మౌనం అర్ధాంగీకారం అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి బ్యారేజీ పిల్లర్ల పగుళ్లు అవినీతికి ఆనవాళ్లనే విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ సర్కారు స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపం చంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి బీటలు వారడం ఆందోళన కలిగిస్తున్నది. సర్కారు మాత్రం అంతర్గత చద రంగం ఆడుతుండటాన్ని ఏమనుకోవాలి? కాళేశ్వరం జలాల్లో అవినీతి ప్రవాహాం జోరుగా సాగిందనీ, అక్ర మాల నెగడు లేచిందని ఎప్పటినుంచో ఆరోపణలు, విమ ర్శలు కోకొల్లలు. రూ.80వేల కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా ముఖ్యమంత్రే ఇంజినీర్‌గా పరకాయ ప్రవేశం చేశారని చెప్పుకున్న గొప్పలు అన్నీ, ఇన్నీ కావు. ఈ ప్రాజెక్టుపై ప్రశంసలు ఎంతవరకు వెళ్లాయంటే ప్రపంచంలోని ఏడు వింతలకు తోడు ఎనిమిదో వింత అన్నంతగా. ప్రాజెక్టు నిర్మాణ ప్రతిభ అంతా సీఎంగారిదే అంటూ ప్రస్తుతించిన సందర్భాలూ అనేకం. మరిప్పుడు బ్యారేజీ పగుళ్లకు ఆయనదే కదా బాధ్యత. కేవలం రెండేండ్లలోనే ప్రాజెక్టును పూర్తిచే
శామనీ జబ్బలు చరచుకున్న నేతలంతా, ఇప్పుడు మౌనం వహిస్తున్నారేందుకు ? ఎవరి ఆదేశాల మేరకు నోరు విప్పడం లేదు. అధికారుల నెత్తికి అన్నీ అంటిం చిన తర్వాత మట్టి అంటించుకోవడం ఎందుకని అను కుంటున్నారు కాబోలు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టు, తప్పు చేసిన వారేవరైనా పట్టు బడాల్సిందే. కాస్త వెనకా, ముందు అంతే! కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికార బృందం రాష్ట్రంలో రెండు రోజులుగా పర్యటిస్తున్నది. బ్యారేజీ పౌండేషన్ కింద ఇసుక కదలిక వల్లే సమస్య ఎదురైనట్టు భావిస్తున్నామని సాగునీటి శాఖ ఇంజినీర్లు సెలవియ్యడం గమనార్హం.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీకి నివేదిక సమర్పించనుంది. ఆ మేరకు అసలు కారణాలు బయటకు రావచ్చు. రాకపోనూ వచ్చు.
ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాల్సిందే. ఎవరూ కాదనరు. దీంతో కాలం, డబ్బు కలిసి వస్తాయి. ఆమేరకు ప్రజలకూ ప్రయోజనాలు అందుతాయి. అయితే ఆ ప్రాజెక్టు ఉనికినే దెబ్బతీసేంత వేగం అవ సరమా? తొందరగా నిర్మించే పేర ప్రజలు, వారి ప్రాణాలు, ఆస్తులను ప్రశ్నార్థకం చేసే అధికారం , హక్కు వ్యక్తులకుగానీ, ప్రభుత్వానికి గానీ లేదు. బీఆర్‌ఎస్ పరి పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతను ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఏమేరకు ఫలితాలు వస్తాయనే సంగతి భవిష్యత్‌లో తేలాల్సిందే. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇలా చాలా ప్రాజెక్టులను గతంలోనే కట్టారు. వాటిలో ఇన్ని నిర్మాణ సమస్యలొచ్చాయా ?భారీ నిర్మాణాల్లో సమస్యలు తలెత్తడం కొత్తేమి కాకపోయినా, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు. నిర్మాణ లోపాలకు కారణాలు కాస్త ఆలస్యమైనా బయటకు రాకతప్పదు. మొన్న పూర్తికాకుండానే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. రూ. 40 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తొమ్మిది మోటార్లకుగాను ఒక్కటే ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు ఆగక పోవడం ఎన్నికల్లో లబ్ధికోసం కాదా? జరగరానిది జరిగి ప్రాణ, ఆర్థిక నష్టాలు చోటుచేసుకుంటే బీఆర్‌ఎస్ సర్కారు బాధ్యత వహిస్తుందా? కొంపలు మునిగినట్టు ఆగమేఘాల మీద పాలమూరును జాతికి అంకితం చేశారు. ఒక్క మోటరు జలాలతో లబ్ధి ఎవరికి ? ఈ రోజు రూ.240 కోట్లతో మానేరుడ్యామ్‌పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి రోడ్డుకు అప్పుడే పగుళ్లు రావడం దేనికి సంకేతం ? వీటిపై ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి,
చిన్న అవకాశం, ఆధారం దొరికినా విపక్షాలపై గయ్యినలేచే గులాబీ పార్టీ ముఖ్యులు, తమకేమీ పట్ట నట్టుగా ఎన్నికల ప్రచారంలో నిమగమయ్యారు. వారి గొంతు పెగలకపోవడానికి కారణమేంటి? పెకిలించక పోవడంలోని మర్మమేంటి? సాక్ష్యాత్తు ప్రధాని మోడీ రాష్ట్రం గుజరాత్‌లో అనేక సాగునీటి, రవాణా ప్రాజెక్టులు కుప్పకూలుతుంటే ఇదెంత అనుకుంటున్నారా? ఇప్పుడు బ్యారేజీ దుర్ఘట నకు ఆయన బాధ్యత తీసుకుంటారా? వివరణ ఇస్తారా ? ప్రజలకు సమాధానం చెబుతారా? అనేది నేడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే లక్ష్మి బ్యారేజీలో వర్షాల నేపథ్యంలో వచ్చిన భారీ వర దలకు మోటార్లు మునిగిప్పుడు ‘క్లౌడ్‌బరస్ట్’ అని తప్పించుకున్నారు. ఇప్పుడేమో విద్రోహ చర్యగా చిత్రీకరిస్తున్నారు. అందుకు అవసరమైన కేసు లు పెట్టి ముందస్తు ఎలిబీని సృష్టించుకుంటు న్నారు. ఇందుకు సాక్ష్యం అధికారులు మీడియా కు విడుదల చేసిన పత్రికా ప్రకటనలు. నిరం తర నిఘాతో కనీసం మీడియాను సైతం చూడ టానికి అనుమతించనంత కఠినంగా ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు సంఘ విద్రోహాశక్తుల కుట్ర అనడం హాస్యాస్పదమే. ఈ ఘటనలు సర్కారును బ్యాక్‌ఫైర్ చేస్తు న్నాయి. ప్రశ్నిస్తున్నాయి. బాధ్యులపై చర్యలను కోరుతు న్నాయి. సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.