దేశంలో పార్లమెంట్ అత్యవసర ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుండి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించ బోతున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో! మాత్రం తెలుపలేదు. ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏది ప్రకటించలేదు? ఈ ప్రకటనతో మీడియా, రాజకీయ నాయకులు, సామాజిక (ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా) మాధ్యమాలు, రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన విధంగా వారి ఊహాగానాలు, కథనాలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమా వేశాల్లో కేంద్ర ప్రభుత్వం మన దేశానికి ఇండియాకు బదులుగా భారత్‌గా పేరును మారుస్తూ తీర్మానం చేయబోతుందని ఆంగ్ల ప్రసారమాధ్యమాలు వార్తలు, కథనాలను ప్రసారం చేస్తున్నాయి. జీ-20 విదేశీ నేతలకు పంపిన విందుకు ఆహ్వాన పత్రంలో ”ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని పేర్కొంటూ రాష్ట్రపతి కార్యాలయం ముద్రించింది. దీనితో ఈ వాదనకు బలం చేకూరుతుంది. వాస్తవంగా రాజ్యాంగంలో.. సాధారణ ప్రజల భాషలో భారతదేశాన్ని భారత్, ఇండియాగా పిలుచుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ”ఇండియా, దట్ ఈజ్ భారత్, షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్” అని ఉంది. ఆర్టికల్ 52లో రాష్ట్రపతిని ”ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా” అని పేర్కొన్నారు. కానీ పైన చెప్పినట్లు ఇప్పుడు ”ప్రెసిడెంట్ ఆఫ్ భారత్”గా వాడడంతో ఇండియా స్థానంలో భారత్ పేరును మార్చ డానికి సిద్ధమైనట్లు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
రాజ్యాంగంలోనే రెండు పేర్లు ఉండగా ఎందుకింత హడావిడి చేస్తున్నారు. ప్రజానీకానికి అర్థమవుతోందో లేదో గానీ ఈ మధ్య జరిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశమై వారు ”ఇండియా” పేరుతో కూటమిగా ఏర్పడడం మూలంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాదు కేంద్రంలో గాని, రాష్ట్రాల్లో గాని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసమో, అధినాయకుల ప్రతిష్టల కోసమో ప్రభుత్వ పథకాల పేర్లు, ప్రభుత్వ సంస్థల పేర్లు, నగరాల పేర్లు, పట్టణాల పేర్లు, కూడళ్ల పేర్లు మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఈ పేరు మార్పిడి హాట్‌టాపిక్‌గా మారినప్పటికీ, ఈ మార్పు వలన పేదరికం పోతుందా! మరోవైపు కేంద్ర ప్రభుత్వం చాన్నాళ్లుగా… ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో దేశంలో నిర్వహించ తలపెట్టిన జమిలి ఎన్నికల పైన చర్చించేందుకు ఈ పార్లమెంటు సమావేశాలను జరపతలపెట్టినట్లు ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. మరికొందరేమో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)పై చర్చించడానికి అంటున్నారు. కాదు.., కాదు? చట్టసభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ”మహిళా బిల్లుకు” ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి చట్టం చేయడానికని ఊహిస్తున్నారు. ”జమిలి ఎన్నికలు” ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహణ సాధ్యా సాధ్యాలపై పరిశీలనకు కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు సభ్యులుగా ఎనిమిది మందిని ఎంపిక చేశారు. ఈ కమిటీ ముందు ఏడు విధి విధానాలను ఉంచారు. నివేదిక సమర్పణకు గడువు లేదు. మరోవైపు ఈ కమిటీలో ఉండేందుకు అధీర్ నిరాకరించారు. దక్షిణాదికి ప్రాతినిధ్యం లేదని, ఈ కూర్పును తప్పు పడుతున్నారు ఇంకొందరు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో సమకాలీన రాజకీయ వాతావరణంలో జమిలి ఎన్నికలకు ఏకాభిప్రాయం సాధ్యం కాదనే వాదన వినబడుతుంది. ఒక్కసారిగా జమిలిపై ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని న్యాయ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది చట్టంగా రూపొందడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందనీ, రాష్ట్రాలు ఒప్పు కోవాల్సి ఉందనీ ఏకాభిప్రాయం సాధ్యం కాదని తెలుస్తుంది. ఉన్న ఫలంగా జమిలిపై ఇంత హడావిడి చేయడం.. సమావేశాలకు ఎజెండా లేకుండా సస్పెన్స్‌లో పెట్టి దేశ ప్రజలలో, రాజకీయ పార్టీలలో ఉత్కంఠతకు తెరలేపడం అవసరమా!
మొన్నటి వరకు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మణిపూర్ మంటల ఆవేశకావేశాలతో సభా కాలాన్ని వృధా చేసి మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల హడావిడి ఏమిటి? ఎందుకు ఈ సస్పెన్స్? ఎవరికి అంతుపట్టని విధానాలు ప్రజాస్వామ్యానికి, చట్టసభలకు క్షేమం కాదు! సమావేశపరిచే ఉద్దేశాన్ని రహస్యంగా ఉంచుతూ, మరోవైపు బయటకు లీకులు చేయడం భావ్యమా! ప్రభుత్వ ఉద్దేశం ఏదైనప్పటికీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ఉన్న నిబంధనలకు నీళ్లు చల్లుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను రాష్ట్రపతి చేయాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వమే ప్రకటన చేయడం గమనార్హం. ప్రభుత్వాలు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్థానం లేనప్పటికీ… కొన్ని మినహాయింపు లతో ప్రత్యేక సందర్భాలలో మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉందని తెలుస్తోంది. అలా భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక సమావేశం అయ్యాయి. 1975 జూన్ 21న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఇతర కార్య కలాపాలు అన్నింటిని పక్కన పెట్టి కేవలం ప్రభుత్వ వ్యవహారాలు మాత్రమే చేపట్టారు. ఆ తర్వాత 1976 అక్టోబర్ 25న మరోసారి లోకసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రాజ్యాంగానికి 42వ సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఇలా ఈ పరిణామాలు అన్ని దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న 19 నెలల కాలంలో జరిగినవే. ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదో ప్రభుత్వం ప్రకటించి ఉంటే, సభ్యులు ఆయా అంశాలపై ముందుగానే అవగాహనకు వచ్చే అవకాశం ఉండేది. తద్వారా సభలో అర్థవంతమైన చర్చకు వీలు కలిగేది. కానీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేనట్లు, దాటవేసే ధోరణి కనిపిస్తుందని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
ఇలాంటి విధానం ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా చేయడమే అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ సమావేశాలు ప్రజా సంక్షేమ చట్టాలు రావడం కోసం అయితే ఎవరికి అభ్యంతరం లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఇలా ఎజెండా లేకుండా… సస్పెన్స్ కొనసాగిస్తూ వెళ్లడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం చేతలకు, చేసే చట్టాలకు ప్రజా సంక్షేమమే పరమావధి కావాలి. సమాజ విస్తత ప్రయోజనాలకు అవి మేలు చేయాలి. అలా కాక ఎవరో కొందరు వ్యక్తులకో, అధికార పార్టీకో ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం మంచిది కాదు. ఏక కాలంలో ఎన్నికల కోసం తలపెట్టిన రాజ్యాంగ, శాసనసవరణ ప్రజాస్వామ్య వాదులు ఎవరు హర్షించరు. డబ్బుతో ఓట్లను, అధికారాన్ని కొనుక్కునే దుర్విధాన రాజకీయాలతో ఇప్పుడు దేశంలో అవినీతి గజ్జెకట్టి ఆడుతుంది. ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచి ఆపై మరో పార్టీలోకి గెంతే నేతల చట్టసభల సభ్యత్వాలు తక్షణం రద్దు కావాలి. ఆ తర్వాత ఐదేండ్ల పాటు మరే ఎన్నికల బరిలోకి దిగకుండా వారిపై నిషేధం విధించాలి. ఎన్నికల రోజున ఏరులై పారే నల్లధనాన్ని అరికట్టేందుకు ముందుకురావాలి. ఇవేవీ సరిచేయకుండా జమిలి ఎన్నికలను ఎత్తుకోవడం అంటే? దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసినట్లే అవుతుంది. పార్టీలకు, ప్రజలకు స్పష్టమైన విధానాలతో శ్రేయోరాజ్యం కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రజా పార్లమెంటును ఇలా ఆగమేఘాల మీద నిర్వహించడంలోని అనిశ్చితి ఆ సమావేశాలు జరిగితే తప్ప, ఆ చిక్కుముడి వీడే పరిస్థితులు కానరావడం లేదు.. ఇది వాస్తవం కాదా!
మేకిరి దామోదర్
9573666659