ఓ సినిమాని ఆసాంతం కూర్చుని చూసేలా అన్ని రకాల హంగులు ఉన్నప్పటికీ ఊహించినట్టే కథ సాగు తుంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టే.. ఊహించినట్టు కాకపోయినా కనీసం అక్కడక్కడ సర్‌ప్రైజ్ చేసినా ప్రేక్షకుల ఆదరణ పొందొచ్చు. ఈ మ్యాజిక్ ‘డాకు మహారాజ్’లో మిస్ అయ్యింది. స్టయిలీష్ మేకింగ్‌తో తెరకెక్కినప్పటికీ రొటీన్ స్టోరీ టెల్లింగ్‌తో సో..సో.. యాక్షన్ డ్రామా సినిమాగా నిలిచింది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ కథలోను, సన్నివేశా ల్లోనూ కొత్త దనం కనిపించదు. పైగా ఎన్నో సినిమాల్లోని సన్నివేశాలు గుర్తొస్తుంటాయి. అయితే బోర్ కొట్టకుండా సినిమాని ఆ మాత్రం చూడగలిగామంటే బ్యాక్‌డ్రాప్, నేపథ్య సంగీతమే కారణం. ఇక బాలకృష్ణ సినిమా అంటే, యాక్షన్‌తోపాటు ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌ల్ని కచ్చితంగా ఆశిస్తారు. ఇవి ఇందులోనూ పుష్కలంగా ఉన్నాయి. నటన పరంగా, యాక్షన్ పరంగా, డైలాగ్స్‌పరంగా బాలకృష్ణ తన పంథాలోనే వెళ్ళారు. అంతేకాదు డాకు మహారాజ్ గెటప్‌లో ‘సర్దార్ పాపారాయుడు’లోని తన తండ్రి ఎన్టీఆర్‌ని తలపించారు కూడా. సీతారామ్‌గా, నానాజీగా, డాకుగా బాలయ్య నటన మనల్ని ఫిదా చేస్తుంది. ఇక బాలయ్య అభిమానులకైతే పండగే. అయితే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు సీరియస్ మోడ్‌లో వెళ్తూ ప్రేక్షకులకు రిలీఫ్‌నిచ్చే ఫన్ ఎలిమెంట్స్ లేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. సన్నివేశాల్లో ఫ్రెష్ నెస్ చూపించడంలో దర్శకుడు బాబీ విఫలమయ్యారు. అయితే స్టయిలీష్ మేకింగ్‌లో మాత్రం సక్సెస్ అయ్యారు. బాలకృష్ణ, శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యాజైశ్వాల్, బాబీ డియోల్ నటనతోపాటు విజరు కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం, అవినాష్ కొల్లా అర్ట్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, నిరంజన్ దేవరమానే, రూబెన్‌ల ఎడిటింగ్, వావ్ అనే నిర్మాణ విలువలు ఈ సినిమాకి బలాన్నివ్వగా, ఊహకు తగ్గట్టు సాగే కథా కథనాలు బలహీనతలుగా నిలిచాయి. మొత్తమ్మీద సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా అందరీ అంచనాలను అందుకోలేకపోయింది.
– రెడ్డి హనుమంతరావు