అధికారంలోకి రాగానే ఆర్టీసి బస్‌లలో మహిళలకు ఉచిత రవాణాను అనుమతిస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నది. మహిళలకు ఉచిత ప్రయాణం మంచిదేనని, ఆర్టీసి నిలబడ్తుందని, మహిళలు రవాణాపై పెట్టే ఖర్చు ఇతర అవసరాలకు వాడుకొన్నందున రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి పెరుగుతుందని ఈ స్కీంను స్వాగతిస్తూ డిసెంబర్ 7న ఇదే పత్రికలో వ్యాసం రాశాము.
ఈ స్కీం అమలుకు అవసరమైన మౌలిక వనరులు, బస్‌లు, సిబ్బంది లేకపోయినా ప్రభుత్వం ప్రకటన చేసిన రెండు రోజులలోనే ఆర్టీసి అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల పట్ల ఆర్టీసి కార్మికులకు వున్న ప్రేమ, బాధ్యత అర్థమవుతుంది. ఈ స్కీం అమలు చేయబట్టి తొమ్మిది నెలలు గడిచింది. సెప్టెంబర్ పదోతేదీన గౌరవ ముఖ్యమంత్రి ఆర్టీసిపై సమీక్ష నిర్వహించారు.మహాలకిë స్కీం అమలు చేసిన నాటి నుండి సమీక్ష చేసిన నాటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, రూ.2840.71 కోట్లు మహిళల డబ్బు ఆదా అయిందని రవాణా మంత్రి తెలిపినట్లు పత్రికలలో వచ్చింది. ఆ డబ్బులలో ఆర్టీసికి ఎంత ఇచ్చారనేది అధికారులు కానీ, ప్రభుత్వం కాని ప్రకటన చేయలేదు. పై లెక్కలను పరిశీలిస్తే రోజుకి సగటు 31 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇందుకుగాను రూ.11 కోట్లు ఆర్టీసి ఆదాయం కోల్పోతున్నది అని అర్ధం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.ఆ బడ్జెట్‌లో ఆర్టీసికి రూ. 3084 కోట్లు కేటాయించింది. ఇదికాక ఎస్సీ, ఎస్టీ,సబ్‌ప్లాన్ నిధులు నుండి రూ.1000 కోట్లు ప్రతిపాదించిందిు. బడ్జెట్‌లలో ప్రవేశపెట్టినవి యధాతధంగా అమలు చేసిన చరిత్ర లేదు. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ పేరుతో కుదిస్తారు. చివరికి ఇచ్చేదెంతో తెలియదు. 3084 కోట్లు పూర్తిగా ఆర్టీసికి ఇస్తారని భావిస్తే కేవలం నెలకు 257 కోట్లు అవుతుంది. రోజుకి 8.5 కోట్లు, ఖర్చేమో 11 కోట్లు అవుతుంది. రోజుకి 2.5 కోట్లు ఆర్టీసి నష్టపోతుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన నిధులను రవాణా శాఖ పద్దులలో చేర్చి చూపించలేదు కనుక అవి వస్తాయా?లేదా? అనేది వేచి చూడాలి.
విద్యార్ధులకు, ఎన్.జి.ఓ లు, ఇతరులకు ఇస్తున్న రాయితీల విలువ సుమారు 600 కోట్లు వుంటుంది.దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. అంటే రోజుకి 1.64 కోట్లు (ఆర్టీసి) ఆదాయం కోల్పోతుంది. ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించే వారి దగ్గర నుండి ఐదు రకాల సెస్‌లను వసూలు చేస్తున్నారు. అయితే ఆ ఆదాయాన్ని రోజువారి లెక్కలలో చూపించడం లేదు. రోజుకి 31 లక్షల మంది ప్రయా ణిస్తున్న మహిళలకు సంబంధించిన సెస్‌ల డబ్బులు ప్రభుత్వం రీ-ఎంబర్స్ చేయాలి. ఇది కూడా సుమారు 600 కోట్లు వుంటుంది. రోజుకి 1.64 కోట్లు. ఈ మొత్తం పరిశీలించినప్పుడు బడ్జెట్‌లో పెట్టకుండా ఆర్టీసిపై పడుతున్న భారం (2.5 + 1.64+ 1.64) రోజుకి 5.78 కోట్లు. అంటే ఏడాదికి రూ.2110 కోట్లు ఆర్టీసిపై భారం పడుతున్నది. రూ.2110 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అనేది ముఖ్యమంత్రి సమీక్షలో స్పష్టత రాలేదు. ఆర్టీసీకి 6322 కోట్లు అప్పులు, లయబిలిటీస్ వున్నాయని, అప్పులు రీ స్ట్రక్చర్ చేసుకోవాలని, వడ్డీ భారం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు, దానిని అమలులోకి తెచ్చేందుకు ఒక కమిటీని వేసినట్లు వార్తల ద్వారా తెలుస్తున్నది.
మహాలకిë పథకం సమర్ధవంతంగా అమలు జరగాలన్నా, నిజంగా అర్హులైన లబ్దిదారులు అందరూ ఈ పథకం ద్వారా ఉచిత ప్రయా ణం పొందాలంటే మరో 3వేల బస్‌లు కొత్త, పాత రూట్లలో ప్రవేశపెట్టాలి. డిసెంబర్ 2023 నాడు 35-40 లక్షలుగా వున్న ప్రయా ణీకుల సంఖ్య నేడు 55-60 లక్షలు వుంటుంది. అందులో 65శాతం వరకు మహాలకిëలు వుంటున్నారు. 3వేల బస్‌లు కొనుగోలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో ఒక్క పైసా ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే గడచిన నాలుగేండ్లలో గత ప్రభుత్వం కానీ, తొమ్మిది నెలలుగా పాలిస్తున్న కొత్త ప్రభుత్వం కానీ బస్‌ల కొనుగోలుకు నిధులివ్వలేదు. సరిపోయినన్ని బస్‌లు లేక ప్రయాణీకులు అవస్తలు పడుతున్నారు. దీనికితోడు పెరిగిన పనిభారంతో కార్మికులూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రోజుకి 2-3 గంటలు డ్యూటీ లేటు కావడం, ఆధార్ పరిశీలించి టిక్కెట్లు ఇవ్వడం, టిమ్స్‌లోని లోపాల వల్ల సాధారణ టిక్కెట్లు బదులు జీరో టిక్కెట్లు రావడం, రద్దీలో వాటిని గమనించలేకపోతే పైఅధికారులు కేసులు రాసి ఇంటికి పంపడం, టిమ్స్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయకపోవడం, వాటిపైన ఇచ్చిన వినతిపత్రాలు అధికారులు పట్టించుకోకపోవడం, ఇలా ప్రతిరోజూ కార్మికులు అనేక సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
ప్రభుత్వం మారింది. పాలకులు మారారు. కానీ ఆర్టీసి పట్ల, ఆర్టీసి కార్మికుల పట్ల పాలకుల వైఖరి మారలేదు అనుకోవలసి వస్తున్నది. ఆర్టీసిని ప్రజా రవాణా సంస్థగా కాకుండా వ్యాపార సంస్థగా చూస్తున్నారు. ఆర్టీసికి ఇవ్వవలసిన రీ-ఎంబర్స్‌మెంట్లు కూడా పూర్తిగా బడ్జెట్‌లో పెట్టడంలేదు. పెట్టినా కూడా పూర్తిగా చెల్లించడం లేదు. ఆర్టీసికి వున్న అప్పులను ప్రభుత్వ పెట్టుబడిగా మార్చి భారం తగ్గించాలని అడుగు తుంటే ‘రీ-స్ట్రక్చర్ చేసుకోండి’ అంటున్నారు. గత ప్రభుత్వం 2018లో పదిమంది నిపుణులతో ‘ఎక్స్‌పర్ట్ కమిటీ’ వేసినా, నివేదికను ఇంత వరకు బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం సూచనతో మరో కమిటీని నియమిస్తున్నారు. కొత్తబస్సుల కొనుగోలు నిధులివ్వక పోవడ ంతో నేటికీ ప్రయాణికులకు కాలంచెల్లిన బస్సులే దిక్కవుతున్నాయి.వెంటనే వాటిని మార్చాలి, కానీ అందుకు నిధుల లేమి ఆటంకంగా వుంది.
బడ్జెట్‌లో రెండు శాతం నిధులు ఆర్టీసికి మూడేండ్లిస్తే ఆర్టీసి స్వతంత్రంగా నిలబడుతుందని కార్మిక సంఘాలు ఎప్పడినుంచో కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజల అవసరాల మేరకు బస్‌లు పెంచడం, మంచి కండిషన్‌లో వున్న బస్‌లు కావాలనేది ప్రధానంగా ప్రబల సమస్య. మహాలకిë పథకం నేపథ్యంలో ఆ అవసరం మరింత పెరిగింది. కానీ ఆ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టించుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సింది ప్రజలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు. ప్రభుత్వం సరైన పద్ధతిలో నిధులు కేటాయించకపోతే సంస్థ అభివృద్ధి కుంటుపడటమేకాక, మహాలకిë స్కీం లబ్ది కూడా కొద్దిమందికే పరిమితమయ్యే ప్రమాదం వుంది. ప్రజా ప్రభుత్వం అంటున్న ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసి కార్మికోద్యమంపై ఆంక్షలు కొనసాగిస్తున్నది. ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డులను తిరిగి కొత్తవారితో నింపుతున్నది. కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించక గత ప్రభుత్వం వలే వ్యవహరిస్తున్నది. సామాజిక భద్రత పథకాలైన పి.ఎఫ్., ఎస్.ఆర్.బి.ఎస్, ఎస్‌బిటి ట్రస్ట్‌లకు బోర్డు ఆఫ్ ట్రస్టీస్‌ను నియమించకుండానే కాలం గడుపుతున్నది. ఆర్టీసి నిర్వహణలో కార్మిక సంఘాల భాగస్వామ్యం లేకుండా చేస్తున్నది. అలాగే కార్మికుల చేత నిర్వహించుకొంటున్న కో-ఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు జరిపేలా చర్యలూ తీసుకోవడం లేదు.
పై విషయాలన్ని గమనించినప్పుడు, మారింది పాలకులే తప్ప, ఆర్టీసి సంస్థ పట్ల పాలకుల వైఖరి మారలేదని అర్ధమవుతుంది. ఈ సంస్థ ప్రజాసంస్థగా మనుగడ సాగించాలంటే, మహాలకిë పథక ప్రయోజనం అందరూ పొందాలంటే ప్రజలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు ఉమ్మడిగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేయాలి.అందుకు 12న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఒక ప్రాతిపదకను ముందుకు తీసుకొచ్చింది. ఆ సమావేశం పిలుపుమేరకు ఈ నెల19న ఆర్టీసి కార్మికులు ‘డిమాండ్స్ డే’ని పాటిసున్నారు. సమీప భవిష్యత్‌లో ఈ సమస్యల పరిష్కారానికి ప్రజలంతా కదలాలని, ఆర్టీసీని కాపాడుకోవాలని కోరుతు న్నాము.
– వి.ఎస్. రావు, 9490098890