ఆవుపేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన!

Not cow dung, what is needed is the research of semi-conductors!– ప్రధాని నరేంద్ర మోడీ గారికి,

అయ్యా! ప్రతి నెలా మీ మన్‌ కీ బాత్‌ అంశాలను చదివే వారిలో నేనూ ఒకరిని. ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్నింటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. జులై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మామందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమీకండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, దేశం వెనుకబడి ఉండ టానికి, మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవ టానికి నెహ్రూనే కారణం అని బీజేపీ, దాని మాతృసంస్థ సంఘ పరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమీ కండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా?
నరేంద్ర మోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజానిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించ లేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా? దానికి అవసరమైన పరిశోధన, అభివద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమీకండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సీఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రయివేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము. లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ధి ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19 శాతం పెంచుతూ 2012 నాటికి జిడిపిలో 1.97 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు. అప్పటికి మన దేశ ఖర్చు 0.9 శాతం మాత్రమే ఉంది. ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మన దేశ తాజా ఖర్చు 0.7 శాతమే అని చైనా 2.1 శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పేయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?
కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమీకండక్టర్ల వంటి ప్రాధాన్య రంగాల మీద లేదు. ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తు న్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వ తీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్ర దండమేదైనా ఉంటే హాంఫట్‌ అంటూ తిప్పండి. ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749, అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మన దేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.
గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రూ.1.97 లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచ రణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పథకం, వదితే దొరకదని పోలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.
రెండు దిగ్గజ దేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మన దేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేక పోయాము. ఆలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా (2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫ్యాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70 శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తు న్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70 శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.
గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.50,68,235 కోట్లు. కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రూ.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు. కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి రూ.118,78,431 కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1 శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశో ధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
-సత్య (తోటి భారతీయుడు)