చాలాకాలానికి అక్కింటికి వచ్చిన కిరణ్ ఇంట్లోని పరిస్థితిని చూసి షాక్ తిన్నాడు. ఐదు నిమి షాలకు షాక్ నుండి తేరుకుని మళ్ళీ తేరిపార చూశా డు. అనుమానం లేదు! తను చూసింది నిజమే! ఎదురుగా ఉన్నది తన బావేనని ధృవపర్చుకుని.
”అక్కా” అని గావు కేక పెట్టాడు.
వంటింట్లో నుండి పరుగెత్తుకుని వచ్చింది లక్ష్మి. తమ్ముడిని చూడగానే లక్ష్మికి ఎంతో సంతోషమైంది!
తమ్ముడూ! ‘అమ్మానాన్న ఎట్లా ఉన్నారురా’! అడిగింది లక్ష్మి.
‘అంతా బాగానే ఉన్నాం గాని! బావకేమయిందక్కా! ఏం చేశావక్కా నా బావని! ఎందుకిలా మారిపోయాడక్కా!’ అన్నాడు పూడుకుపోయిన గొంతుతో కిరణ్.
”నీ బావకేమయ్యిందిరా! బాగానే ఉన్నాడుగా! అయినా నీ బావను నేనేం చేస్తాను! నీ బావ చేయకుండా ఉంటే అదే పదివేలు”! అన్నది లక్ష్మీ.
”బావకేం కాలేదంటావేం! చూడు సరిగ్గా చూడు బంగారం లాంటి నా బావ సన్యాసం పుచ్చుకున్నాడు! దీనికి కారణం నీవుకాక మరెవ్వరు! అంతా నీవే చేశావు!” అంటూ బావను అక్కకు చూపించాడు.
నిజమే! అల్లు అర్జున్‌లా స్టైలిష్‌గా ఉండే భాస్కర్ బావ. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. చేతిలో గాడ్జెట్ బదులు ఇప్పుడు రుద్రాక్షలు కనబడుతున్నాయి! గాల్లో అల్లల్లాడే ఉంగరాల జుట్టు నూనె రాసి, కొప్పు కట్టాడు. బొట్టు అంటె తెలియని నుదుటన ఇప్పుడు పంగనామాలు తీర్చిదిద్దుకున్నాడు. కళ్లు మూసుకుని మంత్రోచ్చారన చేస్తున్నాడు. భాస్కర్! తపో ముద్రలో ఉన్నందున కిరణ్ వచ్చి గావు కేక పెట్టింది కూడా తెలియనట్లుంది.
బావను చూస్తూ దు:ఖం ఆపుకోలుక పోయాడు! కిరణ్.
”ఇంత చిన్న వయస్సులో నీకెంత కష్టం వచ్చింది! మా అక్క ఏదైనా మాట వినకుంటే. నాతో చెప్పకూడదా! దీనికే సన్నాసుల్లో కలిసిపోతావా! ఇంకా నయం! బావ ఇంట్లో నుండి బయమటకు వెళ్ళక ముందే చూశాను! నా బావను సన్నాసుల్లో కలవనీయను! మా అక్క సంసారం నిలబెడతాను! ” అని కళ్లు తుడుచుకుంటూ బావ కాళ్లను బిగ్గరగా పట్టుకున్నాడు కిరణ్.
దాంతో భాస్కర్ కళ్లు తెరిచాడు. కాళ్లు పట్టుకున్న బావమరిదిని లేవదీశాడు!
”మామూలుగా పలకరించవచ్చు కదా! డబ్బేమైనా కావాలా కిరణ్!” అన్నాడు ప్రేమగా.
”నాకేమెద్దు గాని, ఎందుకు బా! మా అక్క బతుకును ఆగం చేస్తున్నావు! నీకేం తక్కువ చేసింది? ఎందుకు సన్నాసం పుచ్చుకుంటున్నావు?” నిలదీశాడు కిరణ్.
”పిచ్చివాడా! ఇది సన్యాసం కాదు! అనుష్టానం నాయనా! అన్నాడు భాస్కర్.
”ఓరి నాయనో! సన్నాసమే వద్దని మొత్తుకుంటుంటే అనుష్టానం కూడా పుచ్చుకున్నావా?” అంటూ మళ్ళీ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు కిరణ్.
”ఒరే కిరణ్ తొందరపడకు! అనుష్టానం అంటే సన్యాసం పుచ్చుకోవటం కాదు! మీ అక్క నాకేం తక్కువ చెయ్యలేదు! సన్నాసిని కావల్సిన అవసరమూ లేదు! అక్కడ మా మోడీ అనుష్టానం చేస్తున్నాడు. ఇక్కడ నేనూ పాటిస్తున్నాను!” అన్నాడు భాస్కర్ రజనీకాంత్ స్టైల్లో.
”అక్కడ మోడీ అనష్టానికి కారణమేమిటో తెలుసా బా!” అన్నాడు కిరణ్.
రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయటానికి, పాటించాల్సిన ఆచారాల్లో అనుష్టానం కూడా ఒకటి!” అన్నాడు భాస్కర్ గంభీరంగా.
”అది కాదు! బా! ఏ పుణ్యకార్యం చేసినా, పెళ్లైన మగవాడు భార్యా సమేతంగా చేయాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి! సింగిల్‌గా ఉన్న మోడీ, ఈ పుణ్యకా ర్యాన్ని ఎలా చేస్తాడని శంకరా చార్యులు ప్రశ్నించారు! అందుకే పరిహారం కోసమే అనుష్టానం చేస్తున్నాడు” వివరించాడు కిరణ్.
”శంకరాచార్యులు ఎవరు! వారు ఖాన్‌గ్రెస్ వాదులు! వారిని మేం హిందువులుగా గుర్తించం!” అన్నాడు భాస్కర్.
కిరణ్ ఫక్కున నవ్వాడు.
”శంకరాచార్యులు, వైష్టవాచార్యులు, ఆఖారాలు హిందుమ తానికి మూల స్తంభాలు. దేశంలో బౌద్ధమతం విజృంభిస్తున్న కాలంలో శైవ, వైష్ణవ మతాలు కొట్టుకుంటుంటే. అది తప్పని అంతా కలిసి హిందూమతాన్ని పరిరక్షించుకోవాలని, దేశమంతా తిరిగి ధర్మ ప్రచారం చేసి, భారతదేశానికి నాలుగు దిక్కులా నా లుగు పీఠాలను ఏర్పాటు చేసి, ఆ నాలుగు పీఠాలకు, తన ప్రధా న శిష్యులను అధిపతులను చేసి, ధర్మ ప్రచార బాధ్యతలు అప్ప చెప్పిన జగద్గురు శంకరాచార్యుడి పరంపరే, ఇప్పుడున్న ఈ నలు గురు శంకరాచార్యులు! ఇప్పుడు శైవ, వైష్ణవ, శాక్తేయ మత కల్లో హాలు లేకుండా, హిందూమతం ఒక్కటే అనే భావన ఉందంటే దానికి కారణం ఆ జగద్గురే! ఆయన సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్న శిష్యులపైనే అభాండాలు వేస్తారా? ఎంత అన్యాయం!” అన్నాడు కిరణ్.
”హహ్హ! మా విశ్వగురువు ముందు ఈ జగద్గురులు సూర్యు డి ముందు దివిటీల్లాంటివారు! అన్నాడు భాస్కర్.
కిరణ్ తలపట్టుకున్నాడు.
”నీకో విషయం చెప్పనా! మోడీ అంటే ఎవరనుకున్నావు! సాక్షాత్తూ భగవంతుడి అవతారం! ఈ దేశాన్ని ఈ హిందూ మతాన్ని సముద్దరించి విశ్వవ్యాపితం అవతరించిన పదకొండవ అవతారం! అన్నాడు భాస్కర్ తన్మయత్వంతో.
”అదేంటి బా! పదకొండవ అవతారం కల్కి అవతారమని, భాగవతంలో చదివాను వీరభోగ వసంత రాయలుగా మళ్లీ అవ తరిస్తానని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు గుర్తు కానీ మోడీ అవతారం ఉంటుందని ఏ పురాణంలో లేదు కదా!” అన్నాడు కిరణ్.
”అవన్నీ కాంగ్రెస్ వాళ్లు రాసిన తప్పుడు రాతలు! అందుకే పురాణాలన్నీ వాస్తవాలతో తిరగ రాయిస్తున్నాం! మోడీని పద కొండవ అవతారంగా మేమెప్పుడో గుర్తించాం! ఇప్పుటికీ వా ట్సాప్ సిలబస్‌లో ఇదంతా సంక్షిప్తం చేశాం! దేశం కూడా ఇప్పు డిప్పుడే మోడీ అవతార రహస్యాన్ని కనుగొంటోంది! జనవరి 22 న రామ్‌లల్లా కళ్లను మోడీనే స్వయంగా తెరిపిస్తారు! ఇంకో విష యం ఏమిటంటే మోడీ ఆంజనేయుడి అవతారం కూడా! త్రేతా యుగంలో ఆంజనేయుడిగా ఉండి రాముల వారికి గుడి కట్టించ లేదని బాధ ఆయనకు తీవ్రంగా ఉండింది! అందుకే ఆ కోరికను తీర్చుకునేందుకే మోడీ అవతారం ఎత్తి, రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేస్తున్నారు.! అందుకే విధి స్వయంగా ఈ పుణ్య కార్యానికి మోడీని ఎంచుకున్నదని అద్వానీ చెప్పారు. మోడీ గుండె ల నిండా రాముడే ఉన్నాడు!” పారవశ్యంతో చెప్పాడు భాస్కర్.
అనుమానంగా చూశారు! కిరణ్, లక్ష్మి.
”హ్హు! మీకిప్పుడూ రుజువులు కావాలి. అంతే కదా! మోడీ గుండెల్లో రాముడున్నాడని నిరూపిస్తాను!” అన్నాడు ఆవేశంగా భాస్కర్.
”కొంపదీసి మోడీ గుండెలు చీల్చుతావా ఏంది బా?’ భయంగా అన్నాడు కిరణ్.
”అవసరం లేదు! కంటెంట్ ఉంటే కటౌట్ గుండెల్లో కూడా రాముడు కనబడుతాడు చూడండి!” అంటూ భాస్కర్ గోడకు ఉన్న మోడీ ఫొటో తీసుకొచ్చాడు!
”మీ అనుమానం పటాపంచలవుతుంది చూడండి!” అంటూ ఫొటోలోని మోడీ గుండెను చీల్చాడు భాస్కర్.
అంతే అక్కడున్న వారి కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా దేదీప్యమానమైన కాంతి ప్రసరించింది! మోడీ గుండెల్లో ఒక ఆకారం మెల్లిగా రూపుదిద్దుకుంటున్నది. క్రమంగా ఆ ఆకారం దృగ్గోచరమైంది! ఆ ఆకారం సింహసన రూపం దాల్చింది! అది ప్రధానమంత్రి ఆసనం! మెల్లిగా ఆ ఆసన రూపం కూడా చిన్నదై పోసాగింది! క్రమంగా పూర్ణ దృశ్యం ఆవిష్కృతమైంది ఆ ఆసనం వెనక ఆదానీ నిలబడి ఉన్నాడు”!
అది చూసి కిరణ్, లక్ష్మి కళ్లు తిరిగి పడిపోయారు.
– ఉషాకిరణ్