కారంచేడు అలీసమ్మ హత్య కేసు ఏమైంది?

What happened to Karanchedu Alisamma's murder case?కారంచేడు రుధిర క్షేత్రం భారతదేశ కుల వాస్తవిక కర్కశత్వానికి సాక్ష్యం. కారంచేడులో ఆధిపత్య కులంచే చంపబడిన అమరుల స్పూర్తి దినం 17జులై1985. కారంచేడులో కుల దురహంకారం మాదిగలను ఊచకోత కోసిన దుర్దినం.. ఇది జరిగి ముప్పయి ఎనిమిదేండ్లు గడిచాయి. కారంచేడు దురంతాలు భారతదేశంలో మొదటిది కాదు, చివరిదీ కాదు. ఆధిపత్య కులహత్యలు అనేకం జరిగాయి, జరుగుతున్నాయి. కాని కొన్నింటికి మాత్రమే జాతి జాతంతా కదులుతుంది. అలా కదిలించిన ఉద్యమమే కారంచేడు విజయం.
కారంచేడు చరిత్రను, కుల దాష్టీకాలను, ఆ ఉద్యమ చైతన్యాన్ని, స్ఫూర్తిని ఇతర బాధిత సమాజాలకు, ఉద్యమ సమాజాలకు ఇవ్వడానికి కారంచేడు రుధిర క్షేత్రాన్ని స్మృతి దినంగా జరుపుకోవాలి. బాధిత సమాజాలు ఐక్యంగా నిలబడిన ఉద్యమం. బాధిత సమూహాలకు బాసటగా అనేక ఉద్యమాలు, ఉద్యమ శక్తులు, వ్యక్తులు అండగా వున్న పోరాటమది. లక్షల మంది బాధిత శిబిరాలకు దన్నుగా వున్న ఉద్యమం కారంచేడు. అందుకే ప్రభుత్వాలు దిగొచ్చాయి.ఉద్యమం విజయవంతమైంది. అందుకే కారంచేడు రుధిర క్షేత్రాన్ని ప్రత్యేకంగా చరిత్రలో చెప్పాలి. కారంచేడు సాధించిన ప్రధానమైనవి దళితుల ప్రతిఘటనా పోరాటస్థైర్యం. దళిత ఆత్మగౌరవ పోరాటాన్ని ఇంకా అంటరాని సమాజాల మీద ఎలాంటి వివక్షలు జరగ కూడదనీ, జరిగితే ఎంత శిక్షార్హమో తెచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టమే అందుకు నిదర్శనం. ఈ చట్టం రాకముందు దళితుల మీద ఏం జరిగినా, ఎలాంటి దాడులు, హత్యలు జరిగినా కూడా సాధారణ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లే వుండేవి. నేరస్తులు సులువుగా ధనబలం, కుల బలంతో తప్పించుకునేవాళ్లు. కానీ కారంచేడు ఉద్యమం భారతదేశ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చి వారికి బాసటగా నిలిచింది. ఇది సక్రమంగా అమలవుతుందా? ఇప్పటిదాకా ఎంత మంది శిక్షలు అనుభవించారంటే.. చెప్పలేము. కానీ అది అమలు పరిస్తే శిక్షలు ఖాయం అనే భయాలు కూడా ఉంటాయి.
ముఖ్యంగా కారంచేడు మారణకాండలో బాధిత మహిళలు సువార్తక్క, సలోచన, అలీసమ్మ ఇండ్లకు, కారంచేడు ఊచకోతకు ముందు మాదిగ గూడెం తాగే మంచి నీళ్ల చెరువును ఒక ఆధిపత్య కుల ఆసామి బర్లను కడిగి మురికి తీస్తుంటే కత్తి చంద్రయ్య అనే మాదిగ అవిటి అబ్బాయి ‘మనషులు తాగే నీళ్లు అట్లా కంగాలి జేస్తవేంది సామి’ అన్నందుకు ‘నువ్వెవడవని’ కొడుతుంటే..ఆ సమయంలో నీళ్ల కోసం బిందెతో వచ్చిన సువార్త అడ్డుకోబోయిందట. ఆమెను కూడా ఆ ఆసామి కొట్టబోతె బిందె ఎత్తిందట. ఆ తర్వాత కారంచేడు మారణకాండ చోటుచేసుకుంది.
పొలాల్లో పని చేసుకుంటున్న దళితుల మీద గొడ్డండ్లు, బరిసెలు గడ్డపారలతో భూస్వాములు ట్రాక్టర్లమీద వచ్చి దొరికినోల్లను దొరికినట్లు చంపిండ్రు. చాలా మంది చెల్లా చెదురై పారిపోయిండ్రు. కొంతమంది చావుదెబ్బలు తిని చచ్చినట్లు పడున్నారు. కొంత మందిని తీవ్రంగా గాయ పరిచిండ్రు. వయసులో ఉన్న మహిళల్ని పొలంల దొరకబుచ్చుకొని కొట్టిన దెబ్బలు, గాయాలు వారి ఒంటి మీద ఇంకా మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. ఈ మారణకాండలో మొత్తం చనిపోయింది దుడ్డు రమేష్‌, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహం, తేళ్ళ ముత్తయ్య, తేళ్ళ యెహౌవా, అలీసమ్మ. ఆ దాడిలో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు పోగొట్టుకున్నారు.
దుడ్డు రమేష్‌ ఇరవైయేండ్లు కూడా నిండని యువకుడు. అతని భార్య సులోచన. సులోచనతో పాటున్న టీనేజ్‌ ఆడపిల్లలు తేళ్లమరియ, తేళ్ల విక్టోరియ, శాంతమ్మ, తాళ్లలక్ష్మి. వీల్లందర్ని కొట్టి కాల్చేద్దామన్న పథకం విఫలమైందని సజీవ చరిత్రగా మన్న సలోచన తనని కలిసిన వారితో చెప్తుంటది. సులోచన తన భర్త హత్యను చూసి ఆ భయాన్ని, బాధ నుంచి చేరుకొని మళ్లీ మామూలు మనిషి కావడానికి, కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి ఉద్యమ సంఘాల సహకారం చేయూత అండనే కారణమని చెబుతున్నది. అయినా ఇప్పటికీ ఆనాటి మారణకాండల బీభత్సాలు, భయాల వణుకు అప్పుడప్పుడు వెన్నాడుతూనే ఉంటాయంటది సులోచన.
దుడ్డు అలీసమ్మ మరణం ఓ విషాదం. తన కన్నకొడుకు దుడ్డు వందనం. భూస్వాములు మాదిగల్ని వేటాడుతూ చంపుతున్నారని తెలిసి వెంటనే చీరాల పోలీస్టేషన్‌కి కంప్లయింట్‌ ఇద్దామని బయల్దేరిండు బయటకు. అంతే గొడ్డల్లతో నరుకుతూ, బరిసెలతో పొడుస్తుంటే…ఆ అరుపులు కేకలు వీని బయట తనకొడుకుని చంపుతుంటే కళ్లార చూసిన దు:ఖం అలీసమ్మది. ఆక్రూర ఘటనను చూసిన అలీసమ్మ బహిరంగ సభల్లో, క్యాంపుల్లో చెపుతుంటే దళిత మహిళలు, పురుషులు శోకాలు బెట్టి ఏడ్చేవారంట. అయితే ఈ కేసులో ఐ విట్నెస్‌ను బహిరంగ పర్చకూడదని చట్టం చెబుతున్నది. కానీ అలీసమ్మకు బహిరంగ సభల్లో స్టేజీల మీద చెప్పించడం ఎలా జరిగింది? ఐ విట్నెస్‌ను చాలా రహస్యంగా వుంచుతారు, వారి సంరక్షణలో కాపు కాస్తారు. కానీ పోలీసులు, కోర్టులు పట్టించుకోవు, చెప్పరు కూడా ఈ రహస్యంగా, రక్షణ విషయాలు. కానీ ఉద్యమ సంఘాలకు, పౌరహక్కుల సంఘాలకు కూడా తెలవక పోవడమేంటి? వాల్లయినా అలర్ట్‌ చేయాల్సి ఉండాల్సింది. కానీ, అలా జరగలేదు. ఈ ఉదాసీనత ఏమరపాటు వల్ల అలీసమ్మను శత్రువు ఒక దొంగరాత్రి నిశ్శబ్దంగా చంపేసిపోయింది.
విజయనగర్‌ కాలనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు బాధితుల కోసం ఇంకా పూర్తికాని తలుపులు కిటికీల్లేని ఇంటి ముందట ఆరుబయట నిద్రబోతున్న అలీసమ్మను మోకమ్మీద మెత్తేసి ఒత్తి చంపేసి పోయిండ్రు. తెల్లవారి ఆమె శవమై మంచాల్లో పడివుంది. ఆమె మంచం పక్కన బూటు కాళ్ల అచ్చులున్నాయని గుర్తించారు. పోస్టుమార్టమ్‌ రిపోర్టులో ముఖమంతా కమిలి వుంది. ఊపిరాడకుండా ఉన్న పరిస్థితిలో చనిపోయిందని, అది సీబీ సిఐడికి ఇచ్చారు. ఇంకేముంది? అది ఇంకా పూర్తి కాలేదు రిపోర్ట్‌ అంటారు. బాధితులు తిరిగి తిరిగి వేసారి మానుకున్నారు. అతీ లేదు గతి లేదిప్పటికి. దళితుల పట్ల వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా ఉన్నాయననేది అలీసమ్మ హత్య కేసే సాక్ష్యం. దోషులెవరు? అనేది ఇంకా తేలలేదు. ఏం జరిగినా బయటకు రాలే. ఒక మాదిగ మహిళను హత్య చేస్తే రుజువులున్నా, శిక్షలు, చట్టాలున్నా మనుస్మృతుల ముందు అవేమి పనిజేయలే. ఇది అంటరాని మహిళల దుస్థితి ఈ దేశంలో.
– జూపాక సుభద్ర