– పరిశ్రమలలో కానరాని సేఫ్టీ పరికరాలు
– ప్రమాదకర పరిశ్రమలలో అంబులెన్సులు కరువు
– ప్రమాదాలు జరుగుతున్నా
– పట్టించుకోని అధికార యంత్రాంగం
– గుట్టు చప్పుడు కాకుండా తరలించిన శవాలు ఎన్నో..
– యాజమాన్యాలకు ధనార్జనపై ఉన్న శ్రద్ధ కార్మికులపై లేదు
– కార్మికులకు భద్రత అందని ద్రాక్షే..
ఉన్న ఊర్లో బతుకుదెరువు భారమే. కుటుంబ పోషణ గగనమై కుటుంబాలను వదిలి రాష్ట్రాలను పొట్టకూటి కోసం వలసలు వస్తున్న కార్మి కులకు పనిచేసే చోట భద్రత గాలిలో దీపంలా మారింది. బుక్కెడు బువ్వ కోసం పరిశ్రమల్లో రెక్కలు, ముక్కలు చేసుకుని ప్రాణాపాయ పరి స్థితులను కూడా ఎదుర్కొంటూ, బతుకు జట్కా బండిని ఈడుస్తున్న కార్మికుల పోరాట విధుల్లో కనీస భద్రతా పరికరాలు లేని కారణంగా అనుకోని ప్రమాదాల్లో తనవులు చాలిస్తున్నారు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట కార్మికుడు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో బుగ్గిపాలవుతున్నారు.
నవతెలంగాణ-షాద్‌నగర్
షాద్‌నగర్ నియోజకవర్గంలో వందలాది పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు యాజమాన్యం నిర్లక్ష్యం నిర్వహణ లోపాల కారణంగా కార్మికుల నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది కాలంలో పదికి పైగా పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించాయి. సుమారు ఐదు పరిశ్రమల్లో 15 నుంచి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయినా అధికార యంత్రాంగం శాఖా పరమైన చర్చలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందనేది సుస్పష్టం. ప్రమాదాలు జరిగిన రెండు మూడు రోజులపాటు జరిగే హడావిడితో యాజమాన్యం తమలోపాలను అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ యథావిధిగా పరిశ్రమను కొనసాగిస్తున్నారే తప్ప శాఖాపరమైన చర్యలు లేవనే చెప్పవచ్చు. వలస కార్మికుల బతుకులు చింద్రమవుతున్నా, అధికార యంత్రాంగం పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తుందని పలువురు దుయ్య బడుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ప్రమాదాల నివారణ పట్ల చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంతటి ఘోర ప్రమాదాలు ప్రభుత్వాలకు కనబడడం లేదా అధికార యంత్రాంగానికి వినబడడం లేదా ఇంకా ఎంతమందిని ఇలాంటి ఘోర ప్రమాదాలకు బలిస్తారు అంటూ కార్మికలోకం కన్నెర్ర చేస్తున్నా, ఫలితాలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైతున్న సందర్భంగా ఇటువంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులకు భరోసా ఏది?
కార్మికుల బతుకులకు యాజమాన్యాలు భద్రత కల్పించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం తీసుకువచ్చి వారి ఆధార్ కార్డులు గుంజుకుని కార్మికులను ఇబ్బందులకు గురిచేసే యజమానులు ఎందరో ఉన్నారు. రోజుకు 300 లేదా 400 రూపాయలు పన్నెండు గంటల పని చేయించుకుంటున్న కంపెనీల యజమానులు లేకపోలేదు. అడ్డు మాట్లాడిన కార్మికులను అనేక మందిని పనుల్లో నుంచి తీసేస్తారనీ, పని లేకపోతే బతుకు భారమవుతుందనీ పనులు చేస్తున్నారు. వారెవ్వరూ కూడా అడ్డు మాట్లాడని పరిస్థితి.
ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
నిత్యం పరిశ్రమలలో ఎదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వ యంత్రంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు చేసే హడావుడి మిగతా సమయంలో కనపడడం లేదని పలువురు దుయ్యబడుతున్నారు. ఇప్పటికే కొందుర్గు మండల పరిధిలోని స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. అంతేకాకుండా శ్రీనాథ్ రోటోప్యాక్ కలర్ పరిశ్రమలో ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో సౌత్ గ్లాస్ పరిశ్రమలో ప్రమాదం సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, అధికార యంత్రాంగం మాంత్రం చోద్యం చూస్తుందని కార్మిక వర్గాల నుంచి విమర్శ లేకపోలేదు. కాబట్టి ఇప్పటినుంచైనా అధికారులు పరిశ్రమల వైపు చూస్తూ ప్రజల ప్రాణాలకు భరోసానివ్వాలి.
గుట్టు చప్పుడు కాకుండా తరలించిన మృతదేహాలు ఎన్నో..
పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే, పరిశ్రమ యాజమాన్యం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పంపించిన శవాలు ఎన్నో ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యానికి కార్మికుల ప్రాణాలు అంటే లెక్కలేదని, కార్మికుల ప్రాణాలు పోకుండా, జాగ్రత్తలు మాత్రం పరిశ్రమలలో కల్పించడం లేదు. రాత్రులలో కార్మికులు ఉండే చోట విద్యుత్ లేక పాము కాట్లకు గురైన వారు కూడా అనేక మంది ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా పరిశ్రమలలో పని ఇతర రాష్ట్రాల కార్మికులకు భద్రత కల్పించాలి. తగిన గుర్తింపు, ఎనిమిది గంటల పని కల్పించి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. రూ.రెండు వందలు, మూడు వందలిచ్చి, సరిపెట్టకుండా పనికి తగ్గ వేతనం ఇచ్చినప్పుడే కార్మికుల కుటుంబాలకు సరైన న్యాయం చేకూరుతుంది.
కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి
1979 మైగ్రేషన్ యాక్ట్ ప్రకారం వేరే రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వచ్చే వారి పేర్లు కలెక్టర్ ఆఫీసు, లేబర్ ఆఫీసులో నమోదు చేయాలి. మైగ్రేషన్ యాక్ట్ ప్రకారం చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ పరికరాలను వాడాలి. తప్పకుండా కార్మికులకు డ్రెస్, షూ, బెల్ట్, హెల్మెట్ ఇవ్వాలి. మిషనరిలో పని చేసే కార్మికులకు తప్పకుండా శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందడం వలన ప్రమాదాలను నివారించడానికి వీలవుతుంది. షాద్‌నగర్ పరిసర పరిధిలో కార్మిక నాయకులను పరిశ్రమలలోనికి రానిచ్చే పరిస్థితి లేదు.కావున కార్మిక నాయకులను పరిశ్రమలలోని కి ఎప్పుడైనా అనుమతి ఇచ్చే అవకాశం కల్పించాలి.
ఎన్ రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
కార్మికులకు భద్రత, సౌకర్యాలు కల్పించాలి
పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు భద్రతతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. షాద్‌నగర్, నందిగామ, కొత్తూరు వంటి పరిశ్రమలలో కార్మికులను ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రమాదకర పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉండవు అంతేకాకుండా ఫస్ట్ ఎయిడ్ చేయడంకోసం వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం విడ్డురంగా ఉంది. కార్మికులను మనుషులుగా చూడకుండా కంపెనీ కబంధ హస్తాల కింద పని చేయించుకుంటూ, పన్నెండు గంటలు, పద్దెనిమిది గంటలు పని చేపించే విధానం మారాలి. ఇండిస్టియల్ యాక్ట్ ప్రకారం కంపెనీలలో అంతర్రాష్ట్ర కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వాలు కూడా కార్మికుల ఓట్లతో గద్దెనెక్కి కార్మికుల పరిస్థితి పట్టించునే పరిస్థితి లేదు.
బీసా సాయిబాబు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు