‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఏమైంది?

What happened to 'Make in India'?గత పదేండ్ల క్రితం దేశమంతా హోరెత్తిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ (భారత్‌లో తయారీ) మూగబోయింది. మేక్‌ ఇన్‌ ఇండియా గుర్తు అయిన ముందుకు అడుగు వేసే సింహం కదలకపోగా వెనకడుగు వేస్తున్నట్లు వుంది. 2014 సెప్టెంబర్‌ 25న ఈ పథకాన్ని ప్రారంభించి నప్పుడు 2024 నాటికి మూడు లక్ష్యాలను సాధించాలని నిర్ణయించుకున్నారు. అవి ఒకటి, తయారీ రంగం వృద్ధి రేటును ఏడాదికి 12 నుండి 14 శాతానికి పెంచడం. రెండు, 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో పది కోట్ల మందికి అదనపు ఉద్యోగాలు ఇవ్వడం. మూడు, దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఉత్పాదక రంగం వాటాను 25 శాతానికి పెంచడం. ‘అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి’ లాగా ఈ పథకం అమలు తీరువుంది. అందుకే పదేండ్లు పూర్తయినా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ సాధించింది ఏమిటో కేంద్ర ప్రభుత్వం, దాని అధినాయకులు చెప్పడం లేదు.
భారత దేశాన్ని ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాల సరసన కూర్చోబెట్టాలంటే దేశీయ తయారీ రంగం అభివృద్ధి కావాలని అందుకు దేశంలోనే ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టి, దిగుమతులను తగ్గించాలని పది సంవ త్సరాల క్రితం కొత్తగా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రకటించింది. దానికి ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అని పేరు పెట్టి 15 తయారీ రంగాలు, 12 సేవారంగాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అందులో ఆటో మొబైల్స్‌, టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, డిఫెన్స్‌, మాన్యుఫాక్చరింగ్‌, పునరుత్పాదక ఇంధన రంగా లపై ప్రత్యేక కేంద్రీకరణ చేయనున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో సాధించే పురోభివృద్ధి వల్ల పై మూడు లక్ష్యాలను సాధించి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలిపి ‘విశ్వగురువు’గా అవతరి స్తామని చెప్పారు. వాస్తవానికి ఈ ఆలోచన మోడీ లేదా ఆయన ప్రభుత్వానిది కాదు, ప్రపంచ బ్యాంకుది. ప్రపంచ మంతటా ఒకే తరహా ప్రయివేటీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రపంచబ్యాంకు రూపొందించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనే దానికే ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అని ముద్దు పేరు పెట్టారు. ఈ పథకం దేశ స్వావలంబన విధానానికి పూర్తి భిన్న మైంది. జాతీయోద్యమ స్ఫూర్తికి విరుద్ధమైంది. బ్రిటిష్‌ వలస పాలనకాలంలో దేశంలోని సహజ వనరులను, శ్రామికుల శ్రమను లూటీ చేసి, దేశీయ పరిశ్రమలను ఏ రకంగా సర్వనాశనం చేశారో ఆలాగే మరోసారి కొల్లగొట్టడానికి సామ్రాజ్యవాద దేశాలు రూపొందించిన ముసుగు ఇది. నకిలీ జాతీయవాదులు ఎత్తుకున్న మరో మోసపూరిత విధానం, నినాదం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’.
దేశంలో 1991 తర్వాత అనుసరించిన ప్రపంచీకరణ విధానాల వల్ల కొన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధి తీవ్రమైన అసమానతలతో కూడుకున్నది. ఒకవైపు దేశ సంపద పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతుంటే మరోవైపు నిరుద్యోగం, ఆర్థిక అస మానతలు తీవ్రమయ్యాయి. సందప కొద్దిమంది దగ్గరే పోగైంది. ప్రఖ్యాత ప్రపంచ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ పికెటి బృందం చెప్పిన ప్రకారం 1924 నాటి కంటే 2024 నాటికి దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగాయి. ఐ.టి రంగంలో గత రెండు దశాబ్దాల్లో సాధించిన వృద్ధి వల్ల 2013 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా 57 శాతానికి పెరిగినప్పటికీ, ఆ రంగం అతి తక్కువ మందికి మాత్రమే ఉద్యోగాలను కల్పించింది. ప్రస్తుతం ఆ రంగంలో ఉపాధి అవకాశాలు మరింతగా తగ్గి పోతున్నాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా కేవలం 15 శాతం మాత్రమే ఉంది. దేశ జనాభాలో సగం మందికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి వున్నారు. అయితే ఆ రంగం గత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభంలో వుంది. నిరుద్యోగం, వలసలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఈ పరిస్థితులకు కారణమైన ప్రపంచ బ్యాంకు ఆదేశిత ఆర్థిక విధానాలను సమీక్షంచకుండా ఆ బ్యాంకు చెప్పిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఎలా పరిష్కారం అవుతుంది? దేశంలో తయారీ (ఉత్పత్తి) పరిశ్రమ లను పెంచడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, వేగంగా అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ నాయకులు చెప్పారు. రోగం ఒకటైతే మందు మరొకటి వేశారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారీ రంగాన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పి రైల్వే, బీమా, రక్షణ, వైద్య పరికరాల తయారీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారీగా అనుమతించారు. కీలకమైన రక్షణ రంగంలో అప్పటివరకు 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పెంచి తమ నిజమైన ‘దేశభక్తి’ని చాటుకున్నారు. నిర్మాణం, రైల్వే, ఇతర మౌలిక సదుపాయాల రంగాలలోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు. ఈ విదేశీ పెట్టుబడికి సేవలు చేయడానికి ‘ఇన్వెస్టర్‌ ఫెసిలిటేషన్‌ సెల్‌’ను ఏర్పాటు చేశారు. దేశంలోకి పెట్టుబడి వచ్చినప్పటి నుండి తిరిగి వెళ్లే వరకు అవసరమైన అన్నిరకాల సేవలను ఈ సెల్‌ చేస్తుంది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ పేరుతో విదేశీ పెట్టుబడులు దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన అనుమతులు, లైసెన్స్‌లు, విద్యుత్‌ సదుపాయం, పన్నుల చెల్లింపులు, ఒప్పందాలకు అవసరమైన అన్ని రకాల సేవలు (ఊడిగం) చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో ఆసక్తికరమైన ‘దివాలా తీయడం’ సేవ కూడా వుంది. దివాలా తీయడానికి కూడా సేవలు అందించే ఏర్పాట్లు ఈ పుణ్యభూమిలో తప్ప ఎక్కడ వుండవేమో! ఈ విధానాలను మూడు ‘పి’ లుగా (పబ్లిక్‌ (ప్రభుత్వం) ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌) పిలుచుకున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నాలుగో ‘పి’ కూడా చేర్చారు. ‘పదకొండు ప్రభుత్వ అనుమతులను లేదా సేవలను సింగిల్‌-విండో ద్వారా చేసిపెడుతున్నారు.
ఇన్ని రకాల సేవలు పొందిన విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు ఐదు పారిశ్రామిక కారిడార్ల ద్వారా పారిశ్రామిక, పట్ట ణీకరణ అభివృద్ధికి కృషిచేస్తారని చెప్పారు. ఢిల్లీ-ముంబై, అమృత్‌సర్‌- కోల్‌కొతా, చెన్నై-బెంగళూరు, వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్లు, బెంగళూరు-ముంబై ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేశారు. స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన, స్మార్ట్‌ సిటీలు, అమృత్‌ కాల్‌, స్వచ్ఛ భారత్‌ అభియాన్‌, సాగరమాల ఇలా ఒకటేమిటి అనేక పేర్లు పెట్టి దేశాన్ని ఊదరగొట్టారు. ఇంత చేసి సాధించింది ఏమిటంటే తిరోగమనం. నేషనల్‌ అకౌంట్స్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌.ఎ.ఎస్‌) ప్రకారం తయారీ రంగం వాస్తవ అభివృద్ధి రేటు 2001-12లో 9.1 శాతం వుండగా, మేక్‌ ఇన్‌ ఇండియా అమలులోకి వచ్చిన 2012-23లో 5.5 శాతానికి పడిపోయింది. జీడీపీలో తయారీ వాటా 25 శాతానికి పెంచాలనే ఈ పథకం లక్ష్యం ఇప్పటికీ 17-18 శాతానికి దాటలేదు. తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తయారీ రంగంలో 2011-12లో ఉద్యోగ అవకాశాలు 12.6 శాతం వుండగా 2022-23 నాటికి 11.4 శాతానికి పడిపోయింది. మన రాష్ట్రంలో 2018- 19లో 10.6 శాతంగా వున్న ఉపాధి అవకాశాలు 2023-24 నాటికి 9.6 శాతానికి పడిపోయాయి. అలాగే కర్ణాటకలో 11.7 నుండి 10.9 శాతానికి, తమిళనాడులో 18.7 నుండి 15.9 శాతానికి, పశ్చిమ బెంగాల్‌లో 18.7 నుండి 16.7 శాతానికి ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికమంది ఉపాధి పొందుతున్నది అసంఘటిత రంగంలో. ఈ రంగంలో 2015-16 లో 38.8 మిలియన్ల మంది ఉపాధి పొందుతుంటే 2022-23 నాటికి 30.6 మిలియన్లకు అంటే సుమారు ఎనిమది లక్షల మంది ఉపాధి కోల్పోయారు. దేశ స్థూల జాతీయో త్పత్తిలో భారతదేశ ఎగుమతులు 2013-14లో 25.2 శాతం వుండగా, 2013-24లో 22.7 శాతానికి పడిపోయాయి. దిగుమతులు మాత్రం 602.98 మిలియన్‌ డాలర్ల నుండి 2022 నాటికి 756.68 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. పట్టణాల్లో ఉపాధి తగ్గిపోవడంతో వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య పెరిగింది. 2018-19లో 42.5 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడితే 2022-23లో 45.8 శాతానికి పెరిగింది.
ఈ పదేండ్లలో అభివృద్ధి సాధించకపోగా దేశ సహజ వనరులు పెద్ద ఎత్తున లూటీ అయ్యాయి. వ్యవసాయ యోగ్యమైన భూమిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం పెరిగింది. ఒక్కో కార్పొరేట్‌ కంపెనీకి వేల ఎకరాల భూమిని ఇచ్చేస్తున్నారు. పారిశ్రామిక కారిడార్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూ బ్యాంక్‌ విధానం పేరుతో చిన్న, సన్నకారు రైతుల భూములను అతి చౌకగా కాజేశారు. దీనివల్ల ఇప్పటికే ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. గతంలో అమెరికా నుండి పి.ఎల్‌-480 గోధుమలను దిగుమతి చేసుకున్న స్ధితికి దేశం దిగజారు తుంది. గాలి, సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో గ్రామీణ ప్రాంతాలపై పడుతున్న విభిన్న ప్రతికూలతల గురించి ఎలాంటి అధ్యయనంకానీ, జాగ్రత్తలుకానీ తీసుకోవడంలేదు. పారిశ్రామికీకరణ పేరుతో పెద్ద ఎత్తున కొండలు, గుట్టలు చదును చేయడంతో పాటు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. దీనివల్ల కాలుష్యం, పర్యావరణం దెబ్బతిని ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. సకాలంలో వర్షాలు రాకపోవడంతో పాటు, వాతవారణంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి.
జాతీయోద్యమ లక్ష్యాలకు భిన్నమైన ఈ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ దేశాన్ని విదేశీ, స్వదేశీ కంపెనీలకు దోచిపెట్టడానికి తోడ్పడింది. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే నాటి స్ఫూర్తికి భిన్నంగా రక్షణ రంగంతో సహా అన్ని రంగాల్లోకి విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. బ్రిటిష్‌కాలం నాడు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించివేసి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చడానికి, వ్యవసాయ రంగంలో నల్ల చట్టాలను తెచ్చి కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం సేవలు చేస్తున్నది. దేశం నిజంగా అభివృద్ధి కావాలంటే ఇప్పటికీ అత్యధిక మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. భూ పంపిణీ చేపట్టి గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచాలి. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ రుణ సదు పాయం, గిట్టుబాటు ధరలు కల్పించాలి. కుల, లింగ వివక్షలను రూపుమాపే శాస్త్రీయ విద్య, సామాజిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి. పట్టణాల విస్తరణకు అవసరమైన చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించడానికి అవసరమైన తోడ్పాటును ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచాలి. పరిశోధనల అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలి.
– వి. రాంభూపాల్‌