మానవ నాగరికత ఆవిర్భావం నుంచి ”వినోదం” ఒక భాగం. అలసిన శరీరానికి మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూర్చేవి ఆటలు, పాటలు, నాటికలు, పుస్తక పఠనం మొదలైనవి. కాలక్రమేణా ముఖ్యంగా 19వ శతాబ్దం నుండి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో నేడు 21వ శతాబ్దంలో సాప్ట్‌వేర్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ముఖ్యంగా వినోద కార్యక్రమాలు అయిన సినిమాలు, టీవీలు, సీరియల్స్, ఓటిటీ వంటివి, సెల్ ఫోన్లు, కంప్యూటర్ వివిధ సామాజిక మాధ్యమాలు వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్టాగ్రాం వంటి పలు సమా చార సౌకర్యాలు ద్వారా మానవుడు జీవితం పలు రకాలుగా పెనవేసుకున్నది. ప్రపంచ నలుమూలల అందరినీ ఒకచోట చేర్చి వేరే లోకాల్లో విహరింపచేస్తుంది. మానవుని జ్ఞానంతో అనేక విషయాలు చేరవేస్తూ మనలను చైతన్యపరుస్తూ ఉండటం మంచి పరిణామమే… కానీ ఇదే పరిజ్ఞానం సమాజంలో పలు కొత్త సమస్యలకు కారణమవుతోంది.
ముఖ్యంగా మానవులు వినోదం కోసం సినిమాలు, సీరియల్స్ చూస్తూ కొంత ఉపశమనం పొందుతారు. కానీ ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల్లో ఎక్కువగా హింసా ప్రవృత్తి, నేరాలు పెంచే విధంగా, మితిమీరిన శృంగారం వంటివి మేళవించి రూపొందిస్తూ ముఖ్యంగా యువతను, పిల్లలను ప్రభావం చేసే విధంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి…!? దాదాపు అన్ని సినిమాలు హింస, దోపిడీ, అశ్లీలమే కదా..!? కోట్ల రూపాయల ఖర్చు పెట్టి, మరెన్నో కోట్ల రూపాయలు సంపాదించడమే.. పూర్తిగా వ్యాపార దృక్పథమే తప్పా, తాము నిర్మించిన సినిమాలు, సీరియల్స్ ప్రజలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో కనీసం ఇకనైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముక్కుపచ్చలారని వయసులోనే మర్డర్లు, మానభంగాలు చేసే విధంగా పిల్లలను ప్రభావం చేస్తున్నాయంటే ఎంత భయంకరం..!?.పూర్తిగా 15 సంవత్సరాల వయస్సు నిండని వారు కూడా అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో పలు వార్త పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. బాల నేరస్తుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగించే అంశం. జువెనైల్ జైల్లో ఖైదీల సంఖ్య పెరగటం బాధాకరం. సెల్ ఫోన్లు, కంప్యూటర్ అందరికీ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ గేమ్స్, వివిధ రకాల యాప్స్, సైట్లు లభ్యం కావడం వల్ల అనేక నేరాలు, ఘోరాలు పెరుగుతున్నాయి. నేరప్రవృత్తి, హింసా ప్రవృత్తి, సైబర్ క్రైమ్స్, దోపిడీ విశృంకలత రకరకాల చెడు వ్యసనాలకు మూలం ఈ సినిమాలు, సీరియల్స్ అని చెప్పాల్సిరావడం బాధాకరమైన తప్పని పరిస్థితి. ఇలాంటి చెడు ప్రసారాలపై, సామాజిక మాధ్యమాలపై సమాజం దృష్టి సారించి నియంత్రించే మార్గాలు అన్వేషించాలి.
ఒకప్పుడు వినోద కార్యక్రమాల ద్వారా సంస్కృతి, విలువలు, మానవత్వం, నీతి, సందేశాలు అందేవి. సమాజం విలువలతో నిర్మించబడేది. నేడు స్వార్థం, దోపిడీ విచ్ఛలవిడితనంగా మారుతున్నది. కనీసం తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల యెడల సరైన ప్రవర్తన, బాధ్యత కరువవుతోంది. భవిష్యత్తులో ఎక్కడ చూసినా వృద్ధాప్య ఆశ్రమాలే కనిపిస్తాయంటే ఆశ్చర్యపోవాల్సిందే! ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంత సమయం వారితో గడపాలి. కష్టసుఖాలు, మంచిచెడ్డలు, గురించి చెప్పాలి. ఎప్పుడూ మార్కులు, ర్యాంకుల కోసమే మాట్లాడద్దు. నీతి కథలు, నైతిక విలువలు నూరిపోయాలి. సినిమాలు సీరియల్స్, సెల్ ఫోన్లపై నిఘా ఉంచాలి. దర్శకులు, నిర్మాతలు కూడా మానవునిలో మంచి స్వభావం పెంచే విధంగా సినిమాలు, సీరియళ్లను చిత్రీకరించాలి. ఇప్పుడు కూడా పాత సినిమాలు, పాత సినిమా పాటలే అనేక మంది చూస్తూ, వింటూ మానసిక ప్రశాంతత పొందుతున్నారు.. వాస్తవమే కదా! మరి నేడు ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తీసిన సినిమా అయినా, కేవలం ఒక నెల రోజుల్లో కనుమరుగవుతుంది. అంటే దానికి చర్చ కూడా ఉండదు. దీనికి కారణం సరైన సందేశం లేకపోవడమే. ఇప్పుడున్న సమాజంలో మంచి గురించి పక్కనబెడితే కనీసం నెగిటివ్ థాట్స్, వైఖరులు పెంచకుంటే ఉంటే చాలు. సినిమాలు, సీరియల్స్‌లో టెక్నాలజీ వాడి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన దృశ్యాలు, సంఘటనలు చూపించవచ్చు. నాలుగు మంచి విషయాలు చెప్పడం ద్వారా ప్రేక్షకులపై చెడు ప్రభావాలను అరికట్టవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలతో చిత్ర పరిశ్రమ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– ఐ.ప్రసాదరావు, 6305682733