పోచారం సవాల్ ఏమైంది..! 

– రెండు పడక గదుల ఇళ్లకు బిల్లు ఇవ్వండి..

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు చెందిన బిల్లులను బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అడ్డు వస్తున్నారని, బిల్లులు చెల్లించలేని పక్షంలో మే నెల 14వ తేదీ వరకు డబ్బులు చెల్లించకుంటే లబ్ధిదారులతో కలిసి కామారెడ్డి జిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లోకసభ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నిర్మించనన్ని  బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల ఇల్లు నిర్మించమని, 400 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని, ఇంకా రావలసిన 13 కోట్ల రూపాయలు నిధులు విడుదల కాకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డు తగులుతున్నారని, దీనిపై తాను జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మే 15వ తేదీన రెండు పడకల గదుల లబ్ధిదారులతో కలిసి ఆమరణ నిరాదీక్ష చేస్తానని, అవసరమైతే బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 15 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రసంగించిన మాజీ స్పీకర్ మే 15వ తేదీ గడిచిపోయి 22వ తేదీ చేరుకున్నప్పటికీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాహార దీక్ష పై ఎలాంటి చర్యలు తీసుక పోవడంపై బాన్సువాడ నియోజకవర్గంలో రెండు పడక గదులు ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే తో పాటు తాము కూడా దీక్షలో పాల్గొంటామని వారు వెల్లడించారు. బాన్సువాడ ఎమ్మెల్యే ప్రకటన కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇల్లు నిర్మాణానికి అయ్యే ఖర్చు భారమైనా.. సొంత ఇల్లు సమకూర్చుకోవాలన్న ఆరాటంతో ప్రైవేట్ అప్పులు చేసి 0 ఇండ్లు నిర్మించుకోగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు నానా అవస్థ పడుతున్నారు. రాజకీయాలకు తావు లేకుండా పార్టీలుగాతీతంగా నిర్మించుకున్న రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం బిల్లులు వచ్చేలా అధికార, ప్రతిపక్ష నాయకులు కృషి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రభుత్వం తమ దుస్థితిని గుర్తించి, స్పందించాలని, వెంటనే బిల్లులు విడుదల చేయించాలని కోరుతున్నారు.