ఏడాది ‘ప్రజాపాలన’-వికలాంగులకు ఏమిచ్చింది?

A year of 'democracy' - what has happened to the disabled?గత బీఆర్‌ఎస్‌ పాలనపై విసుగు చెందిన ప్రజలు తెలంగాణలో మార్పు తెస్తామని కాంగ్రెస్‌ హామీని నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రగతి భవన్‌ ముందు ఉన్న బారికేడ్లను కూలగొట్టించారు. ప్రజలు స్వాగతించారు. పదేండ్ల నియం తృత్వ ప్రభుత్వంపోయి ప్రజాపాలన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం వెంటనే హైదరాబాద్‌ నగరానికి చెందిన రజని అనే వికలాంగురాలికి ఉద్యోగమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. దీంతో రాష్ట్రంలోని నలభై లక్షలమంది వికలాంగుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇచ్చింది కాంట్రాక్టు ఉద్యోగమే అయినా మాట నిలబెట్టుకున్నా రని, ఇక మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం పెన్షన్‌ రూ.6వేలకు పెంచుతారని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తారని సంబర పడ్డారు. అలాగే 2016-వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తారని, క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో వికలాంగుల పోస్టులు భర్తీ చేసారని ఎదురుచూశారు. హామీలన్నీ వంద రోజు ల్లోనే అమలవుతాయనుకుంటే ఏడాది గడిచినా ఆశ నెరవేరలేదు. 2024 జనవరి నుండి ఇస్తామన్న రూ.6వేల పెన్షన్‌ ఊసేలేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. మరి ఏడాది పాలన వికలాంగులకు ఏమిచ్చింది? అంటే, నిరాశనే మిగిల్చింది.
నేషనల్‌ డిసబుల్డ్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలో 43.02లక్షల మంది వికలాంగులున్నారు. వీరిలో 5.17లక్షల మందికి పెన్షన్స్‌ లబ్ధిదారులు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్స్‌ కోసం 2023 డిసెంబర్‌లో జరిగిన ప్రజాపాలనలో 24.85లక్షల మంది దరఖాస్త్తు చేసుకున్నారు. ఏడాదవుతున్న ఒక్క కొత్తపెన్షన్‌ కూడా రాలేదు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలతో పాటు మరో 70 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి ప్రచారం చేసింది. ఇందు లో ప్రధానంగా వికలాంగుల పెన్షన్‌ రూ.6వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఐదు రకాల పెన్షన్స్‌ రూ.4వేలకు పెంచి జనవరి నుండి అమలు చేస్తామని హామీని చ్చింది. 2024 -25వార్షిక బడ్జెట్లో ఆసరా పెన్షన్స్‌ సుమారు రూ.14 వేల కోట్లు నిధులు కేటాయిం చింది. ఈ నిధులతో ఆసరా పెన్షన్స్‌ పెంచి అమలు చేయడం సాధ్యం కాదు. అంటే బడ్జెట్‌లో వికాలం గుల సంక్షేమానికి ఒక్క పైసా కూడా అదనంగా కేటాయించలేదు. పార్లమెం ట్‌ ఎన్నికల ప్పుడు మే నెలలో తప్ప ఇప్పటి వరకు నెల మొదటి వారంలో పెన్షన్స్‌ రాలేదు.పెన్షన్‌ డబ్బుల కోసం లబ్ధిదారులు ఆందోళనలుచేస్తున్నా సర్కార్‌లో చలనం లేదు.
2014 ఆర్‌పిడి చట్టం, జీవో1 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్స్‌ అమలు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందులోనూ వికలాంగులకు రిజర్వేషన్స్‌ కల్పించ లేదు. ఆరు గ్యారంటీల అమలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్‌ సకలాంగుల కోసం కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. మహిళా శక్తి క్యాంటిన్స్‌ ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని నిర్ణయం చేసింది. మద్యం, ఇండిస్టీయల్‌, ఎంఎస్‌ఎంఈ-2024 వంటి పాలసీలను అమలు చేస్తున్నది. వీటన్నింటిలో ఎక్కడ కూడా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌ ప్రస్తావన లేదు. ఏడాది కాలంలో 53,310 మందికి ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెబుతున్నప్పటికీ నియామకాల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్స్‌ ఎందుకు అమలు చేయలేదు? వైద్య, ఆరోగ్య శాఖలో క్వాలిఫైడ్‌ సిబ్బంది లేరనే కారణంతో రిజర్వేషన్స్‌ అమలు పక్కనపెట్టింది ప్రభుత్వం. సమగ్ర కుటుంబ సర్వేలో 21 రకాల వైకల్యాలు కలిగిన వారి వివరాలు సేకరిస్తాని ముందు ప్రకటించి సర్వే పత్రంలో 21రకాల వైకల్యాల కోడ్స్‌ లేకపోవడం దేనికి సంకేతం? ఇందిరమ్మ ఇండ్లల్లో ఐదు శాతం రిజర్వేషన్స్‌ అమలు చేస్తామని, లబ్ధిదారుల ఎంపికలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎంపిక కమిటీల్లోనూ వికలాంగులకు స్థానం కల్పించలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో 34 కూడా అమలుకు నోచకపోవడం బాధాకరం. వికలాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్న ప్రయివేటు పరిశ్రమల్లో వికలాంగులకు ఐదు శాతం ఉద్యోగాలివ్వాలని జీవో విడుదల చేయకుండా ఎన్ని జాబ్‌ పోర్టల్స్‌ ఆవిష్కరణ చేసిన ఉపయోగం లేదు.రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ కార్పొరేషన్స్‌, గ్రంథాలయ, దేవాదాయ, మార్కెట్‌ కమిటీలకు చైర్మన్స్‌, పాలక మండల్లను నియమించింది. వీటిల్లో వికలాంగుల కార్పొరేషన్‌ మినహా ఎక్కడ కూడా వికలాంగులను నియమించలేదు.వికలాంగుల కోసం ప్రత్యేక గురుకులాలను కూడా ఏర్పాటు చేయడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో వికలాంగులకు మిగిల్చిన కన్నీళ్లను ప్రజాపాలన ఉత్సవాల తరువాతనైనా తుడిచే ప్రయత్నం చేయాలి. వికలాంగుల సంక్షేమ శాఖను బలోపేతం చేయడానికి తక్షణమే కార్యాచరణ ప్రకటించాలి. క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో నాలుగు శాతం ఉద్యోగాలు గుర్తించి వికలాంగులతో భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్‌ 56నుండి 10లోపు మార్చేందుకు స్టేట్‌ సభార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌కు సవరణ చేసి జీవో విడుదల చేయాలి. ప్రతి మండల కేంద్రంలో నైబర్‌ హుడ్‌ సెంటర్స్‌ ఏర్పాటు, ప్రభుత్వ హాస్పిటల్లలో అటిజం, స్పీచ్‌, హియరింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. 2016 ఆర్‌పిడబ్ల్యూడి, 2017మెంటల్‌ హెల్త్‌ యాక్ట్‌, నేషనల్‌ పాలసీ, నేషనల్‌ ట్రస్ట్‌ వంటి చట్టాల అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కోఆర్డినేషన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో వికలాంగులు వినియోగించుకునే విధానం గా మార్చాలి. ప్రభుత్వం జీవోలు, సమాచారం బ్రేయిలి, సైన్‌ లాంగ్వేజ్‌లలో అందుబాటులోకి తేవ డానికి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్‌ 20న ప్రారం భమైన ఉద్యమం డిసెంబర్‌ 10న హైదరా బాద్‌లో తలపెట్టిన మహాధర్నాతో ముగుస్తుంది. ఈ పోరాటం రేవంత్‌ సర్కార్‌ ఏడాది పాలనలో వికలాం గులకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తుంది.

– ఎం.అడివయ్య, 9490098713