– లోక్‌సభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎ.ఎం ఆరీఫ్
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగమంతా ఉత్తుత్తి వాదనలే తప్ప ఏమీ లేదని సీపీఐ(ఎం) లోక్‌సభ ఎంపీ ఎ.ఎం. ఆరీఫ్ విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. ఈ పదేండ్లలో కోటి ఉద్యోగాలు కూడా కల్పించలేదన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపే తీర్మానంపై సోమవారం జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున ఎ.ఎం. ఆరీఫ్ మాట్లాడారు. ఈ తీర్మానం పట్ల తాను భిన్నాభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నానని అన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదనీ, ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రామమందిర నిర్మాణం శతాబ్దాల ఆకాంక్షల నెరవేర్పు అంటూ ప్రసంగంలో పొందుపరిచిన అంశాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26న దేశ ‘ప్రాణ ప్రతిష్ఠ’ జరిగిందని నమ్ముతారు. లౌకిక దేశమైన భారత్‌ను పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మాదిరి మత దేశంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. దేశ స్వాతంత్య్రం కోసం వేలాది మంది ప్రాణ త్యాగం చేశారు. వారువ్వరూ ఇలాంటి మత రాజ్యాన్ని అనుమతించలేదు’ అన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలను తీర్చే విజన్ ఈ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. బ్రిటిష్ వారు విభజించు పాలించు వలే, ప్రభుత్వం భాష ప్రాతిపదికన విభజిస్తున్నదని, హిందీని రుద్దుతున్నదని విమర్శించారు. కీలకమైన బిల్లులను చర్చ లేకుండా ఆమోదిస్తున్నదనీ, అందుకు ప్రతిపక్ష సభ్యలను సస్పెండ్ చేస్తున్నదని ఆరోపించారు. ‘ఈ ప్రభుత్వ హయాంలోనే గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107వ స్థానం నుంచి 111వ స్థానానికి పడిపోయింది. పదేండ్లలో దేశానికి అన్నదాతలైన వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వెయ్యి కోట్లతో విగ్రహాలు నిర్మిస్తున్నారు. కాని దేశ క్రీడల ఔన్నత్యానికి స్టేడియంలు నిర్మించటం లేదు. కేరళ పట్ల విద్వేషం కారణంగానే రాష్ట్రానికి ఎయిమ్స్‌ను ఇవ్వలేదు” అని ఆరిఫ్ విమర్శించారు.