విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ‘చంద్రబాబు-పవన్’ కూటమి ప్రభుత్వ వైఖరి రోజుకొక విధంగా మారుతున్నది. ప్రయివేటీకరణ ఉపసంహరించుకు న్నారన్నారు. సొంత గనుల కేటాయిస్తున్నారన్నారు. సెయిల్‌లో విలీనం కోసం కేంద్ర బీజేపీపై ఒత్తిడి చేయడం మానేసి ఆర్థిక ప్యాకేజీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కార్మికులు పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతున్నది. రెండోవైపు కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ విధానం నుండి వెనక్కి తగ్గకపోగా కార్మికులపై దాడి ఎక్కుపెట్టింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘చంద్రబాబు-పవన్’ ద్వయం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోను ప్రయివేటీకరణ కానివ్వమని, మా కూటమిని గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌కు సొంత ముడి ఇనుప గనులు కేటాయి స్తామని లేదా సెయిల్‌లో విలీనం చేస్తామని చెప్పారు. కూటమి అధి కారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటింది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు మార్లు కేంద్ర స్టీల్‌మంత్రి, ఆర్థికమంత్రి, ప్రధానమంత్రితో చర్చలు జరిపారు. అయినా ఇప్పటివరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్లాంట్ ప్ర్రయివేటీకరణను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి కూడా దీనిపై ఒత్తిడి చేయటం లేదు. తాజాగా ఆర్థిక ప్యాకేజీని ముం దుకు తీసుకొస్తున్నారు. ప్లాంట్ పూర్తి స్థాయిలో నడవాలంటే తప్పని సరిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సిందే. అప్పుల భారం తగ్గించాల్సిందే. కానీ ప్రయివేటీకరణ ఉపసంహరిస్తున్నాం అనే ప్రకటన చేయకుండా ఆర్థిక ప్యాకేజీనే ముందుకు తీసుకురావటం వల్ల ప్లాంట్ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించదు. ప్లాంట్‌కి వచ్చిన సమ స్యలన్నీ ప్రయివేటీకరణ నిర్ణయం వల్లే. ప్రయివేటీకరణ ఉప సంహరిస్తేనే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకు తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకుండా దాచిపెడుతున్నది.
ఇటీవల చంద్రబాబు స్టీల్‌ప్లాంట్‌పై మాట్లాడిన మాటలు బీజేపీ వాదనలను మరింత బలపర్చేవిగా ఉన్నాయి. గత మూడేళ్ల నుండి బీజేపీ విశాఖ స్టీట్‌ప్లాంట్‌పై అనేక విధాలుగా దుష్ప్రచారం చేస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు స్టీల్‌ప్లాంట్‌పై వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న వాదనలు ఇలాంటివే. ప్రయివేటు స్టీల్‌ప్లాంట్లకి లాభాలు వస్తుండగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు నష్టాలు వస్తున్నాయి? అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? గతంలో ప్లాంట్ బిఐఎఫ్‌ఆర్‌కి వెళ్లినప్పుడు ఆర్థిక సహాయం అందించాం! మళ్లీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది? ఎంతకాలం ఇలా ఇస్తాం? ప్రతిసారీ సెంటిమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు. సెంటిమెంటు ఎంతోకాలం పని చేయదు. ప్లాంట్ సొంత కాళ్లపై నిలబడాలి..అని చంద్రబాబు మాట్లాడారు. ఇవన్నీ ఆయనకు తెలియనివి కావు. ఎందుకు మళ్లీ వీటిని తెరపైకి తెస్తున్నారు? ఎన్నికలకు ముందు ఈ వాదనలు ఎందుకు చేయలేదు? అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పల్లవి ఎందుకెత్తుకున్నారు? వీటిని కావాలనే పథకం ప్రకారం ముఖ్యమంత్రి ముందుకు తీసుకొస్తున్నారు. బీజేపీ కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో కూరుకు పోయిందని, ఇది నష్టాల కంపెనీ అని, దీన్ని ఎంత మాత్రం ప్రభుత్వరంగంలో ఉంచకూడదని ప్రచారం చేసింది. మొత్తంగా ఇది నష్టాల పరిశ్రమ అనే భావన కల్పించాలనే లక్ష్యంతో తెలుగుదేశం కూటమి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కలిసి ఈ వాదనలను ముందుకు తీసుకొస్తున్నాయి.
కేంద్ర, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తెస్తున్న వాదనలన్నీ పూర్తిగా దురుద్దేశంతో కూడుకున్నవి. వాస్తవంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాల పరిశ్రమ కాదు. ఇప్పటి వరకు మొత్తం రూ.12,900 కోట్ల లాభాలు పొందింది. 2018-19లో కూడా లాభాలు పొందింది. 2021-22లో అయితే అత్యధిక టర్నోవర్‌తో లాభాలు గడించి రికార్డు సృష్టించింది. ఇదే ఏడాది విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతున్నట్లు బీజేపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక్కడినుండి ప్లాంట్‌ను దెబ్బతీసే కుట్రలు ప్రారంభమయ్యాయి. 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగం లోకి రానివ్వకుండా ఉత్పత్తి పెరుగుదలను అడ్డుకుంది. ఉత్పత్తికి కీలకమైన 3వ బ్లాస్ట్ ఫర్నేస్‌ను అర్ధాంతరంగా మూసేసింది. ముడిసరుకు, వర్కింగ్ క్యాపిటల్ సమస్యని సృష్టించి మరో బ్లాస్ట్ ఫర్నేస్‌ను కూడా మూసేసి ప్లాంట్‌ని నష్టాల్లోకి నెట్టింది.
అప్పులు ఎందుకు పెరిగాయి? సొంత లాభాల రిజర్వు నిధులతో పాటు బ్యాంకుల నుండి మరో రూ.12 వేల కోట్లు అప్పులు తీసుకొని ప్లాంట్‌ని 34 లక్షల టన్నుల నుండి 73 లక్షల టన్నుల సామర్థ్యానికి విస్తరించింది. ఈ విస్తరణ వల్ల అదనంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రయివేటీకరణ వైఖరి వల్ల పూర్తి సామర్ధ్యం వినియోగంలోకి రాలేదు. ఫలితంగా అప్పులు పెరిగాయి.
మరో ముఖ్యమైనది స్టీల్‌ప్లాంట్‌కి సొంత ముడి ఇసుప గనులు లేవు. దేశంలో అన్ని ప్రయివేటు, ప్రభుత్వ పరిశ్రమలకు సొంత ముడి ఇనుప గనులు కేటాయించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించిన తరువాత దేశంలో జరిగిన ప్రయివేటు స్టీల్‌ప్లాంట్లకు కూడా ఇనుప గనులు కేటాయించారు. విశాఖ స్టీల్‌ప్లాంటుకు మాత్రం ముడి ఇనుప గనులు, బొగ్గు గనులు కేటాయించకుండా వివక్షత చూపుతూ వస్తున్నారు. ఫలితంగా స్టీల్‌ప్లాంట్‌పై ఏడాదికి కనీసం రూ.3 వేల కోట్ల అదనపు భారం ముడి ఇనుప గనుల వ్యయం మీదే పడుతున్నది. ప్రతిటన్ను ముడి ఇనుముపై రూ.5వేల నుండి 8 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగి స్టీల్‌ప్లాంట్ నష్టాలు చవిచూస్తున్నది. ఈ కఠోర వాస్తవాలన్ని ‘తెలుగుదేశం-జనసేన’ కూటమి ప్రభుత్వ కండ్లముందు కనిపిస్తున్నవే. కాని కార్మికులు ఎక్కువమంది ఉన్నారని, పని చేయడం లేదని, అందువల్లే నష్టాలు వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
2000 సంవత్సరంలో ప్లాంట్‌కి కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ కింద సహాయం అందించింది. ఏదో దయాదాక్షిణ్యంగా ఇస్తున్నట్లు వీరి ప్రచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2937 కోట్ల సొమ్మును తిరిగి చెల్లించటంతోపాటు ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నులు, డివిడెండ్ల ద్వారా రూ.58 వేల కోట్లు తిరిగి చెల్లించిన వాస్తవాలను కప్పిపుచ్చి ప్లాంట్‌పై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఇది ప్రభుత్వ కంపెనీ అని, దీనివల్ల ప్రాంతీయ అభివృద్ధి జరుగుతున్నదని, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నదనే, ఒక మహా నగరానికి ఆర్థిక జీవనాడిగా ఉందనే వాస్తవాలని ప్రజల నుండి తొల గించటానికి ఈ ప్రచారాన్ని ముందుకు తెస్తున్నారు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్ విలువ రూ. 3 లక్షల కోట్లు పైనే ఉంది. మరో కోటి 20 లక్షల టన్నుల సామర్థ్య విస్తరణకు, 50 వేల మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలున్నాయి. దేశంలో సముద్ర తీరం, పోర్టు కనెక్టి విటి ఉన్న ఏకైక స్టీల్‌ప్లాంట్ కూడా ఇదొక్కటే. ఇటువంటి శక్తివంతమైన ప్రజాభివృద్ధి స్టీల్‌ప్లాంట్‌ని ధ్వంసం చేయటం దేశద్రోహమే అవుతుంది.
ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేయటమే శాశ్వత పరిష్కారం. ఇది అందరి డిమాండ్. ‘చంద్రబాబు-పవన్’లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే చెబుతూ వచ్చింది కూడా ఇదే. ఎందుకు సెయిల్‌లో విలీనం చేయాలి? స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ. ఈ సంస్థ కింద భారతదేశంలో ప్రభుత్వ స్టీల్ కంపెనీలైన భిలాయి, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా, ఇస్కో తదితర అన్ని సెయిల్ కిందే ఉన్నాయి. ఒక్క వైజాగ్ స్టీల్‌ప్లాంట్ మాత్రమే సెయిల్ బయట ఉంది. ప్రారం భంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ కూడా సెయిల్‌లోనే ఉన్నా 1982లో దీనిని సెయిల్ నుండి విడదీశారు. ఆ సందర్భంగా బైలదిల్లాలోని 4, 5 బ్లాక్‌ల ఇనుప గనులు ఇస్తామని, ముడి ఇనుప ఖనిజం నిరంతరాయంగా సరఫరా చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సెయిల్‌లో ఉద్యోగులకు ఉన్న సదుపాయాలన్ని విశాఖ స్టీల్‌లో కూడా అమలు చేస్తామనే భరోసా కూడా ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీ ప్రకారం సొంత ముడి ఇనుప గనులు కేటాయించలేదు. ఈ పరిస్ధితుల్లో తిరిగి సెయిల్‌లో విలీనం చేయటమే సరైన పరిష్కారం. సెయిల్ దగ్గర పెద్ద ఎత్తున ముడి ఇనుప గనులు ఉన్నాయి. దీంతో స్టీల్‌ప్లాంట్‌కి ముడి ఇనుప గనుల సమస్య పరిష్కారం అవుతుంది.
కేంద్ర స్టీల్ సహాయ మంత్రి, ఏపీ బీజేపీకి చెందిన శ్రీనివాసవర్మ కొత్త పల్లవి అందుకున్నారు. సెయిల్‌లో విలీనం చేయటానికి టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, 35 శాతం వాటాలు అమ్మబడ్డాయని అంటున్నారు. అంటే సెయిల్‌లో విలీనానికి బీజేపీ అంగీకరించటం లేదని తేలిపోతున్నది. అందు వల్లే చంద్రబాటు సెయిల్‌లో విలీనంపై ఒత్తిడి చేయటం లేదని అనుకోవాల్సి వస్తున్నది.ఎన్డీయే సర్కార్ నిలబడి ఉండటానికి ప్రధాన ఊతకర్ర చంద్రబాబే. కార్మికులపై పెద్దఎత్తున దాడి జరుగుతున్నా చప్పుడు చేయడం లేదంటే మోడీసర్కార్‌కు వంతపాడుతున్నట్టేగా.
ప్లాంట్ రక్షణ, ప్యాకేజీ చర్చల పేర చంద్రబాబు-పవన్ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఈ వ్యూహంలో ప్రయివేటీకరణ ఉపసంహరణ, సొంత గనుల కేటాయింపు, సెయిల్‌లో విలీనం, అప్పులపై మారటోరియం, నిర్వాసితులకు ఉపాధి, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు రక్షణ వంటి కీలకమైన చర్యలు మసకబారిపోతున్నాయి. ఈ వ్యూహం విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి తీవ్ర నష్టం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీపై ఒత్తిడి పెంచి తక్షణం ప్రయివేటీకరణను ఉప సంహరిస్తూ, ప్లాంట్‌ని సెయిల్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయించాలి. లేకుంటే నాటి ఉమ్మడి రాష్ట్రంలో ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అని నినదించింది. జైళ్ల పాలైన యువత తాగ్యాలు వృథా అవుతాయి.
బి.గంగారావు
9490098792