నూతన పార్లమెంట్‌లో ‘నారీశక్తి’ ఏది?

నూతన పార్లమెంట్‌లో 'నారీశక్తి' ఏది?మహిళలను జాతి నిర్మాణ ప్రదాతలుగా మలచడానికి, నారీ శక్తిని గౌరవించడానికి ప్రధాని మోడీ పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును 2023లో ఆమోదించారని గతేడాది సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోయే ప్రచారం జరిగింది. పార్లమెంట్‌ ఆమోదించిన మహిళా చట్టం ప్రకారం పార్లమెంటు, శాసనసభ ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2026లో జాతీయ జనాభా గణన పూర్తయి, ఆ పిమ్మట పార్లమెంటు స్థానాల పునర్వ్యవస్థీకరణ(డి- లిమిటేషన్‌) పూర్తయిన పిదప అమలులోకి వస్తుంది.అంటే 2029లో మాత్రమే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.ఏదైనా కారణాల వల్ల ఈ డెడ్‌లైన్‌ మిస్‌ అయితే 2034లో జరగబోయే ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి లేదని మనం అర్ధం చేసుకోవాలి.
ఇటీవల జరిగిన 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎప్పటివలే మహిళా సభ్యుల ప్రాతినిధ్యం తీసికట్టుగానే ఉంది. దేశవ్యాప్తంగా 74 మంది మహిళలు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు.ఇది మొత్తం పార్లమెంట్‌ సభ్యుల్లో 13.6శాతం మాత్రమే.2019లో 78 మంది మహిళా పార్లమెంట్‌ సభ్యులు ఎన్నికయ్యారు. ఇది 14.4శాతంగా ఉంది.గత ఎన్నికల్లో 726 మంది మహిళలు పోటీ చేయగా,2024 ఎన్నికల్లో పోటీ చేసేవారి సంఖ్య 797కి పెరిగింది.అయినా ఎన్నిక అయిన మహిళా పార్లమెంట్‌ సభ్యుల సంఖ్య తగ్గడం గమనార్హం.ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విషయం మనకు తెలిసిందే.రాష్ట్రాలలో శాసనసభలకు జరిగే ఎన్నికల సందర్భంగా,మహిళలకు ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలను కూడా రాజకీయ పార్టీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈసారి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లాగే, పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో ప్రత్యేక పథకాలను పొందుపరిచాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా ఎన్నికల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు మహిళలే కేంద్ర బిందువు అన్నట్టుగా అనేక పథకాలు తీసుకువచ్చాయి.వీటన్నింటి ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని, ఓట్లు వేయడానికి మహిళా ఓటర్లు పోటెత్తుతారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఎండతీవ్రతతో పాటు ఓటింగ్‌ పట్ల నిరాసక్తతతో ఓటింగ్‌ శాతం తగ్గింది.
2019లో దేశవ్యాప్తంగా 67.01శాతం పురుష ఓటర్లు ఓట్లేయగా,67.18 శాతం మహిళా ఓటర్లు ఓట్లేశారు.ఈ ఎన్నికల్లో 65.8శాతం పురుష ఓటర్లు ఓట్లేస్తే,65.78శాతం మాత్రమే మహిళా ఓటింగ్‌ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో 31 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓట్లేసినప్పటికీ ,గతంతో పోలిస్తే దాదాపు రెండు శాతం మహిళా ఓటింగ్‌ తక్కువ నమోదవడం గమనార్హం. అస్సాం , ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల లో మాత్రం 80శాతం పైబడి మహిళా ఓటింగ్‌ నమోదైంది.2019లో పార్లమెంట్‌ ఎన్నికలకు పోటీపడిన మహిళల్లో 9.4శాతం గెలిస్తే, ఈసారి 9.6శాతం మంది మాత్రమే గెలిచారు.పశ్చిమ బెంగాల్‌ నుంచి అత్యధికంగా 11 మంది మహిళలు పార్లమెంటకు ఎన్నికవడం విశేషం. 2023లో ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి.ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌(ఐపియు) సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా 27.6శాతం మహిళలు పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు.ఈ విషయంలో 185 ప్రపంచ దేశాల్లో భారత్‌ స్థానం 143 గా ఉంది. ఇది ఈ ఏడాది ఎన్నికలు జరగడానికి ముందు మన దేశ పరిస్థితి. ఈ ఎన్నికల తర్వాత, మన దేశ స్థానం ఇంకా దిగజారే ప్రమాదం లేకపోలేదు. ఫిన్లాండ్‌, నార్వే, ఐస్‌లాండ్‌, న్యూజిలాండ్‌, స్వీడన్‌ దేశాలు ఎప్పుడో మహిళా సమానత్వాన్ని సాధించాయి. అక్కడి ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు మహిళలే. ఫలితంగా ఎలాంటి పథకాలైనా నూటికి నూరుశాతం విజయవంతమవుతుంటాయి.
మన దేశం పార్లమెంట్‌లో మహిళల భాగస్వామ్యం అంతంత మాత్రంగా ఉంటే, అనేక దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయి.ఈ మధ్యే మెక్సికోలో క్లాడియో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన ఇద్దరు అభ్యర్థులు మహిళలు కావడం విశేషం. ఇదేదో ఒక రోజులో జరిగింది కాదు. మెక్సికో కూడా లిబరల్‌ దేశమేమీ కాదు.అక్కడ కూడా చాందసవాద శక్తులు,గుత్త పెట్టుబడిదారీ శక్తులు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని అడ్డుకుంటూనే ఉన్నాయి. అయితే,ఈ శక్తులపై పురోగామి శక్తులు,ఫెమినిస్టులు దశాబ్దాలుగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు.దాని ఫలితమే ప్రస్తుతం మెక్సికోలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి
మన దేశంలో పార్లమెంటరీ రంగంలోనే కాదు నిర్ణయాత్మక రంగాలలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువుగా ఉండడం వల్లనే,దేశం అనుకున్న రీతిలో అభివృద్ధి చెందడానికి అవరోధంగా ఉంది.1947లో దేశ మొత్తం అక్షరాస్యత కేవలం 12శాతం ఉండగా నాడు మహిళల్లో అక్షరాస్యులు 6శాతం మాత్రమే. ప్రస్తుతం మొత్తం అక్షరాస్యత 77.7శాతం ఉండగా మహిళలది 70.3శాతంగా నమోదైంది. పురుషులతో పోలిస్తే మహిళల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.1957లో కేరళ లో నంబూద్రి నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేసింది.1977లో పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం కూడా భారీగా భూ సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చింది. మిగులు భూమిని పేద ప్రజలకు ఇవ్వబడింది.తినడానికి ఆహారం,చదువుకోవడానికి విద్య ప్రజలకు లభించింది.అందుకే మానవాభివృద్ధిలో మొదటి స్థానం కేరళ రాష్ట్రానిది. 100శాతం అక్షరాస్యత సాధించబడింది.ఈ నిర్ణయాల వల్ల కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో మహిళల స్థితిగతులు గణనీయంగా పెరిగాయి.
1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు అన్ని స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 2002లో పట్టణ స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగాన్ని మరోసారి సవరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో పంచాయతీల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఫలితంగా వారి ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లోనూ మహిళలు సమర్థంగా తమ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. పారిశ్రామిక, ఐటీ, సాంకేతిక, బ్యాంకింగ్‌ రంగాల్లో ముందంజ వేస్తున్నారు. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగంలో సమాన అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు. కార్యాలయంలో నూతనత్వం, సామర్థ్యం, సమానత్వాన్ని తీసుకురావడానికి సంస్థలు ఎక్కువగా మహిళలను నియమించుకోవాలని చూస్తున్నాయి. ఐటీ తర్వాత బ్యాంకింగ్‌, అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగాల్లో అతివలకు అత్యధిక అవకాశాలు లభిస్తున్నాయి. దేశాభివృద్ధికి మహిళలు చేస్తున్న సేవ ఏ జీడీపీ లెక్కలతోనూ కొలవలేనిది. చంద్రయాన్‌3 అద్భుత విజయంలో మహిళా సైంటిస్టుల పాత్ర తిరుగులేనిది. అయితే, అన్ని రంగాలలో మన దేశంలో మహి ళలు తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ అనుకున్న స్థాయిలో వారి పురోగతి మాత్రం ముందుకు సాగడం లేదు.
చదువు, అవకాశాల్లో ఆడపిల్లలపై వివక్ష, భ్రూణ హత్యలు, అత్యాచారాలు దేశంలో ఏదోమూలన నిత్యం జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా పోరాటం తప్పడం లేదు.మహిళలపై, బాలికలపై జరుగుతున్న హింస ఆకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. అసంఘటిత రంగాలలో మహిళలు వారి కనీస సదుపాయాల కోసం నిత్యం పోరాటం చేయాల్సి వస్తుంది. భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లపై కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. మణిపూర్‌లో కుకీ ప్రజలపై జరిగిన దాడులు, మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు హెచ్చరిక చేసేవరకు కూడా కేంద్రం పట్టించుకోలేదు. మహిళా ముఖ్యమంత్రులు ఉన్న చోట్ల కూడా మహిళలు, చిన్నారులపై దాడులు యథేచ్ఛగా ఎందుకు కొనసాగుతున్నాయి?మన దేశంలో పురుషాధిక్య ధోరణి,లైంగిక అణచివేత పోవాలంటే చట్టసభల్లో కేవలం మహిళల ప్రాతినిధ్యం పెరిగితే మాత్రమే సరిపోదు, రాజకీయాల తీరుతెన్నులు కూడా మారాల్సివుంది.
18వ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యులలో 93శాతం మంది కోటీశ్వరులని, అనేకమంది ఎంపీలకి నేర చరిత్ర ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ తెలియచేస్తోంది.ధనమయ, నేరమయ రాజకీయాలు రూపుమాపకుండా పురోగామి, మహిళాభ్యుదయ రాజకీయాలు సాధ్యమా అనేదే ప్రశ్న? బాధాకరమైన విషయం ఏమిటంటే మహిళాభ్యుదయంలో ముందంజలో ఉన్న కేరళ రాష్ట్రం నుంచి ఒక్క మహిళా పార్లమెంట్‌ సభ్యులు కూడా ఎన్నిక కాలేదు. కనుక,పార్లమెంట్‌లో,చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే మహిళా చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి. ప్రజల సర్వతోముఖావృద్ధి లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలతో ముందుకొచ్చే వామపక్ష, అభ్యుదయ శక్తులను ప్రజలు ఆదరించాలి. మతవాద, చాందసవాద రాజకీయ శక్తులను ఓడించాలి. అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడే, ప్రత్యామ్నాయ శక్తుల రాజకీయ ప్రాబల్యం పెరిగినప్పుడే నిజమైన మహిళాభ్యున్నతి, మహిళా సాధికారత సాధ్యం.
పి.సతీష్‌
9441797900