రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నది.ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు జరుపుకుం టున్నది. అన్ని స్థాయిల్లోని ఉద్యోగులను, కార్మికులను, ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నది. సంవత్సర కాలంగా ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెడుతున్నది. వాస్తవంగా పదేండ్ల బీ(టీ)ఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజానీకం కాంగ్రెస్‌కు పట్టంగట్టింది. కాంగ్రెస్ ఆరుగ్యారంటీల పథకం కూడా ఇందుకు దోహదం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వ పయనం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఉందా? తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు ప్రజాపాలనేనా?
ప్రధానంగా కార్మికవర్గం సమస్యల్ని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన వాగ్దానాలు చేసింది. వాటి గురించి ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఎక్కడా ప్రస్తావించింది లేదు. విజ్ఞప్తులు చేస్తున్నా కార్మిక వర్గం పట్ల నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్‌సి, కాంట్రాక్ట్ – ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమ బద్ధీకరణ, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, స్కీమ్ వర్కర్లలో అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.18వేలు, ఆశాలకు వేతనాల పెంపు, మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.10వేలు, బీడీ కార్మికులకు జీవిత బీమా, ఈఎస్‌ఐ, పరిధి వర్తింపు లాంటి హామీలనిచ్చింది. ఇంకా నిరుద్యోగుల కోసం నెలకు రూ.4వేల భృతి, వికలాంగుల నెలవారీ పెన్షన్ రూ.6వేలకు పెంపు, చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డుల ఏర్పాటు, పద్దెనిమిది సం||లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ, ఆడపిల్లల పెండ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం తదితర ముఖ్యమైన వాగ్దానాలు చేసింది. ఇవన్నీ కార్మికవర్గానికి వారి కుటుంబాలకు ప్రయోజనం కలి గించే హామీలు. వీటితో పాటు రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది కార్మికవర్గానికి వేతనాల సవరణ, సింగరేణికి కొత్త బొగ్గుబావులు, ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు కూడా హామీల్లోని ముఖ్యమైన అంశాలు. వీటిలో ఏ ఒక్కటీ కూడా అమలు చేయకపోవడం కార్మికవర్గాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నది. ఈ పరిస్థితిలో కొత్తసర్కార్ కార్మికవర్గానికి చేసిన మేలేంటి అనేది ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏడాది కాలంలో పెట్టుబడిదారి వర్గానికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆర్థికరంగంలో బీజేపీ విధానాలనే కొనసాగిస్తున్నది.
రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికుల నుండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి ఐదేండ్లకోసారి పిఆర్‌సి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే పదహారు నెలలు గడిచినా ఎప్పుడిస్తారన్నది తేల్చ లేదు. ఐదు డిఏలలో ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఇంకా నాలుగు డిఏలు బకాయి పెట్టింది. ఎప్పుడిస్తారన్నది చెప్ప డం లేదు. ప్రభుత్వ శాఖల్లో రెండులక్షల ఖాళీలుంటే అరకొరగా నోటిఫికేషన్లు వేసి పోలీసులు, టీచర్లు, వైద్యశాఖ తదితరాలలో కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. నిరుద్యోగుల ఆకాంక్షలకనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీలేదు. నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్ పేరిట రూ.పది లక్షల వడ్డీ లేని రుణం ఊసేలేదు. కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు విద్యాభరోసా కింద ఇస్తామన్న రూ.ఐదు లక్షల హామీ అటకెక్కింది. ఇవన్నీ అమలు చేస్తే కార్మిక కుటుంబాలకు పరోక్షంగా మేలు జరిగేది. రెండు లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు.1995 నుండి పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. వీరందరూ ప్రత్యేక రాష్ట్రం ఏర్ప డితే తాము పర్మినెంట్ అవుతామని ఆశించిన వారిని బీఆర్‌ఎస్ సర్కార్ మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంద నుకుంటే స్పందించడం లేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీలను రద్దుచేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వీరందరినీ పర్మినెంట్ చేయడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారమేమి పడదు. నిరు ద్యోగుల ఉద్యోగాలకు సంబంధం ఉండదు. కానీ హైకోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయరాదని ఉత్తర్వులిచ్చింది. దీన్ని ప్రభుత్వం సమీక్షించి అందర్నీ పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ను అమలు చేయడంలో స్కీమ్ వర్కర్లది కీలక పాత్ర. నేషనల్ హెల్త్ మిషన్‌లోని పదిహేడు వేల మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్ ఉన్నది. కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు తమ సర్వీసులను పరీక్షా విధానం లేకుండా క్రమబద్ధీకరించాలని పోరుబాటలో ఉన్నారు. 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువైంది. ఆరోగ్యమిత్రలకు హామీనిచ్చిన డిఇఓ కేడర్ వేతనాలు పెంచడం లేదు. కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయాల్సి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 70 వేల మంది అంగన్‌వాడీలకు నెలకు రూ.18వేలు జీతం ఇస్తామని చెప్పినా, నేటికీ చర్యలు తీసు కోలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసింది. వీరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. 26వేల మంది ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనంతో పాటు వీరికి రూ.18వేల వేతనమివ్వాలి. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు హామీ నిచ్చిన వేతనం రూ.10వేలకు పెంచనేలేదు. ఐకెపి విఓఏలకు కనీస వేతనాలు పరిస్థితి కూడా అంతే. ఫీల్డ్ అసిస్టెంట్లకు పేస్కేల్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నది. 52 వేల మంది గ్రామ పంచాయితీ కార్మికులకు వేతనం పెంచలేదు. మున్సిపల్ కార్మికులకు పక్క రాష్ట్రం మాదిరిగా రూ.21వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టింపు కరువైంది. అలాగే యూనివర్సిటీలలో పనిచేస్తున్న టైమ్‌స్కేల్ ఉద్యోగుల పర్మినెంట్ గురించి ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి భారం లేని ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు పిఆర్‌సి వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది. వేలాదిమంది సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, స్కూల్ స్వీపర్లు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, గురుకుల కార్మికులు, కస్తూర్బా గాంధీ, మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు నెల నెలా జీతాలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాల్సి ఉంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న విద్యుత్ రంగంలోని 23 వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను జూనియర్ లైన్‌మెన్లుగా కన్వర్షన్ ఇవ్వాలని జెఏసిగా పోరాడుతున్నది. టీజీఎస్‌ఆర్టీసీలోని ఉద్యోగులకు పనిభారం పెరిగింది. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఉపయోగపడినా బస్సుల సంఖ్య పెంచకపోవడం, ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదురవు తున్నది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వల్ల ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆర్టీసీలో ఎన్నికలు వెంటనే నిర్వహించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణకు ఆదాయాన్ని సమకూర్చే నల్ల బంగారం (బొగ్గు) ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బావులు సాధించకుండా, వాటి కోసం కేంద్రంతో పోరాడకుండా లోపాయికారిగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు. కేంద్రం వేలంపాటలను వ్యతిరేకించడం లేదు. రాబోయే పదేండ్లలో సింగరేణి పూర్తిగా ప్రయివేటీకరణ అయ్యే ప్రమాదమున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సింగరేణి ఉద్యోగుల సభలో పాల్గొని సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు. అలవెన్సులపై ఇన్‌కమ్‌టాక్స్‌ను కోలిండియా మాదిరిగా సింగరేణి ఉద్యోగులను రీయంబర్స్‌మెంట్ చేస్తామన్నారు. వీటిన్నింటిని ‘ప్రజా పాలన’లోనే మర్చిపోయారు.
అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలోని వందల కోట్ల రూపాయలు కార్మికుల కోసం కాకుండా ఇతర అవసరాలకు వాడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్‌కు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఐదు లక్షల మంది హమాలీలకు కూడా వెల్ఫేర్ బోర్డు లేదు. కార్మిక సంక్షేమ నిధి రుసుము యాజమాన్యం వాటా కనీసం రూ.వందలకు ఆదుకోవాల్సి ఉంది. పవర్‌లూమ్, హ్యాండ్‌లూమ్ వర్కర్స్ ఐదు లక్షల వరకు ఉంటారు. వీరి సబ్సిడీలు, కూలీరేట్లు పెంచడం లేదు. నెలకు 26 రోజులు పని కల్పించాలి. రాష్ట్రంలో ఏడు లక్షల మందిలో నాన్‌పీఎఫ్ సమస్య పరిష్కరించాలి. అందరికీ జీవనభృతినివ్వాలి.మరో కీలక సమస్యను కాంగ్రెస్ సర్కార్ విస్మరించింది. తన పెట్టుబడిదార్ల సభ్యత్వాన్ని చాటుకున్నది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి వర్తించే 73 షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్స్ కనీస వేతనాలు పెంచకుండా సవరించి మోసం చేసింది. 2024 జనవరి 30న 73 జీఓలు ఇస్తూ పాత బేసిక్, డిఏలను కలిపి ”కొత్త సీసాలో పాత సారా” మాదిరి వేతనాలు నిర్ణయించింది. కనీస వేతనాల సలహా మండలి వేయకుండా చైర్మన్‌ను నియమించడం విడ్డూరం. ఒక వర్కర్స్ పాలసీ అంటూ ఏమీలేదు. పెట్టుబడిదారులకు అన్నిరకాల రాయితీలిస్తూ గత ప్రభుత్వ విధానాల్ని కొనసాగిస్తున్నది. పారిశ్రామిక కార్మికుల హక్కులు కాపాడటం లేదు. నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకించడం లేదు. వలస కార్మిక చట్టం అమలు ఊసే లేదు.
ప్రజాపాలన పేరిట ప్రభుత్వం ప్రజావాణిని నిర్వహిస్తున్నది. అధికారంలోకి వచ్చిన రోజే ప్రగతి భవన్ గేట్లు కూలగొట్టింది. కానీ ప్రజాస్వామ్యం కనబడటం లేదు. సమ్మెలను నిషేధిస్తున్నది. పోరాటాల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తున్నది. ఇటీవల లగచర్ల ఫార్మా బాధితులు, దామగుండం ప్రాజెక్ట్ నిరసనకారులు, దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని జరిగిన పోరాటం అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. ప్రజల తిరుగుబాటుతో కొన్నింటిలో వెనక్కి తగ్గడం అనివార్యమైంది. రాష్ట్రంలో పేదలు ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకుంటే నేటికీ పట్టాలివ్వాలని స్పష్టంగా ఉత్తర్వులివ్వలేదు. గృహలక్ష్మి పథకంతో పాటు ఆరు గ్యారంటీలు అమలు పట్ల నేటికీ స్పష్టత లేదు. రాష్ట్రంలో రైతు, కూలీ సమస్యల పరిష్కారంలో పారదర్శకత లేదు. వ్యవ సాయ కూలీలు, కౌలు రైతుల రక్షణ గురించి పట్టింపు లేదు. మధ్యతరగతి ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతున్నది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో కార్మిక రంగం పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను ప్రభుత్వం ఆత్మవిమర్శన చేసుకోవాలి. అంబానీ, ఆదానీ, టాటా, బిర్లా లాంటి బడాపెట్టుబడిదారుల స్వప్రయోజనాలు, కాంట్రాక్టర్ల లాభాలకన్నా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసు కొచ్చారన్నది గమనంలో పెట్టుకోవాలి. ఏడాదికాలంలోనే ప్రజల్లో ఎందుకింత వ్యతిరేకత వచ్చిందనేది విషయాన్ని కూడా సమీక్షిం చుకోవాలి. ప్రధానంగా కార్మికవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిం చడమే ప్రధాన కారణమని గుర్తెరగాలి. ఇకనైనా కార్మిక,కర్షక వర్గాలకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. అదే అసలు సిసలైన ‘ప్రజాపాలన’ అనిపించుకుంటుంది.
భూపాల్
9490098034