వానికి ఆరోగ్యం ఇవ్వని విద్య దేనికి!?

What is education that does not give him health!?మా తరం వరకు మబ్బుల లేవగానే ఇంటిపనులు, పొలం పనులు…
పశువుల పెండ తీసి… దొడ్డి శుభ్రం చేసి…
వాటికి నీళ్ళు పెట్టి, మేతేసి…
వాగుల ఆడి పాడి…
వేప పుల్ల వేసి పళ్ళు తోమి…
బాయికాన్నే స్నానం చేసి బడికి పోతే…
తరగతి గదులు లేకున్నా అరకొర సౌకర్యాలైనా..
చెట్లకింద చదువులైనా…
అన్ని సబ్జెక్ట్‌లకు టీచర్లు లేకున్నా…
భయం, భక్తీ, బాధ్యత, భవిష్యత్తు లక్ష్యాలు,
వాటి మధ్య చదువు సరిగా రాకున్నా…
సంస్కార వంతమైన విద్యాబుద్దులు నేర్చుకునేట్టు మా చదువులు సాగేవి!
సెలవులు వస్తే కూలీ పనులు…
దోస్తుగాళ్ళతో ఆకలి, అలసట తెలియని ఆటలు…
చెమట కారీ.. కారీ… ఉప్పు పేరిన బట్టలు…
అట్టు కట్టిన తనువులు…
కాళ్ళకు చెప్పులు సరిగా లేని బతుకులు…
మందులు వెయ్యని మెతుకులు…
ఎల్లిపాయే కారంబువ్వ, ఎంత కమ్మగుండేదవ్వ!
ఎండకాలం వస్తే బావుల్లో బుర్రకాయహొ ఈతలు, అడుగు మట్టి తెచ్చే ఆటలు!
వానాకాలం వాగుల్లో నడకలు, వాహనాలను వాగు దాటిచ్చి సంపాయించిన పైసలు!
చలికాలంలో అరికంఠ్లాలు కట్టుకొని,
చలి మంటలు వేసుకొని ముచ్చట్లు!
పండ్ల పుల్ల వేసి ప్రకతిలో పాదం మోపితె…
పొట్ట కూటికి తిప్పలుండేదే కాదు
మోతుకు పువ్వుల్లో తేనే..
ఈత పండ్ల తీయ్యటి గూగం..
మామిడి కాయల వగరు..
ముంజ కాయల జిగురు..
మర్చిపోగలమా బ్రదరు!?
అవ్వ పొద్దంత కైకిలి పోయి..
రాత్రి పురిటి నొప్పులొస్తే…
మంత్రసాని కాన్పు జేస్తే…
నులక మంచంల పుట్టినం…
మట్టిల ఆడి పెరిగినం…
లైట్ల లాగులు ఏసినం…
ఫైట్లు మస్తు జేసినం…
గ్యాసునూనె దీపాల కింద చదివినం…
ఎల్‌ ఇ డి బల్బు కూడ చూసిన…
అగ్గిపెట్టె ఫోను నుంచి ఐ ఫోన్‌, ఆపిల్‌ ఫోన్‌ దాక వాడుతున్నం…
సైకిల్‌ ట్యూబ్‌ తోని ఆడినొల్లం, యూట్యూబ్‌ కూడ చూసెటొల్లం!
క్లాస్‌ టాపర్‌ కాకపోయిన ల్యాపుటాఫ్‌ వాడుతున్నం!
మోట కొట్టుడు దగ్గర నుంచి మీట నొక్కే మోటర్‌ దాక చూసినొల్లం!
ఎన్ని పరిస్థితులనైన ఎదుర్కొని నిలిచినం…
ఎంత కష్టాన్నైన తట్టుకొని ఎదిగినం!
ఇప్పటి పిల్లలు…
అమ్మ కడుపుల పడ్డది మొదలు..
నెలా నెలా టెస్టులు, మందులు…
హాస్పిటల్లో పుట్టవట్టే ఇంకుబేటర్లో పెట్టవట్టే
పార్కులల్ల ఆడవట్టే
పారం కోళ్ళలాగ పెరుగవట్టే
వేళ్ళ బొక్కలు ముదురుడు లేదు
ఏగిల్లువారంగ లేసుడు లేదు
నాలుగేండ్లకే నర్సరీ
బడికురుకుడు శురువు మరీ!
లేపంగ లేపంగ లేచి బ్రష్‌ ను పండ్లల్ల తోచి
బ్రేకు ఫాస్టులు మెక్కి బ్యాగుల బుక్కులు కుక్కి
బరువు మోయలేక నడక నక్కి, నక్కి!
వానికిగ వ్యాయామం ఏది?
రారో.. కూసోరో.. బుక్కు తెరువురో…
సదువురో.. రాయిరో.. ఇదే వరస…
వాడు రాస్తున్న బుక్కులు దగ్గరేస్తే గడ్డివామంత!
వాడు మోస్తున్న బ్యాగులు తూకమేస్తే బార్దానంత!
విద్యా విధానం సక్కగ లేక,
శారీరక వ్యాయామం అస్సలు లేక,
వద్దులకొచ్చే వ్యాధులు వానికి!
ఆరోగ్యం ఇవ్వని చదువులు దేనికి?
ఆక్షరాలు మాత్రమే కాదు,
పిల్లల ఆరోగ్యం కూడ విద్య సూత్రం కావాలె!
బడి అంటే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచరుండాలే!
అట్లనే చట్టం తేవాలే, అది అమలు కావాలే!
ఇప్పుడు ఆ టీచర్‌ అవసరాన్ని గుర్తెరగాలే!
”ఆటా పాటలతోనే ఆరోగ్యం ఆరోగ్యవంతులకే అక్షర సేద్యం సాధ్యం!”
”ఆటా పాటా లేని విద్య అవిటి విద్య!”
– సంపత్‌ బోయిని,
8341574158