
– విధులు బహిష్కరించి కళాశాల ఎదుట ధర్నా
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనం లో ఇంటర్మీడియట్ బోర్డ్ నిబంధనలను పక్కన పెట్టి తన సొంత నిర్ణయాలతో మోడల్ స్కూల్ అధ్యాపకులను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మోడల్ స్కూల్ అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. శనివారం వాల్యుయేషన్ క్యాంప్ నుండి బయటకు వచ్చి విధులను బహిష్కరించి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు భూతం యాకమల్లు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు జారీ చేసిన ఆర్డర్లను అమలు చేయకుండా డీఐఈఓ తన సొంత నిర్ణయాలను అమలు చేస్తూ మోడల్ స్కూల్ ఆధ్యాపకులను అవమాన పరుస్తున్నాడని ఆవేదన చెందారు. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్డర్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక సంవత్సరం కూడా రెగ్యులర్ సర్వీస్ లేని వారికి సాధారణంగా పరీక్షా మూల్యాంకనం ఉత్తర్వుల ప్రకారం స్క్రూటి నైజర్ గా విధులను కేటాయించాలి. కానీఇక్కడ మాత్రం తన వారు అనుకున్న వారికి డిఐఈఓ అందలం ఎక్కిస్తూ, బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి ఏఈ గా అర్హత లేకున్నా సీఈ గా ఆర్డర్లు వర్తింపచేయడం మోడల్ స్కూల్ ఆధ్యాపకులను అవమానించడమే అవుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా డిఐఈఓ బోర్డు ఉత్తర్వులను వెంటనే వర్తింపచేయాలని, మోడల్ స్కూల్ ఆధ్యాపకులకు నిబంధనల ప్రకారం సమచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో ఆ సంఘం నాయకులు తరాల జగదీష్, ఉయ్యాల వెంకటేష్, బి. వీరబాబు, ఆర్. రామ నరేష్ నేత, కె. గురుచరణ్, ఎల్. జగన్, కే. కోటయ్య, పి. దామసైయ్య, టి. రాజు, బి. వెంకట్ బి. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.