అంబేద్కర్ చనిపోయి ఆరవై ఎనిమిదేండ్లయింది. భౌతికంగా మనకు దూరమైనా రాజ్యాంగం రూపంలో, రిజర్వేషన్ల కల్పనలో బతికేవున్నాడు. అయితే మన దేశంలో రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి అమలు చేయాలని కలలు గంటున్న ఆరెస్సెస్-బీజేపీ కొత్తగా అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నది. ఎందుకు? స్వయాన ప్రధాని మోడీ(నమో) రాజ్యాంగం పీఠిక కండ్లకు అద్దుకుని మరీ అతన్ని పొగిడే పనిలోపడ్డారు.ఆయనే కాదు, సంఫ్‌ు పరివారమంతా కూడా నేడు అంబేద్కర్‌ను భుజాన వేసుకుని మోస్తున్నది. ఆయన పేరుతో కమిటీలు వేస్తున్నది. జయంతి, వర్థంతులను కూడా నిర్వహిస్తున్నది. బీజేపీ నిజంగా అంబేద్కర్‌ను అభిమానిస్తుందా? లేకా ఇది ఆరెస్సెస్ వ్యూహమా? ఆలోచించాల్సిన సమయమిది.
చరిత్రను ఓసారి పరిశీలిస్తే హిందూ మతం హింసతో జంతుబలులు చేస్తూ,యజ్ఞయాగాదులు జరుపుతూ వున్నా రోజుల్లోనే బౌద్ధం పుట్టింది. అహింసావాదాన్ని ప్రచారం చేసింది.సంఘంలో ఉన్న హెచ్చుతగ్గులు పోవాలని,స్త్రీ పురుషులు సమానమనీ, మానవులంతా ఒకటేనన్నది. అందుకే ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు.ఆదరించారు. అనుసరించారు. అప్పుడేం జరిగింది? హిందూ మతం పునరుద్ధరణ పేరిట,రాజుల సహాయంతో శంకరాచార్యులు మొదలైనవారు అడుగుపెట్టి బౌద్ధాన్ని తిరస్కరించారు.బౌద్ధ భిక్షువులను తరిమికొట్టారు. బౌద్ధ ఆరామాలను కొన్నిచోట్ల దేవాలయాలుగా మార్చారు. అయినా బౌద్ధం పూర్తిగా నాశనం కాకపోయేసరికి, బుద్ధుడిని పొగడటం ప్రారంభిం చారు.(నేడు అంబేద్కర్‌ను పొగిడినట్టే) తెలివిగా బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక్కడన్నారు. దేవుడు అనే భావనను దూరంపెట్టిన బుద్ధుడినే దేవుడిగా మార్చి కొలిచారే గానీ బుద్ధుడి భావాలు అమలు పరచలేదు. సమానత్వం అనే మూలభావాన్ని ఆచరించలేదు. మనదేశంలో బౌద్ధం నాశనమవ్వడం పునర్వికాసానికి,హేతువాదానికి, మానవ వాదానికి ప్రమాదంగా పరిణమించింది. కులాల హెచ్చుతగ్గులు మళ్లీ విజంభించాయి. బౌద్ధులకు, హిందువులకు జరిగిన పోరాటంలో అంటరానితనం పుట్టింది.సంస్కరణవాదులు ప్రయత్నించినా హిందూ సమాజంలోని దోషాల్ని తొలగించలేకపోయారు.ఈ దోషాలకు మూలాధారంగా పవిత్ర మత గ్రంథాలు, శాస్త్రాలు నిలిచాయి.వాటి జోలికి పోకుండా తలపెట్టిన సంస్కరణలు హిందూ మతాన్ని,వాటిలో దోషాల్ని తొలగించలేకపోయాయి. ఇరవయ్యవ శతాబ్దంలో అంటరానితనాన్ని పాటించే హిందూ సమాజం ప్రపంచం దష్టిలో తలవంపులకు గురైంది.అలాంటి స్థితిలో అంబేద్కర్ వచ్చి కులంకషంగా హిందూ సమాజంలోని లోపాల్ని ఎత్తిచూపి వాటిపై పోరాడారు.
అంబేద్కర్ కేవలం ద్వేషంతో,పగతో హిందువుల్లో అగ్రవర్గాల వారిని,ముఖ్యంగా బ్రాహ్మణ ఛాందసులను తిట్టలేదు.సుదీర్ఘంగా పరిశోధించి,ప్రమాణాలతో విషయ పరిశీలన చేసి చూపారు. పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తి ప్రస్తావించారు.మనువు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్న అమానుష,క్రూర,ఘోర నియమాలు,నిషిద్ధాలు, అక్రమశిక్షలు, నిచ్చెనమెట్ల సమాజాన్ని బిగించిన తీరు వివరించారు. అంటరానితనాన్ని శాస్త్రోక్తంగా సమర్ధిస్తున్న ధర్మాలను తెలియపరిచారు. అంటరాని కులాలు,శూద్రులు దేశంలో గణనీయంగా వున్నారు.వారి ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలవదు గనుక కొత్త ఎత్తుగడలతో,తాత్కాలికంగా ఓటర్లను మభ్యపెట్టే వ్యూహాలతో అంబేద్కర్‌ను పొగిడే పనిలో పడ్డారు బీజేపీ నాయకులు. అంబేద్కర్ సిద్ధాంతీకరించిన వాటిని ఆమోదించి ఆచరిస్తామంటే అభ్యంతర మేమిటనే ప్రశ్న వారినుంచి రావచ్చు.కానీ పొగుడుతూ, గోతులు తవ్వి అంబేద్కర్‌ను పూర్తిగా చంపేయాలనే ఎత్తుగడ అయితే జాగ్రత్తపడాల్సిందే! ఆ విషయం శ్రద్ధగా,లోతుగా పరిశీలించాలి.అంబేద్కర్ పేరిట ఇప్పటికే కొందరు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ కమిటీలు వేయమనీ,విగ్రహాలు ప్రతిష్టించమనీ, ఉత్సవాలు జరపమనీ కోరుతున్నారు. ఇలాంటి అంబేద్కర్‌వాదులను సంతప్తి పరచడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధమే.అది కూడా అంబేద్కర్ వాదాన్ని ఉరితీసే వ్యూహమే?అయితే, ఈ విషయం గ్రహించడానికి అంబేద్కర్ వాదులకు కొంతకాలం పట్టొచ్చు. అంబేద్కర్‌కు ప్రస్తుతం దేశంలో కొత్త అభిమానులు ఏర్పడ్డారు. బీజేపీ తమ ఎత్తుగడలో అంబేద్కర్‌ని కూడా చేర్చడం గమనార్హం. కానీ ఈ ఎత్తుగడ విఫలంగాక తప్పదు. అంబేద్కర్‌లో బీజేపీ ఆమోదించే అంశమేదీ కనిపించడం లేదు.కేవలం ఓట్ల కోసమే అంబేద్కర్‌ను శ్లాఘిస్తున్నా,అది మరీ కత్రిమంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది. అంబేద్కర్ ఆశయాలు అమలు చేయాలంటే కొన్ని శాస్త్రాల్ని, గీతను, వేదాలను, రామాయణ, మహాభారతంలోని అంశాలను,ధర్మశాస్త్రాల్ని పక్కన బెట్టాలి.పాఠ్య గ్రంథాలలో ఈ అంశాలు రాకుండా చూడాలి.అంటరానితనాన్ని పాటించే ఆశ్రమాధిపతుల్ని దూరంపెట్టాలి. ఇవి చేయడానికి బీజేపీ సిద్ధపడుతుందా? అందుకే అంబేద్కర్‌లో బీజేపీవారు అంగీకరిస్తున్నదేమిటో, నిరాకరిస్తున్నదేమిటో జనానికి తెలియాలి.ఫలానా విషయం తణీకరిస్తున్నామంటే,ఎందుకో కారణాలు కూడా బీజేపీ చెప్పాలి.ఇదేమీ చేయకుండానే బీజేపీ హఠాత్తుగా అంబేద్కర్ వర్థంతులు,జయంతులు జరుపుతూ ఊరేగింపులు చేస్తామంటే సమాజం ఊరుకోదు, ప్రశ్నిస్తుంది.
నాదెండ్ల శ్రీనివాస్
9676407140