– రామగుండం నియోజకవర్గంలో కార్మికులే కీలకం
– అనుబంధ సంఘాలపైనా నాయకుల దృష్టి
– వారి ఓట్లు దండుకునేందుకు యత్నాలు
– గంప గుత్తగా పడితేనే విజయం..
– అమలుకాని పాలకపక్షం హామీలపై ప్రతిపక్షాల ఫోకస్
– 60వేల పైచిలుకు కార్మిక ఓట్లు
కార్మిక క్షేత్రంగా పేరున్న రామగుండం నియోజకవర్గం ఏ గట్టుకు చేరనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్మికుల మద్దతు కూడగట్టేలా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కార్మికులు, వారికి అనుబంధంగా ఉన్న ఇతర వ్యాపారులు, ఉద్యోగ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. కార్మికుల అభివృద్ధి, అందించిన లబ్దిపై అధికారపార్టీ ప్రచారం చేస్తుండగా.. అమలుకాని పాలకపక్షం హామీలపై ప్రతిపక్షాలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో కార్మికవర్గం ఏ గట్టున ఉంటుందో.. ఎవరి పక్షాన నిలుస్తుందోనన్న ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
నవతెలంగాణ – కోల్‌సిటీ
రామగుండం నియోజకవర్గ పరిధిలో సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ, కేశోరామ్ సిమెంట్, జెన్‌కో, ఆర్టీసీ, రైల్వే లాంటి ప్రతిష్టాత్మక సంస్థల కార్మికులున్నారు. ఇక్కడ ఓటర్లలో కార్మిక జనాభాయే సుమారు 60వేల పైచీలుకు వరకూ ఉంటుందని అంచనా. మొత్తం ఓటర్లు కనీసం లక్షా 80వేల పైచిలుకు ఉంటారు.
ఆయా కంపెనీల్లో పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికుల ఓట్లను గంపగుత్తగా దండుకుంటే తప్ప విజయం వరించదనే చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు కార్మిక సంఘాల నేతలతో మాట్లాడి ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ నాయకులు తమ అభ్యర్థి తరపున, ఐఎన్‌టీయూసీ నేతలు కాంగ్రెస్‌కు మద్దతుగా, బీఎంఎస్ నేతలు బీజేపీ పక్షాన నిలుస్తూ కార్మికవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసుకునే పనిలో బిజీ అయ్యారు.
రాజకీయ పార్టీల జోక్యం..
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించి వారి ఆధ్వర్యంలో సంస్థ అభివృద్ధి పనులు చేపడతారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సంస్థలో కాంట్రాక్టుల కేటాయింపు, బదిలీలు, నియామకాలు, కార్మికులకు అందించాల్సిన సౌకర్యాల లాంటి అంశాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది. ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాల మేరకే చాలా పనులు సాగుతున్నాయి. దీని కారణంగా పైరవీలు ఎక్కువయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో ఆర్‌ఎఫ్‌సీఎల్, కెశోరామ్, జెన్‌కో, ఎన్టీపీసీ, ఆర్టీసీ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కల్పిస్తున్న సౌకర్యాలపై బేరీజు వేసు కుంటున్నారు. హామీలు నెరవేరాయా లేదా అనే అంశాలను కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పరిశీలి స్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక క్షేత్రం ఈ ఎన్నికల ఫలితాల్లో కొంత ఆసక్తిగా మారడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
నిధులు తరలింపు..
గతంలో ఏ ప్రభుత్వం కూడా సింగరేణికి సంబంధించిన నిధులను ఇతర అభివృద్ధి పనులకు కేటాయించలేదు. తెలంగాణ ఏర్పాడ్డాక పరిస్థితి మారింది. సింగరేణి నిధులను ప్రభుత్వ అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించేలా పలు మార్పులు చేశారు. దానికి అనుగుణంగా పదేండ్లుగా ఒకే సీఎండీని కొనసాగిస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న అపవాదూ ఉంది. కార్మికుల వేతనాల పెంపు, అలవెన్సులు ఇతర విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రామగుండంలో మెడికల్ కాలేజీతోపాటు సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లాంటి నియోజకవర్గాలకు సైతం ఇక్కడి నిధులను తరలించారు. తమ నిధులను తరలించడంపై కార్మికలోకం తీవ్ర అసంతృప్తితో ఉంది.
ఇండ్ల పట్టాలు రాకపాయే..
సింగరేణి కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో కోల్‌మైన్స్ ఏర్పాటైన మొదట్లో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి సింగరేణి కార్మికులుగా స్థిరపడ్డారు. ఇక్కడి ప్రాంతమంతా 99ఏండ్ల పాటు సింగరేణి సంస్థ లీజులో తాత్కాలిక నివాసాలు మాత్రమే ఏర్పాటు చేసుకోగలిగారు. కాలక్రమంలో అనేక కార్మిక కాలనీలు వెలిశాయి. అయినా ఈ ఆస్తులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేక బ్యాంకులూ రుణాలు ఇవ్వడం లేదు. అయితే, అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే సీఎం కేసీఆర్ కార్మికుల ఇండ్లకు పక్కా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.. దశాబ్దకాలం కావస్తున్నా అమలుకు నోచలేదు.