రుణమాఫీ ఏ’మాయే’?

తెలంగాణ సర్కార్‌ అమలు చేసిన రుణమాఫీ రాజుగారి కొత్తబట్టలు కథను గుర్తుకు తెస్తున్నది.అంతా ఓకే…అంతా అయిపోయింది అంటే.. అవుననే భజనపరులున్నంతకాలం రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ‘మోసేవాడికే తెలుస్తుంది..కావడి బరువ న్నట్టు’ ఏదైనా మన దగ్గరికొచ్చేసరికి అసలు విషయం బోధపడుతుంది. సరైన అంచనా, అవగాహన లేకుండా ఇష్టారీతిన హమీలిస్తే ఇలాగే ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కార్‌ చర్యలు మరోసారి రుజువు చేస్తున్నాయి. అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే రూ.రెండు లక్షల రుణమాఫీని ఏక కాలంలో చేస్తామని ఎన్నికలముందు ప్రకటించిన కాంగ్రెస్‌ ఎనిమిది నెలల తర్వాత మూడు దఫాల్లో తూతూ మం త్రంగా మమా అనిపించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న 42లక్షల మందికి మాఫీ చేయాలంటే రూ.31 వేల కోట్లు ఖర్చవుతాయని అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌ ప్రభుత్వం ప్రకటించింది. తీరా అమలుకొచ్చేసరికి రూ.28వేల కోట్లకు కుదించింది. ఆచరలో ఆ మొత్తాన్ని రూ.18వేల కోట్ల తగ్గించింది. ఫలితంగా రాష్ట్రంలో 12 లక్షల మంది అర్హులైన వారికి రుణమాఫీ కాని పరిస్థితి నెలకొంది. రైతు భరోసా కింద రెండుసార్లు రైతులకివ్వాల్సిన రూ.15 వేల కోట్ల నిధులకు మరో మూడు వేల కోట్లు కలిపి రుణమాఫీ చేసిందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రైతులతో కలిసి ఆందోళబాట పట్టాయి.ఈ నేపథ్యంలో సమస్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రారంభించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు పథకాల అమలు తీరును కాంగ్రెస్‌ రూ.2లక్షల రుణమాఫీ మరిపిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా గ్రహం, ఆందోళన వస్తున్నదనే సందర్భంలో గతసర్కార్‌ భావోద్వేగాలను రెచ్చగొట్టి వాటిని అణగదొక్కే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే బాటలో పయనిస్తే తగిన మూల్యం తప్పకపోవచ్చు!
– ఊరగొండ మల్లేశం