– నియోజకవర్గ సమస్యల కోసమైతే.. పార్టీ పెద్దలకు తెల్సా
– పార్టీ మారట్లేదని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు
– మెదక్ టికెట్‌పై కవిత పట్టు..అందుకే ఈ హైడ్రామానా..?
– వివాదమైన..ఆ నలుగురి తీరు
బీఆర్‌ఎస్‌కు చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరు పార్టీలో పెద్ద వివాదానాకి దారి తీసింది. పార్టీ పెద్దలకు చెప్పకుండానే ఆ నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెల్పడం వెనకాల మతలబేంటీ అనే చర్చ మొదలైంది. తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కోసమే మర్యాద పూర్వకంగా సీఎంను కలిశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎంత నోరు చించుకుని చెప్పినా పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఆపలేకపోతున్నారు. తామంతా కేసీఆర్ వెంటనే ఉంటామని స్పష్టం చేసినప్పటికీ తలెత్తిన అనుమానాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. పార్టీలో ఇంత గందరగోళ పరిస్థితి రావడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరే కారణమా..? లేక వాళ్ల వెనక ఎవరైనా ఉండి నడిపించిన హైడ్రామానా..? మెదక్ ఎంపీ టికెట్ పంచాయితీనే ఈ పరిణామాలకు దారి తీసిందా..? అసలు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుంది..!
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌కు చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరు పార్టీలో పెద్ద వివాదానాకి దారి తీసింది. పార్టీ పెద్దలకు చెప్పకుండానే ఆ నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెల్పడం వెనకాల మతలబేంటీ అనే చర్చ మొదలైంది. తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కోసమే మర్యాద పూర్వకంగా సీఎంను కలిశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎంత నోరు చించుకుని చెప్పినా పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఆపలేకపోతున్నారు. తామంతా కేసీఆర్ వెంటనే ఉంటామని స్పష్టం చేసినప్పటికీ తలెత్తిన అనుమానాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. పార్టీలో ఇంత గందరగోళ పరిస్థితి రావడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరే కారణమా..? లేక వాళ్ల వెనక ఎవరైనా ఉండి నడిపించిన హైడ్రామానా..? మెదక్ ఎంపీ టికెట్ పంచాయితీనే ఈ పరిణామాలకు దారి తీసిందా..? అసలు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుంది..!
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్ తన పట్టు నిలుపుకుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ముందుంది. ప్రజాప్రతినిధులు, పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్యరావు, చింత ప్రభాకర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. మిగతా మూడు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు కొద్ది తేడాతోనే ఓటమి పాలయ్యారు. అధికారం పోయినా ఎమ్యెల్యేల సంఖ్యా బలముందిలే అని ధీమాగా ఉన్న గులాబీ శ్రేణుల్ని గెలిచిన ఆ నలుగురు ఎమ్మెల్యే తీరు గందరగోళానికి గురి చేస్తోంది. ఓటమి నుంచి కోలుకోకముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుండటంతో గులాబీ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీ నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశాలు ఇటీవలే ముగిశాయి. పార్టీ ఓటమిపై సమీక్షించడమే కాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దం కావాలని కేటీఆర్.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంతలోనే కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతారా.. అనే అనుమానాలకు తావిచ్చింది. ఇది యాదృచ్చికమా.. లేక మరో రకమైన ఏజెండా ఏదైనా ఉందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ ఎంపీ టికెట్ విషయంలో కల్వకుంట్ల కుటుంబంలో ఏకాభిప్రాయం కుదరని కారణంగానే ఈ వ్యవహారాలు చోటు చేసుకొని ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వివాదమైన ఆ నలుగురి తీరు
కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని, కల్వకుంట్ల కుటుంబ సభ్యులంతా జైళ్లకు పోతారంటూ కాంగ్రెస్ మంత్రులు రోజూ ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి సంకట పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్యరావు సీఎం రేవంత్‌రెడ్డిని ఎలా కలుస్తారనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. పార్టీ పెద్ద కేసీఆర్ పట్ల అంత విశ్వాసం, నమ్మకం ఉన్న ఎమ్మెల్యేలైతే మాట వరసకైనా పెద్దాయన కు చెప్పి రేవంత్‌ను కలిశారా..? పార్టీలో మరో పెద్దాయన అనుమతితోనే సీఎంను కలిశారా..? లాంటి అనుమానాలతో పాటు పార్టీ మారుతు న్నారనే ప్రచారమూ సాగింది. సోషల్‌మీడి యాలోనే కాదు బీఆర్‌ఎస్ శ్రేణుల్లోనూ ఈ రకమైన అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమైన ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీకి చెందిన సీఎంను కలవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయం టూ పార్టీ అధినేత కేసీఆర్ వారిని కోప్పడినట్టు చెబుతున్నారు. దాంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి.. తాము మర్యాదపూర్వ కంగానే సీఎంను కలిశామని, మరో ఉద్దేశమేమీ లేదంటూ చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ ఉన్నంత వరకు తాము కేసీఆర్ వెంటే నడుస్తామని ప్రకటించారు. సీఎంను కలవడం తప్పేమీ కాదని, సీఎం కూడా ప్రధానిని కలిశారని, మేమూ అలాగే నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం కలిశామని వివరణ ఇచ్చుకుంటున్నారు.
అసలు పంచాయితీ మెదక్ టికెట్..?
బీఆర్‌ఎస్‌లో గుమ్మనంగా జరుగుతున్న అసలు పంచాయితీ మెదక్ టికెట్ కోసమేనని తెలుస్తోంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరు చోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలున్నారు. మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు. ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే బీఆర్‌ఎస్‌కు 2 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అంటే బీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఉంది. దాంతో మెదక్ ఎంపీ టికెట్ కోసం ఆ పార్టీలో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే చాలా మంది టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వంటేరు ప్రతాపరెడ్డి, గాలి అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డితో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఆర్. సత్యనారాయణ, బీరయ్య యాదవ్ ఎంపీ టికెట్ కోరుతున్నారు. వీరందరి పేర్లను పక్కన పెట్టి ఎమ్మెల్సీ కవిత మెదక్ టికెట్ కావాలని పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. కవితకు టికెట్ ఇవ్వడమనేది జిల్లాలోని ఒక ముఖ్యనేత ఇష్టపడట్లేదనే చర్చనడుస్తోంది. అందుకే పార్టీలో ఓ హైడ్రామా నడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నేత అండతోనే వారు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఉంటారని బీఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినా మెదక్ ఎంపీ టికెట్ వివాదం ఇంతటితో చల్లారుతుందా..? లేక మరింత ముదిరి ఆ పార్టీలో పెను తుఫాన్‌కు దారి తీస్తుందా చూడాలి.