గణపతి బప్పా..ఏందయా?

గణపతి బప్పా..ఏందయా?గణపతిబప్పా వచ్చాడు పోయాడు, అందరికీ సందడి, సందడి కొందరికేమో వ్యాపారం, ఇంకొందరికి రాజకీయం. ఏమైతేనేం అందరి కోర్కెలూ తీర్చిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. ఆ కోర్కెలు ఏమిటన్నవి ఎవరికివాళ్ళకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకునే పనిలేదు. అందుకే గణపతి బప్పా నువు గ్రేటయా అని చెప్పాలనిపిస్తోంది. సర్వమతాల మధ్య సఖ్యత కోసం లోకమాన్యుడు మొదలు పెట్టిన ఈ గణపతి ఉత్సవాలు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రారంభించారు. తరువాత అవి వివిధ రకాలుగా మారిపోయి ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి అని కొందరంటే ఈ విధంగా అఘోరించాయి అని ఇంకొందరనొచ్చు. పదాలు వేరే కాని అర్థం ఒకటేనని గమనించాలి మనం.
అసలు జమిలి ఎన్నికలు, జమిలి ఎన్నికలు అని చెబుతున్నారు కాని ప్రజలే జమిలిగా చేసే ఉత్సవాలు ఈ గణేష్‌ పండుగ ప్రత్యేకత అని చెప్పొచ్చు. రాజకీయాల్లోలా కాకుండా జమిలిగా చేసే ఈ ఉత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఒక తలపై రూమి టోపి, ఒక తలపై గాంధి టోపి, క్యాభాయ్ అని అంటాడొకడు, ఏమోయని అంటాడొకడు అని సినారె ఎప్పుడో రాశారు. మతాలు, భాషలు వేరైనా మనమంతా భాయీ భాయీ అన్నాడు. ఈ భాయీల మధ్య చిచ్చు పెట్టేవారు కొందరైతే అన్న రామారావులాంటి వాళ్లు ఇంకా కొంతమంది అభ్యుదయవాదులు వారి మధ్య స్నేహాన్ని పెంచారు. విమోచన దినమా, స్వాతంత్య్రదినమా అని పోట్లాడుకునే సమయం లోనే ఈ వినాయకచవితి వస్తుంటుంది. వినాయక నిమజ్జనానికి ఎవరికిష్టమైన పేరు వాళ్లు పెట్టలేదని ఒక్కోసారి ఆనందపడుతుంటారు కొందరు. లేదంటే పాపాలను విమోచనచేస్తాడని కొందరు, లేదూ పాపాత్ముల నుండి స్వేచ్ఛ తెస్తాడని కొందరు ఇలా ఎవరికి అవసరమైనది వాళ్లు చెప్పొచ్చు. అసలు నల్లగొండ నుండి బయలుదేరిన అరుణవీరుల వల్ల తెలంగాణ విముక్తి పొందిందని, అదే పోరాట స్ఫూర్తిని కలిగించిన అంశమని ఒక్కరంటే ఒక్కరు చెప్పరు. జంటనగరాల్లో ప్రజలు సఖ్యతగా ఉన్నారంటే సెక్యులర్‌ శక్తులన్నింటి పాత్ర ఉందని గమనించాలి.
ఇక పంచ భూతాల గురించీ తెలుసుకోవాలి మనం. అంటే ఐదు భూతాలు అని అనుకునేరు, గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఇవన్నమాట లెక్క ప్రకారం. ఎవరి లెక్క అంటే దానికి పెద్దస్టోరీ ఉంది. అందుకే ఆ ఐదు భూతాలు ఏమిటి అనేవరకే మన పని. విషయానికొస్తే ఈ పంచ భూతాలను కొన్ని భూతాలు గణపతి బప్పా పేరు పెట్టుకొని కాలుష్యం చేస్తున్నారు. పేల్చే టపాకాయలు గాలిలోనికి కాలుష్యాన్ని వెదజల్లడమే కాదు గాలి ద్వారా పోయి చెవులను పాడు చేస్తున్నాయి. డీజే శబ్దాల గురించి చెప్పే పనే లేదు. ఈ శబ్ద కాలుష్యం చెవులనే కాదు మెదడును కూడా చెడగొడుతుందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఎవరు వింటారు వాళ్ల మాటలు చెప్పండి?
నీరు రకరకాల రూపాల్లో దర్శనమిస్తుంది ఈ వినాయక నిమజ్జనాల సందర్భంగా. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, ఇతర రసాయనాలు, రంగులు కలిపి తయారు చేసిన బొమ్మలు నీటిని ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనివల్ల నీటిలో కాలుష్యం పెరిగి అది భూమిలోకి ఇంకిపోవడమే కాకుండా గాలిలో కూడా మార్పులు తెస్తుంది. ఎండలో వచ్చిన మినరల్‌ వాటర్‌ బాటిళ్లు, కూల్‌ డ్రింకు సీసాలు నీటినే కాదు గాలిని, భూమిని, ఆకాశాన్ని చివరికి మనుషుల ఆరోగ్యాల్ని పాడు చేస్తున్నాయి. ఇక యువతకు మందుబాటిళ్లు ఇస్తున్నారు కదా, వాటిలోనూ నీళ్లే కదా, ఇంకో రూపంలో.
ఇక చెత్తను ఎక్కడికో తీసుకుపోయి పాడేసే బదులు, కాల్చేస్తే సులభం కదా ఆపని చేస్తున్నారు కొందరు. ఆ విధంగా అగ్నిని వాడి చేస్తున్న కాలుష్యం ఆకాశానికి చేరి అక్కడ ఓజోన్‌ పొరను దెబ్బ తీస్తుంది. ఊరకే ఎండలు, కుండపోత వర్షాలు, క్లౌడ్‌ బరస్టింగులు, వరదలు ఇలాంటి వాటి వెనుక మానవుడు చేస్తున్న కాలుష్యం మనం చూడొచ్చు. సంబురాలు చేసుకునే ప్రతి విషయాన్నీ చేసుకోవాల్సిందే తప్పు లేదు. ఆ సంబురాల్లో జనం కావాలి, జనం రావాలంటే మొదట వారు ఆరోగ్యంగా ఉండాలి. భక్తి పారవశ్యంలో పంచభూతాల మీద భక్తిని కూడా చాటాలి. పొద్దున లేచినప్పటినుండీ పంచభూతాలకు పూజించేవాళ్లు ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎలా మరచిపోయారో అర్థం కాదు. నిజంగా తన చుట్టూ ఇంతగా నష్టం జరుగుతున్నట్టు నాయకులందరికీ తెలుసు కాని వినాయకుడికి తెలియదు. తెలిసే అవకాశమూ లేదు. పర్యావరణ ప్రేమికులకు తెలిసినా వాళ్ల మాట వింటున్నట్టు నటిస్తారే కాని ఎవ్వరూ వినరు. అందుకే గణపతి బప్పా ఇది ఏందయా అని అడగాలనుంది.
– జంధ్యాల రఘుబాబు
9849753298