అది ఒక వైభవోజ్వల మహాయుగం- వల్లకాటి అధ్వాన్న శకం, వెల్లివిరిసిన విజ్ఞానం- బ్రహ్మజెముడులా అజ్ఞానం, భక్తి విశ్వాసాల పరమపరిధవం- పరమ పాషండాల ప్రల్లద కల్లోలం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం- నడుస్తున్నారు నరకానికి సూటిగా, అరుస్తున్నారు అధికార కంఠాలు, అంతా అమోఘంగా వుందని’ అంటూ ఫ్రెంచి విప్లవం సమయంలో రెండు మహా నగరాల స్థితిగతులను చార్లెస్ డికెన్స్ ‘ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్’ (రెండు మహానగరాలు) నవలలో కవితాత్మకంగా వర్ణిస్తాడు. ‘భారతదేశంలోని మహానగరాల నేటి దుస్థితి నాటి పరిస్థితికి ఏమాత్రం తీసిపోదు’ అంటారు ఈ నవలను అనువదించిన తెన్నేటిసూరి. అది చెన్నరు అయినా, హైదరాబాదైనా, బెంగళూరైనా వానలు పడితే చెరువులు. వానల్లేకున్నా ట్రాఫిక్ చెరువులు. వాయుకాలుష్యంతో ఢిల్లీ అతలాకుతలమ వుతున్నది. ప్రతిసారీ ముంబైలో వచ్చే వరదలకు జనజీవనం స్తంభించిపోతున్నది.
ఎక్కడైనా నగరాల విస్తరణ, పురోగమనం.. అక్కడి అసంఖ్యాక శ్రామికులు చెల్లించే జీవన మూల్యాల ఫలితమే. ఈ నగరాలే మానవ నాగరికతా వికాసాన్ని కాలగమనంలో ఆయా దశల్లో ప్రతిఫలిస్తాయి. మరికొన్ని కాలానికి సాక్షిగా నిలిచాయి. మహానగరాల జీవితం- ఆ దేశపు చరిత్ర-సంస్కృతితో పెనవేసుకొని వుంటుంది. అలాంటి మహానగరాల్లో దేశరాజధాని ఢిల్లీ సహా కోల్‌కత్తా, ముంబాయి, బెంగళూరు, చెన్నరు, హైదరాబాద్ వంటివి చాలానే వున్నాయి. ఈ మహానగరాల చరిత్ర, కీర్తి పేరుకు మాత్రమే.. ఇక్కడి జీవనం మహానరకం. ఈ నగరాలను విశ్వనగరాలుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాయి మన ప్రభుత్వాలు. కానీ, చిన్నపాటి వర్షాలను, ఓ మోస్తరు ఎండలను కూడా తట్టుకోలేక విశ్వగురువుల కలలు గాలిబుడగల్లా పేలిపోతున్నాయి. మ్యాన్‌హోల్స్ నోళ్లు తెరుస్తున్నాయి. కొన్ని నగరాల్లో పడవలు వాడాల్సివస్తోంది. సంపన్నుల విలాసవంతమైన భవనాలు కూడా నీళ్లలో చిక్కుకుంటున్నాయి. అసలు ఈ మహానగరాలకు ఏమైంది? ఎందుకిలాంటి పరిస్థితి ఏర్పడుతోంది?
మహానగరాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆకాశాన్నంటే భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, కాంక్రీట్ రోడ్లు. ”ఇది అత్యంత మంచికాలం..ఇది అత్యంత చెడ్డకాలం” అన్న ప్రారంభ వాక్యాలతో ‘లేట్ ఆఫ్ టూ సిటీస్’ ప్రారంభమవుతుంది. ఆ నవల్లో డికెన్స్ రాసింది రెండు దేశాల్లోని రెండు రాజధాని పట్టణాల గురించి. మనం ఇక్కడ స్పృశిస్తున్నది ఒకే దేశంలోని వివిధ పట్టణాల గురించి! అన్నింటిదీ ఒకటే బాధ. అన్నిటికీ ఒకే గాథ! చెరువులు, చెట్లు, అడవులు, వాగులు, వంకలు ఆక్రమణల పాలవుతున్నాయి. అడవుల్లో వుండాల్సిన జంతువులు.. జనవాసాల్లోకి చొరబడుతున్నాయి. కుండపోత వర్షాలు, భరించలేని ఎండలు సర్వసాధారణ మయ్యాయి. ప్రకృతి విపత్తుకి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు తేల్చేస్తున్నారు. అయినా, ప్రకృతిని ప్రకృ తిలా వుండనీయడంలేదు. నగరీకరణ, సుందరీకరణ పేరుతో ప్రకృతి సహజత్వం విధ్వంసమౌతోంది. ఇప్పటికీ ఈ మహానగరాల్లో దశాబ్దాల నాటి డ్రెయినేజీ వ్యవస్థే కొనసాగుతోంది. వేసవిలో చెమట్లు కారే రద్దీ, వానాకాలంలో ఒళ్లంతా బురద పూసే నీటి గుంటలు తప్ప పెరుగుతున్న జనాభాకనుగుణంగా మౌలిక వసతుల్లో మార్పులుండటం లేదు.
‘నా నగరాన్ని మహాసముద్రంలో చేపల్లా నిండిపోనీ జనంతో’ అంటాడు కులీ కుతుబ్‌షా నాలుగు శతాబ్దాల మహానగరం హైదరాబాద్‌ను ఉద్దేశించి. పరిధిని మించి పెరిగిన జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేకఇప్పుడు తలబాదుకుంటున్నారు. మిగతా నగరాల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో బహిరంగంగా చెత్తవేయడం నేరం. కానీ, మన దేశంలో పట్టించుకునే నాధుడే లేడు. ‘మహానగరాన్ని నిర్మించిన/ నిర్మిస్తున్న మనుష్యుల/ మమతలు తినేసిన ఉప్పుగాలి/ అంతశ్చైతన్యాన్ని అంతం చేసి నవ్వుకున్న నగరం/ పెరుగుతూంది/ నిశ్చయంగా విస్తరిస్తూంది’ అంటారు కవి నిఖిలేశ్వర్. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రకృతి వనరులను కార్పొరేట్ శక్తులు చెరపట్టకుండా కాపాడుకోవాలి. అప్పుడే మన మహానగరాలు విశ్వనగరాలుగా శిరమెత్తుతాయి.