నేను చేసిన తప్పేంటి?

What did I do wrong?ఏడాది క్రితం తాను చేసిన సోషల్‌ మీడియా పోస్టుపై ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదు కావడంపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు. మంగళవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనది ఫ్రీ వరల్డ్‌. వ్యంగ్యం అనేది మీడియా సహా ప్రతి చోటా ఉంటుంది. ఇప్పుడున్న సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే వందలాది మీమ్స్‌ కనిపిస్తాయి. నేను ఏడాది క్రితం చేసిన పోస్ట్‌ కూడా అలాంటిదే. అయితే ఏడాది తర్వాత ఒక వ్యక్తి మేలుకుని నాపై పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఇదే పోస్ట్‌ను కారణంగా చూపుతూ ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే అనే అనుమానంతో నేను ముందస్తు బెయిల్‌ కోసం అప్లై చేసుకున్నాను. నేను చేసిన తప్పేంటో, ఏ సెక్షన్‌లో అరెస్ట్‌ చేస్తున్నారో పోలీసులు చెప్పకముందే కొన్ని మీడియా సంస్థలు హడావుడి చేశాయి. ఏపీలో సెన్సార్‌ ఇబ్బందుల వల్ల నేను పొలిటికల్‌ మూవీస్‌ చేయడం మానేస్తా అని పోస్ట్‌ చేశా. అది కూడా ఏడాది పాటు సెన్సార్‌ కోసం వెయిట్‌ చేసి, చిరాకుగా ఉండి పొలిటికల్‌ బేస్డ్‌ మూవీస్‌ రూపొందించను అని పోస్ట్‌లో పేర్కొన్నా’.