గ్రూప్‌2 పరీక్షలు వాయిదా వేస్తే నష్టమేంటి?

What is the harm in postponing group 2 exams?గ్రూప్‌2, గ్రూప్‌3 పోస్టుల పెంపు, గ్రూప్‌2 పరీక్ష వాయిదా వేయడం గురించి అభ్యర్థులు ప్రభుత్వాన్ని అడుగుతున్నది న్యాయమైన, సామరస్యంగా పరిష్కరించ దగినదే. గ్రూప్‌ 2 పోస్టులు పెంచి, పరీక్షలను వాయిదా వేయడం మూలంగా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారంగాని, ఇతర సాంకేతికాంశాలు కానీ పెద్దగా అడ్డురావు. వాళ్లు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలేవీ కావు. గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పోస్టులు పెంచడంతో పాటు, గ్రూప్‌2 పరీక్షను డిసెంబర్‌ వరకు వాయిదా వేయడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో గత కొంత కాలంగా గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పోస్టులు పెంచాలని, గ్రూప్‌ 2 పరీక్షను డిసెంబర్‌ వరకు వాయిదా వేయాలని అభ్యర్థులు, తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. గ్రూప్స్‌ పరీక్షలు, పోస్టుల సంఖ్య పెంపుపై నిరుద్యోగ అభ్యర్థులు లేవనెత్తుతున్న అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నిరుద్యోగ యువతను అవమానకరంగా మాట్లాడుతోంది. గ్రూప్‌2, గ్రూప్‌3 పరీక్షల విషయమై అభ్యర్థులు కోరుతున్న విధంగా సాధ్యాసాధ్యాలు పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలేగానీ కాలయాపన చేస్తోంది.
గ్రూప్స్‌ పరీక్షల్ని వాయిదా వేయాలని అభ్యర్థులు ఎందుకంత బలంగా కోరుతున్నారో ప్రభుత్వం పరిశీలించాలి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్ల కాలంలో అనుసరించిన నిరుద్యోగ, విద్యార్థి వ్యతిరేక విధానాల మూలంగా ఆశించిన మేరకు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్న విషయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించాలి. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు రద్దు, పేపర్‌ లీకులు, టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఘోర తప్పిదాలు, పరీక్షలు వాయిదాలు వంటి కారణాలతో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. దానికి తోడు గ్రూప్‌2 పరీక్షలు మూడు సార్లు వాయిదా పడటం, నిరుద్యోగ యువతను మరింత నిరాశ పరిచింది. ఉద్యోగ నియామ కాల విషయంలో రెండు లక్షల ఉద్యో గాలు భర్తీ, రూ.4వేల నిరుద్యోగ భృతి, ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ వంటి ఇతర అనేక వాగ్దానాలిచ్చి కాంగ్రెస్‌ గెలిచింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలవు తున్నా, ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టత లేకపోవడం, ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులకు నమ్మకం కలిగించక పోవడం, వరుస నోటిఫికేషన్లు, వివిధ రకాల పోటీ పరీక్షల నడుమ సమయం లేకపోవడం, ఇతర పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అవకాశాలు లేక అభ్యర్థులు మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. డీఎస్సీ రాత పరీక్షతోపాటు, గ్రూప్‌ 2 గ్రూప్‌ 3 పరీక్షలు వెనువెంటనే ఉన్నందున కొంత వెసులుబాటు కల్పిస్తూ, డిసెంబర్‌లో గ్రూపు 2 రాత పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరడం ఆలోచించదగిన అంశమే.
తెలంగాణ ఏర్పడ్డాక 2016 తర్వాత వేసిన నోటిఫికేషన్‌తో 783పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికలు, ఇతర కారణాలరీత్యా సకాలంలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. దాదాపు ఐదున్నర లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నిరుద్యోగుల ఆవేదన. 2022లో వేసిన నోటిఫికేషన్‌ ప్రకారం కాకుండా ప్రస్తుతం ఉన్న ఖాళీల ప్రకారం గ్రూప్‌2 పోస్టుల సంఖ్య పెంచి, సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షల గడువును డిసెంబర్‌ వరకు వాయిదా వేయాలని కోరుతున్నారు. జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు డీఎస్సీ రాత పరీక్షలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. డీఎస్సీ రాత పరీక్ష రాస్తున్న వారిలో అత్యధిక మంది గ్రూప్‌2, గ్రూప్‌ 3 పరీక్షలు కూడా రాస్తున్న వారున్నారు. అభ్యర్థులు కోరుతున్న విధంగా ఇతర పోటీ పరీక్షలు రాసుకునే అవకాశం ఉండే మాదిరిగా డిసెంబర్‌ వరకు గ్రూప్‌2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విన్నవిస్తున్నారు. గ్రూప్‌ 2 రాసే అభ్యర్థులు అత్యధిక శాతం మంది గ్రూప్‌3 కూడా రాస్తున్నందున, సిలబస్‌ రెండు పరీక్షలకు ఒకేలా ఉండడం, వాయిదా వేయాలని కోరుటకు మరో ప్రధాన కారణం.
నవంబర్‌లో నిర్వహించే గ్రూప్‌ 3 పరీక్ష దగ్గరగా గ్రూప్‌ 2 పరీక్షలు పెట్టడం మూలంగా అభ్యర్థులు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. గ్రూప్‌-2 రాసే అభ్యర్థులు గ్రూప్‌ 1 మెయిన్స్‌కు కూడా సెలెక్టయ్యారు. అలాంటప్పుడు ఈ రెండు పరీక్షలకు ఒకేసారి చదవడం కూడా చాలా ఇబ్బందే. గనుక వాయిదా వేయాలని నిరుద్యోగులు గట్టిగా పట్టుబడుతున్నారు. వేయకపోతే తమకు మరింత నష్టమన్నది నిరుద్యోగుల వాదన. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులతో పాటు గ్రూప్‌ 2 విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే గ్రూప్‌-2 పోస్టుల సంఖ్య పెంచి, మళ్లీ నోటిఫికేషన్‌ ఇస్తామంటూ, యువతకు న్యాయం చేస్తామంటూ చెప్పిన అంశాన్ని నిరుద్యోగులు గుర్తుచేస్తున్నారు. దానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నారు.
ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. గ్రూప్‌ 2 పోస్టులు పెంచి గ్రూప్‌-2 రాత పరీక్షలు డిసెంబర్‌ వరకు వాయిదా వేయాలని తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్నా రు. అయితే చట్టబద్ధంగా పోరాడుతున్న అభ్యర్థుల పట్ల ప్రభుత్వం పోలీసు నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, అక్రమంగా అరెస్టు చేస్తూ, పోలీస్‌ స్టేషన్లో నిర్బంధిస్తూ, భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రూప్స్‌ అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పోస్టులు పెంచాలి, గ్రూప్‌ 2 పరీక్షలు డిసెంబర్‌ కు వాయిదా వేయాలనే అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం డీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల న్నింటిని భర్తీ చేయుటకు వెంటనే మరొక డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సిద్ధపడాలి. దాంతో పాటు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న వాగ్దానానికి కట్టుబడి ఉండాలి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి చట్టబద్ధత తీసుకొచ్చేందుకు, నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు సమగ్రమైన కృషి జరగాలి. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణం గా ప్రభుత్వ పాలన సాగాలి.
– కోట రమేశ్‌, 9618339490