శత్రువుకి అవకాశమిస్తే ఎలా..?

How if the enemy gets a chance..?‘ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వమంటారు…’ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ చెప్పిన మాటలివి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు ఎన్ని సవాళ్లెదురైనా ప్రతి సందర్భంలోనూ ప్రజాస్వామ్యం తనేంటో చూపుతూ వస్తోంది. మన రాష్ట్రంలోనూ అదే పునరావృతమైంది. సంక్షేమం, అభివృద్ధి ఫలాల మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించబోం, నియంతృత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించ బోమనే బలమైన సంకేతాలను ఇచ్చింది ఇక్కడి ప్రజానీకం.
పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్బంధం, నిరంకుశత్వం అడుగడుగునా రాజ్యమేలాయి. ప్రశ్నించే గొంతుకలకు వేదికైన హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ను ఎత్తేయజూసింది నాటి కేసీఆర్‌ ప్రభుత్వం. హక్కుల కోసం నినదించిన కారణంగా ఖమ్మంలో అన్నదాతలను ఆనాడు బేడీలేసి మరీ జైలుకు పంపింది. ఇసుక దందాను అడ్డుకున్నందుకు నేరేళ్ల జనాన్ని ఇసుక మాఫియా చావగొట్టింది. అక్కడి బాధితులు నేటికీ మనుషులు కాలేకపోతున్నారు. ఇక కార్మికుల గోస సరేసరి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. పంచా యతీ కార్మికులు, మున్సిపల్‌ వర్కర్లు, అంగన్‌ వాడీలు, ఆశాలు… ఇలా ఒకటేమిటి, అనేక యూనియన్లు, సంఘాల ఆందోళనలను అణగదొక్కింది ‘కారు..సారు’ సర్కారు.
ఈ క్రమంలో పదేండ్ల తర్వాత తెలంగాణ ప్రజానీకం…ఈ నియంత పోకడలను భరించ లేమంటూ నిక్కచ్చిగా తేల్చిచెప్పింది. ఫలితంగా గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కారు ఫల్టీల మీద ఫల్టీలు కొట్టిన వైనం మనకెరుకే. ఆ తర్వాత రేవంత్‌ సారధ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ప్రజా పాలన’ను అందిస్తామంటూ అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో పదకొండు నెలలు గడిచాయి. గత ‘గులాబీ’ జమానాతో పోలిస్తే కొన్ని అంశాల్లో మౌలికమైన మార్పులొచ్చాయనే విషయాన్ని కాదనలేం. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, ప్రజల్ని నేరుగా కలవటం, సమస్యలపై జనం ఇచ్చే వినతిపత్రాలను స్వీకరించటం, సామాన్యుడు సైతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు అవకాశమి వ్వటం, రైతు, బీసీ కమిషన్లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం తదితరాంశాలు మెచ్చుకోదగ్గవే.
ఇదే సమయంలో కొన్ని అవగాహనా రాహిత్యపు ఆలో చనలు, తొందరపాటు నిర్ణయాలు తనకు చిక్కులు తెచ్చిపెడు తున్నాయనే విషయాన్ని కాంగ్రెస్‌ సర్కారు గుర్తెరగాలి. ఇటీవల కొడంగల్‌లో కొనసాగిన ఫార్మా రగడ ఆ కోవలోనిదే. ఆ సంఘటన వెనకున్న ‘కోణాల’ నిగ్గు తేల్చాల్సిందే. అయితే రైతుల పక్షాన పోరాడుతున్న వామపక్షాలు, ప్రజాస్వామికవాదులను అడ్డుకోవటం ఆక్షేపణీయం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…తమ హక్కులు అడిగిన నేరానికి ఆర్టీసీలోని కార్మిక సంఘాలపై ఆంక్షలు విధించింది, అంతేకాదు గుర్తింపు సంఘం ఎన్నికలను సైతం రద్దుచేసి, తన అహంభావాన్ని చాటుకుంది. ఇప్పుడు అవే కార్మిక సంఘాలు… తమపై ఆంక్షలను ఎత్తేయాలంటూ రేవంత్‌ సర్కారును అడుగుతున్నాయి. వీటితోపాటు పరీక్షలు వాయిదా వేయాలంటూ గ్రూప్‌-1 అభ్యర్థులు, బిల్లులు చెల్లించాలంటూ సర్పంచులు, ఊపిరి సలపని డ్యూటీలతో సతమత మవుతున్నామంటూ తెలంగాణ స్పెషల్‌ పోలీసులు తమ నిరసనలను వ్యక్తం చేశారు. ఇవన్నీ కొన్ని రాజకీయ ప్రేరేపిత శక్తుల వల్ల జరిగాయన్నది ప్రభుత్వ ఆరోపణ. ఆ నిజానిజాలన్నీ మున్ముందు తేలతాయి. ఈ సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఎంతుందన్న సంగతి పక్కన పెడితే… అది అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుని, తన ఉనికిని చాటుకునేందుకు తాపత్రయపడుతోంది. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా వాడుకుంటోంది.
ఆ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌పైనా, ఆయన మంత్రివర్గ సహచరుల పైనా బీఆర్‌ఎస్‌ అగ్రనేతల నుంచి చోటామోటా నాయకుల దాకా అవాకులు చెవాకులు పేలుతున్నారు. ప్రతిగా సీఎం, ఆయన క్యాబినెట్‌ సహచరులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇలా ఈ రెండుపక్షాలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటే… ‘మూడోవాడు’ తనపని తాను కానిచ్చేస్తున్నాడు. గ్రూప్‌-1 అభ్యర్థులు, హైడ్రా, మూసీ బాధితుల ఆందోళనలను ఇప్పటికే తనకు అనుకూలంగా మార్చుకున్న ఆ మూడోవాడే బీజేపీ. ఇప్పుడు అధికారపక్షం బాధ్యతరాహిత్యం, ప్రతిపక్షం సంకుచితత్వం… వెరసి కమలం పార్టీ ఎదుగుదలకు దోహదపడతాయేమోన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. గోతికాడ నక్కలా కాసుక్కూర్చున్న దానికి అలాంటి అవకాశాన్ని, ఆయుధాన్ని స్వయంగా కాంగ్రెస్సే ఇస్తే ఎలా? అందుకే ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికైనా తన నిష్క్రియాపరత్వాన్ని వీడి, బాధ్యతను గుర్తెరగాలి. గత బీఆర్‌ఎస్‌ నిర్బంధాలు, నియంతృత్వాన్ని భరించలేని ప్రజలు, దాన్ని ఇంటికి సాగ నంపారు. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ కూడా అదే పోకడలు పోతే… మున్ముందు ప్రజల కోపానికి గురికాక తప్పదనే విషయాన్ని గుర్తించాలి.