కానీ ఈ ఆధునిక కాలంలో మహిళల సంపాదనకు ప్రాధాన్యం పెరిగిపోయింది. గతంలో స్త్రీ సంపాదిస్తుంటే వేణ్ణీళ్లకు చన్నీళ్ల తోడు అనేవారు. ఇప్పుడు కుటుంబాలను పోషిస్తున్న మహిళల సంఖ్య ఎక్కువయింది. అయితే ఉద్యోగాలు చేసి ఎంత సంపాదిస్తున్నా ఇంటి పని మాత్రం తప్పడం లేదు. కొన్ని సంస్థల్లో అయితే 12 గంటలు కూడా పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల విపరీతమైన పని భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పూణెలో ఓ యువ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫీసు కుర్చీలోనే ప్రాణం వదిలిన ఘటన మనం చూశాము. ఇలా మహిళలు ప్రాణాలు పోయేంత ఒత్తిడిని అనుభవించాల్సి వస్తుంది.
ప్రస్తుతం మన దేశంలో స్త్రీలు ఉద్యోగం, ఇంటి పని, పిల్లల పెంపకం వంటి మూడు రకాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్స్ స్టాఫ్, హౌటల్స్, కాల్ సెంటర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫ్యాక్టరీ వర్కర్లు 9 గంటల నుండి 12 గంటల వరకు డ్యూటీలు చేయాల్సి వస్తుంది. ఈ పని గంటలతో పాటు ఆఫీస్‌కు రావడం, పోవడం, ఇంటి పని, పిల్లల పెంపకానికి పోగా ఇక రోజులో వారి విశ్రాంతి కోసం మిగిలే సమయం ఎంత?
ఒత్తిడి ఎదుర్కొంటూ…
జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువు, వైద్య, రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాళ్లకు కేవలం ఉద్యోగంలో మాత్రమే ఒత్తిడి ఉంటుంది. కానీ మహిళలకు ఉద్యోగ ఒత్తిడితో పాటు ఇంటి పని కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు… ఇలా అన్ని రకాల పనులు వారికే భారం. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా ఒత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.
బానిసలుగా చూస్తున్నారు
గతంలో ప్రభుత్వ ఉద్యోగంలో కొంత వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం అక్కడ కూడా పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది. సుఖమైన ఉద్యోగం అంటే బ్యాంకు ఉద్యోగం అనుకునేవారు అందరు. కానీ ఇప్పుడు అది పూర్తి విరుద్దంగా మారిపోయింది. బ్యాంకుల్లో చాకిరి విపరీతంగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద జీతాలు అందుకునే సాఫ్ట్‌వేర్ రంగం విషయానికి వస్తే వర్క్ ఫ్రం హౌమ్ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ఇక మల్టీ నేషనల్ కంపెనీల్లో అయితే భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా బానిసలుగా చూస్తున్నారు. లాగిన్ చేయడం వరికే వారి చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తారో వారికే తెలియదు. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.
ప్రాణాలను హరిస్తున్నాయి
కరోనా తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. వస్తున్న జీతం గురించి మాట్లాడుకోవడం కంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవితానికి భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయి. పూణెలో మరణించిన చాటెడ్ అకౌంటెంట్ సంఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రపంచం ముందుకు రాని ఇలాంటి ఘటనలు ఎన్ని ఉన్నాయో? భారతదేశంలో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పని చేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు అనే నిబంధనకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు 55 నుండి 60 గంటల పాటు మహిళలతో పని చేయించుకుం టున్నాయి. సాఫ్ట్‌వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారిపోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.
ఇండియాకు స్థానమే లేదు
చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియాకు స్థానమే లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్‌ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్‌ను రూపొందించడంలో భారత్ కూడా కీలక పాత్ర పోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో బానిస చాకిరి చేయించుకునే సంస్థలు పెరిగిపోయాయి.
స్మార్ట్ వర్క్ అవసరం
ఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్‌కు ఏ మాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్ కండిషన్స్ ఏ మాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే నో చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చెప్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలు పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.