమా? అని. ప్రస్తుతం ఈ.వి.ఎం. మిషన్‌ల ఓటింగ్‌ పద్ధతి కూడా లోపభూయిష్టంగా జరుగుతున్నదని ఇటీవల న్యాయవాదు లు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పెద్దఎత్తున ఆందో ళన చేస్తున్న విషయం తెలిసిందే.
పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ఘర్షణలు, హింస, రిగ్గింగ్‌ సర్వసాధారణమవుతుంది. అలాగే పెట్టుబడీ దారీ పార్లమెంటు వ్యవస్థలో ఓటు సరుకై పోతుంది. అమ్ము కోవడం కొనుక్కోవడం షరామామూలే. ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో సహా… ఇవన్నీ మనకు చేదు అనుభవాలే. అయినా ఉన్నంతలో ప్రతి ఒక్కరం శక్తి మేరకు ప్రజా స్వామ్య పరిరక్షణకు నడుం కట్టాల్సిందే. మనిషిని మనిషిగా గుర్తించడం, అట్టడుగు ప్రజల మానవ హక్కులను కాపాడటం, ప్రజాస్వామ్యంలో అంతర్భా గమని భావిచడం కొందరు నేతల స్పృహలోనే ఉండదు గాక ఉండదు. ఎందుకంటే వారు నేతల ముసుగులో జీర్ణించుకుపోయిన నియంతలని గ్రహించాలి.అందుకే ప్రజాస్వామ్యం గురించి మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి.
అధిక సంఖ్యాకులైనవారు అతి నికృష్ట పరిస్థి తుల్లో జీవిస్తున్నప్పుడు ఏ కొద్దిమందో భోగ భాగ్యా లను అను భవించడం ప్రజాస్వామ్యం కాదు. అధిక సంఖ్యాకులు ఏ హక్కులూ లేకుండా కుమిలిపోతూ ఉన్న ప్పుడూ బహుకొద్ది మంది సమస్త హక్కులను అనుభవిం చడం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలం దరూ సామాజిక, ఆర్థిక రంగాలలో సమానమైన హక్కులు, భాధ్యతలు కలిగి ఉండటం. ప్రజాస్వామ్యం అంటే అభివృద్ధి చెందడానికి గల అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండటం.
-కానీ బీజేపీ పాలన తత్‌విరుద్దంగా సాగుతున్నది. కనుకనే ‘సేవ్‌ డెమోక్రసీ సేవ్‌ ఇండియా’ (ప్రజాస్వా మ్యాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి) అన్న నినాదం సర్వత్రా వినిపిస్తున్నది. ఒక ప్రజా ఉద్యమంలా వ్యాపిస్తున్నది.
కె.శాంతారావు 9959745723