నేతన్నల ఐక్య పోరాటమిచ్చిన సందేశమేమిటి?

నేతన్నల ఐక్య పోరాటమిచ్చిన సందేశమేమిటి?సాంచల సందడే సిరిసిల్ల గుండెచప్పుడు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల నిర్వాకంతో సిరిసిల్ల సాంచలు(పవర్‌లూమ్స్‌) ఆగిపోయాయి. ఫలితంగా 30వేల నేత కార్మిక కుటుంబాలు బజారున పడ్డాయి. నలభై ఎనిమిది రోజులపాటు నేత కార్మికుల అలుపెరుగని ఐక్యపోరాట ఫలితంగా విజయం సాధించారు. సాంచల సందడి మళ్లీ మొదలైంది. ”ఉరిసిల్ల కాదిది… పోరుసిల్ల” అని కార్మికవర్గం నిరూపించింది. ఇద్దరిని కోల్పోయినప్పటికీ, పాత ‘ఉరి’సిల్లగా మారకుండా కార్మికులకు పోరాటం పట్ల విశ్వాసం బలపడింది. సిరిసిల్ల ‘సిరి’ భద్రతకు పోరుబాటే తప్ప మరో మార్గం లేదని రుజువైంది.
సీఐటీయు నాయకత్వంలో సాగిన నేతన్నల సుదీర్ఘ పోరాటం ఐక్య పోరాటంగా మారింది. పెట్టుబడి పెట్టిన యజమానులు, సాంచల ఆసాములు కూడా కలిసిరావటంతో ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పడింది. కార్మికులు సిరిసిల్ల పట్టణమంతా పాదయాత్ర చేయ టంతో ఆసాములు, పెట్టుబడి పెట్టినవారు, ఇతరులలో కూడా విశ్వాసం కలిగింది. 42వ రోజు నాటికి జేఏసీ రూపం తీసుకున్నది. సంపూర్ణ ఐక్యతకు బాటలు వేసింది. సహజంగానే మొదట యజమానులు, ఆసాములు గత, ప్రస్తుత పాలకులనే నమ్ముకున్నారు. వేతన సవరణ, కార్మికుల హక్కుల విషయంలో తమతో పోరాడిన కార్మికవర్గంతో కలిసి పోరాడటానికి భేషజాలు అడ్డువచ్చాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చునను కున్నారు. కానీ సమస్య తీవ్రత రీత్యా, 42రోజుల పోరాటం తర్వాతనైనా ఐక్యపోరాటానికి సిద్ధపడటం అనివార్యమైంది. పట్టుదలతో సాగిన కార్మికుల పోరాటం వారిని ఆ దిశలో అడుగులు వేసేందుకు ప్రోత్సహించింది.
గత పాలకులు బతుకమ్మ చీరల బకాయిలు రూ.273 కోట్లు చెల్లించలేదు. కార్మికులకు నేరుగా అందవల్సిన దారం సబ్సిడీ రూ.18కోట్లు ఇవ్వలేదు. కార్మికుల పొదుపు సొమ్ముకు ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు, విద్యుత్తు సబ్సిడీ కూడా బకాయి పెట్టింది. మరోవైపు కేంద్రంలో మోడీ ప్రధాని కాగానే జాతీయ చేనేత బోర్డు, జాతీయ టెక్స్‌టైల్‌ బోర్డులను రద్దు చేసారు. యూపీఏ కాలం నుంచి ఇంట్లోనే పవర్‌లూం నడిపే విధంగా ప్రోత్సహిస్తూ వచ్చిన హౌజ్‌ కం వర్క్‌షెడ్‌ పథకం, మహాత్మాగాంధీ బునకర్‌ బీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీంలను రద్దు చేసారు. వీటన్నింటినీ మించి చేనేత, పవర్‌లూమ్‌ వస్త్ర ఉత్పత్తుల మీద, ముడిసరుకుల మీద జీఎస్టీ పేరుతో పన్ను 12శాతానికి పెంచారు. ఫలితంగా సిరిసిల్ల నేత పరిశ్రమ సంక్షోభంలో పడ్డది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించలేదు. నేతన్నలను ఆదుకునేందుకు సకాలంలో చర్యలు తీసుకోలేదు. కరెంట్‌ బిల్లుల మీద సబ్సిడీ బకాయిలున్నాయన్న పేరుతో, యూనిట్‌ రూ.2 కాకుండా రూ. 8 చొప్పున, వడ్డీతో సహా చెల్లించాలని విద్యుత్తు అధికారులు ఒత్తిడి చేసారు. ఒక్కొక్క ఆసామి లక్షల రూపాయలు బకాయి ఉన్నారన్న నెపంతో మీటర్లు డిస్కనెక్ట్‌ చేసారు. ప్రభుత్వం కూడా కొత్తగా గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వలేదు. ఆసాములు, యజమానులు ఉత్పత్తిని ఆపేసారు. కేంద్రంలో మోడీ సర్కారు, రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారుల నిర్వాకం ఫలితంగా నేతన్నల జీవితాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. పోరాటం ప్రారంభమైంది. పోరాటం సాగుతుండగానే పార్లమెంటు ఎన్నికలు ప్రకటించారు. అయినా పోరాటం కొనసాగించక తప్పలేదు. కార్మికుల గుండెచప్పుడు ఆగకుండా ఉండాలంటే పోరాటం అనివార్యమైంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బడా వస్త్ర పరిశ్రమలు, విదేశీ బహుళజాతి సంస్థల మీద మోజు ఎక్కువ. అవి లాభాలు గడించాలంటే చేనేత, పవర్‌లూం పరిశ్రమలు మిగలొద్దు. అందుకే వాటి మనుగడకోసం నడుస్తున్న పథకాలన్నీ మోడీ ప్రధాని అయిన తర్వాత రద్దు చేసారు. ‘పీఎం మిత్రా’ పేరుతో 2023 మార్చి 17న ఒక పథకం ప్రవేశపెట్టారు. దీనికి ‘5ఎఫ్‌ విజన్‌’ అని ముద్దుపేరు పెట్టారు. ఇందులో భాగంగానే వరంగల్‌ నగరంలో రెండువేల ఎకరాల భూమి సేకరించి, బ్రాండెడ్‌ బడా కంపెనీల కోసం మెగా కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ స్థాపనకు వేగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అసంఘటితంగా వస్త్ర పరిశ్రమ ఉన్నదనీ, దీనివల్ల ప్రయోజనం లేదనీ ప్రధాని భావించారట! అందుకు బడా పరిశ్రమలకు పెద్దపీట వేసారట! ఈ విషయం కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ప్రకటించారు. మరోవైపు, నాటి ముఖ్యమంత్రి కూడా అదే విధానం చేపట్టారు. ఇక సాధారణ వ్యక్తిగత పవర్‌లూమ్‌ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందా? మోడీతో చేతులు కలిపి నేతన్నల పొట్ట కొట్టే విధానం చేపట్టిన ఫలితమే నేటి సిరిసిల్ల సంక్షోభానికి మూలం. అంతేకాదు. ‘కార్మికుడే యజమాని’ పేరుతో ఒక పథకం రూపొందించి ఆనాటి ప్రభుత్వం వర్క్‌షెడ్స్‌ నిర్మించింది. కానీ 50శాతం సబ్సిడీతో ప్రతి కార్మికుడికీ నాలుగు పవర్‌లూమ్స్‌ ఇస్తామన్న ప్రభుత్వం, బ్యాంకు అప్పులకు ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడు ఆ వర్క్‌ షెడ్లు పడావుపడి ఉన్నాయి. తొండలు గుడ్లు పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వైపు మొగ్గిన ఫలితమే ఇది. ఇప్పుడు ఉన్నట్టుండి ముప్పైవేల మందికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించగల పరిస్థితి చిన్న సిరిసిల్ల పట్టణానికి లేదు. పైగా దీని ప్రభావం ఇతర వ్యాపారాల మీద కూడా పడింది. అమ్మకాలు మందగించాయి.
రోడ్డునపడ్డ నేతన్నలను పౌరులుగా గానీ, శ్రమను అమ్ముకుని బతుకుతున్న కార్మికులుగా గానీ పాలకపార్టీలు పరిగణించలేదు. వారి కుటుంబాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించాయి. మరోదారి లేని కార్మికులు ధర్నాలు, ప్రదర్శనలు, వంటావార్పూ, భిక్షాటన, పాదయాత్ర వంటి రూపాలలో పోరాడారు. సభ్య సమాజం వీరి పట్ల సంఘీభావం ప్రదర్శించింది. అన్నదానం సందర్భంగా కూరగాయల వ్యాపారులు బాగా స్పందించారు. వారి వృత్తి లేకుండా తాము కూడా బతకలేమనీ, ఎన్ని కూరగాయలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
నలభై ఎనిమిది రోజుల ఈ పోరాటంలో ఎక్కడా కనిపించని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, ముగింపు దశలో వేలుపెట్టి, ఎన్నికల కోసం వాడుకునేందుకు ప్రయత్నించారు. బండి సంజరు ఒకరోజు దీక్ష చేస్తానన్నాడు. మోడీ తప్పుడు విధానాలు అమలు చేసినపుడు బండి సంజరు పార్లమెంటు సభ్యులు. సిరిసిల్లలో కానీ, పార్లమెంటులో గానీ మోడీ ప్రభుత్వ విధానం మార్చుకోవాలని చెప్పలేదు. అప్పుడాయనకు దీక్ష చేయాలని కూడా అనిపించలేదు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్నపుడే, కేసీఆర్‌ పాలనలోనే ఈ సమస్యకు పునాది పడ్డది. అప్పుడు జోక్యం చేసుకోలేదు. పరిష్కారానికి ప్రయత్నించనే లేదు. ఇప్పుడు మాత్రం కార్మికులు పోరాడాలని కేసీఆర్‌ చెప్పారు. కేటీఆర్‌ పేజీలకు పేజీలు ముఖ్యమంత్రికి లేఖ రాసారు. పైగా తమవల్లనే సమస్య పరిష్కారమైనట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం సమస్యను రాజకీయం చేయవద్దనీ, ఇది నేతన్నల ఐక్య పోరాట విజయమనీ జేఏసీ ప్రకటించడంతో తోకముడిచారు. పోరాటాలంటే సహించని బీఆర్‌ఎస్‌ నాయకత్వం, ఏప్రిల్‌ 6న నేతన్నల గర్జన సభలో పాల్గొనాలని ప్రయత్నించటం నేతన్నలకు ఆశ్చర్యం కలిగించింది. ఎన్నికల ప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నాన్ని గమనించిన జేఏసీ, అందుకు అంగీకరించలేదు. నలభైఆరు రోజుల కార్మికుల పోరాటం పట్ల ముఖం చాటేసిన బండి సంజరు, కేటీఆర్‌లు చివరలో హడావుడి చేయటంతో సిరిసిల్ల జనం ముక్కుమీద వేలేసుకున్నారు.
ఈ పోరాట కాలంలో సీఐటీయూ నాయకులు, నేతన్నల బృందంతో పాటు ఆరుసార్లు సంబంధిత శాఖ మంత్రిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కమిషనర్‌తో కూడా చర్చించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రిని కలిసారు. ఏప్రిల్‌ 6న సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములుతో కలిసి సీఐటీయూ నాయకులు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావుతో సుదీర్ఘ చర్చల ఫలితంగా పరిష్కారానికి తాము బాధ్యత తీసుకున్నారు. అదే విషయం వేలాదిమంది పాల్గొన్న నేతన్నల గర్జన సభలో ప్రకటించటం జరిగింది. ఆమేరకు ఏప్రిల్‌ 8వ తేదీన మరోసారి ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకుల చర్చల అనంతరం, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిరిసిల్ల చేరుకుని, సమస్యను పరిష్కరిస్తూ బహిరం గ ప్రకటన చేసారు. రెండు, మూడు రోజులలో యార్న్‌ సబ్సిడీ, ఇతర బకాయిలు విడుదలకు అంగీకరించారు. విద్యు త్తు సబ్సిడీ చెల్లిస్తామనీ, ప్రభుత్వ శాఖల నుంచి బట్ట ఉత్పత్తికి ఆర్డర్లు ఇస్తామని ప్రకటించారు. ఫలితంగా యజమానులు 10వ తేదీ నుంచి సాంచలు నడుస్తాయని ప్రకటించారు. నేతన్నల కుటుంబాలలో ఆనందం వెల్లివిరిసింది.
చేనేత వృత్తినీ, కులాన్నీ ఒకటిగా చూడలేమని ఈ పోరాటం మరోసారి రుజువు చేసింది. కార్మికులు, ఆసాములు, యజమానులలో 95శాతం ఒకే కులం నుంచి వచ్చినవారు. అయినప్పటికీ అదే కులానికి చెంది, ఇతర వ్యాపారాలలో స్థిరపడ్డవారు ఈ పోరాటంవైపు కన్నెత్తి చూడలేదు. కులసంఘం నాయకులు కూడా పాలకపార్టీల నాయకులతో దోస్తానాకు ప్రాధాన్యతనిచ్చారు తప్ప నేత కార్మికుల పోరాటాన్ని పట్టించుకోలేదు. అందుకే ఇది కార్మికవర్గ పోరాట విజయం. కార్మికులు, ఆసాములు, వైపన్‌, వార్పిన్‌, గుమాస్తాలు, యజమానుల ఐక్యపోరాట విజయం. భవిష్యత్తు కార్మికోద్యమానికి ఈ పోరాటం అనేక అనుభవాలనిచ్చింది.
ఎస్‌. వీరయ్య