రవాణా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఏం చేసింది ?

– ట్రాన్స్‌ఫోర్టు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌
నవతెలంగాణ – అడిక్‌మెట్‌
సమాజ గమనంలో కీలకపాత్ర పోషిస్తున్న రవాణారంగ కార్మికుల సంక్షేమానికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమిచేసిందో సమాధానం చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ ప్రశ్నించారు. ట్రాన్స్‌పోర్ట్‌ వెల్ఫేÛర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద 48 గంటల రిలే నిరాహార దీక్ష ముగింపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ 2019ని తెచ్చి ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులపై భారాలు వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి అరకొర ఆదాయాలను కూడా కొల్లగొడుతోందన్నారు. రైతుల పోరాట స్ఫూర్తితో ఈ భారాలకు వ్యతిరేకంగా ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు కదలాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అలా ఆలోచించేలా ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ చైతన్యంతో పోరాడాలని సూచించారు. సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి, ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్‌ నగర కార్యదర్శి కె.అజరు బాబు, టీఆర్‌ సీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.సతీష్‌ మాట్లాడారు. అన్ని రంగాల కార్మికులతోపాటు ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్స్‌ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వారి సమస్యల్ని పరిష్కరించకపోగా విపరీతమైన చలాన్లు, పెనాల్టీలు వేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల కనుగుణంగా ఆదాయాలు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికుల్ని వేధించడం ఎలా సమంజసం అని ప్రశ్నించారు. ఏదైనా ప్రమాదం జరిగి గాయపడితే, జబ్బు చేస్తే ఆదుకునే దిక్కులేదని, వీరి సంక్షేమానికి ఏ స్కీములు లేవని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో తెలంగాణ ఆల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ సెక్రెటరీ కిరణ్‌బాబు, ఏఐఆర్‌టీడబ్ల్యు ఎఫ్‌ నాయకులు ఎండి కలీమ్‌, ఉమేష్‌ రెడ్డి, అహ్మద్‌ఖాన్‌, గౌస్‌, సురేష్‌, మహేష్‌, జునైద్‌, ఆర్బుస్‌ ఖాన్‌, అనీఫ్‌ తదితరులు కూర్చున్నారు. హరి, శ్యామ్‌, వాహిద్‌, ఫారీద్‌, మోహినుద్దీన్‌, మోయిన్‌, శ్రీను, భిక్షపతి, నబి, ఆసిఫ్‌, నసిర్‌ తదితరులు పాల్గొన్నారు.