తామిచ్చిన ఐదు గ్యారంటీలే కర్నాటకలో తమని వొడ్డుకు చేర్చాయని కాంగ్రెస్ నేతలకు బలమైన విశ్వాసం. అందుకే దానికి ఇంకొకటి కలిపి తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారు. కేసీఆర్ పాలనలో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడని జనానికి ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానన్నారు రేవంత్‌రెడ్డి. బహుశా ఇది అనఫీషియల్ గ్యారంటీ కావచ్చు! డిసెంబరు 7న ‘గడీ’కి కంచెలు పగులకొడతామనడంతోనే, లేదా సింబాలిక్‌గా పగులకొట్టడంతోనే ఈ ఏడవ గ్యారంటీ కొండెక్కి పోయిందేమోననే సందేహం మొన్న అక్టోబరు 27న ఇచ్చిన ఆర్డర్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఒక్క 30 రోజులపాటు పాత సీఆర్పీసీలోని 144వ సెక్షన్ కొత్త భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు విధించబడ్డాయి. ఐదుగురు, అంతకు ఎక్కువమంది జమకూడినా, ధర్నాలు, రాస్తా రోకోలు, ప్రదర్శనలు చేసినా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు. ఇక్కడివరకు పాతదే. కొత్తగా కలిసిందేమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైగలు చేసినా, అంటే బధిరుల భాష కూడా నిషిద్ధం, ఎలక్ట్రానిక్ మెసేజ్‌లు పంపినా, అంటే ఇంటర్నెట్ సేవలు కూడా నిషేధిస్తామని చెప్పకనే చెప్తున్నారు. ఎక్కడో కాశ్మీర్లో, మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధించారంటేనే ‘ఔరా’ అనుకున్నాం. బాజాప్తా మన రాష్ట్ర రాజధానిలో కూడా నిషేధిస్తామని చెప్పడం దారుణాతి దారుణమైన విషయం కదా!
పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు, బంద్‌లు, బంద్చేయటం సాధ్యమయ్యే పనేనా? అప్పట్లో ‘ధూంధాం’లతో దద్దరిల్లిన ధర్నాచౌక్‌లో ముగ్గురో, నలుగురో మూతికి గుడ్డలతో, చేతులు కట్టుకుని కూచోవాలట! ఐదుగురుండకూడదు కాబట్టి! ప్లకార్డులు పట్టుకోకూడదు. అది ధర్నా కాకూడదు. నినాదాలివ్వకూడదంటే అంతేకదా?! ధర్నాచౌక్ రద్దుచేసినాయన నేడు ఫామ్‌హౌస్‌లో ముసుగేసుకుని కూచున్న స్థితి చూసిన తర్వాత కూడా ఈ ఆర్డరేంటి ”ప్రజాస్వామ్య” పరిరక్షకులారా!
ఇక రాష్ట్రంలో జరుగుతున్న మూడు ముక్కలాట చూసిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు అర్థంకానిది లేదా అర్థం కానట్టు నటిస్తున్న విషయం ఒకటుంది. 2022 నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకర్ని ఒకరు నువ్వు బీజేపీతో కుమ్మక్కయ్యావంటే నువ్వు కుమ్మక్కయ్యావని తిట్టుకున్నారు. బీజేపీనే కింగ్‌గా మిగిల్చారు. ఇది రాష్ట్రానికి పొంచి వున్న మతోన్మాద ముప్పును మాత్రం సూచిస్తోంది.
నేడు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలున్నారు. వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు. ఎనిమిది మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఏడుగురు ఉత్తర తెలంగాణ జిల్లాలవారు. మొన్న 28వ తేదీ నవతెలంగాణ ప్రచురించిన బ్యానర్ స్టోరీ మన రాష్ట్రానికి వర్తింపజేసుకుంటే జైనూరులో గోండులకు ముస్లింలకు ఘర్షణ, మేడారంలో ‘హలాల్’ పేరుతో ఆదివాసీలకు ముస్లింలకు ఘర్షణలకు పునాది వేసుకోవడం, నిర్మల్ జిల్లాలో ‘అడెల్లీ’ జాతరలో ఇదే ‘హలాల్’ సమస్యపై గిరిజనేతరులకు ముస్లింలకు ఘర్షణ వాతావరణం వంటివి మేము పేర్కొన్న ”స్థానిక అల్లర్ల” కోవలోకి వస్తాయి. సాధారణంగా అనేక గిరిజన జాతర్లలో గొడ్డు మాంసం లేకుండా నడవదు. ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతరలో ఇది కీలకం. ప్రస్తుతానికి బీజేపీ హలాల్ పేరుతో చొరబడే ప్రయత్నం చేస్తోంది తప్ప గొడ్డు మాంసం సమస్యను ముందుకు తేవడంలేదు. ఆ ఎత్తుగడలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు అసలు గమనిస్తున్నాయా అనేది సందేహమే.
ఈ నేపథ్యంలో రుణమాఫీపై రైతాంగంలో అసంతృప్తి, కనీస వేతనా లపై కార్మికుల్లో అసంతృప్తి, గ్రూప్ వన్ పరీక్షలు, జీఓ 29పై నిరుద్యోగ యువతలో అసంతృప్తి వంటి వాటిని బీజేపీ సంపూర్ణంగా వినియోగించు కునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమస్యల్ని వదిలేసి చర్చంతా నాగార్జునా, కొండా సురేఖ, ఫామ్‌హౌస్‌లు, డ్రగ్స్ చుట్టూ తిప్పడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రయ్నతించడం క్షంతవ్యం కాని విషయం.
ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు చిన్న గొంతుకతోనే మాట్లాడటం మంచిది. 1975 నాటి ఎమర్జెన్సీకి ఎన్నో రెట్లు ఎక్కువ నిర్బంధం, దాదాపు పూర్తిస్థాయి నియంతృత్వం నేడు మోడీ నాయకత్వంలో నడుపుతూ కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికా అన్నట్లు 2014 నుండి ప్రతి ఏడాదీ ఎమర్జెన్సీపై పాఠాలు వల్లె వేస్తున్నారు బీజేపీ నేతలు. ‘ప్రజాస్వామ్యం’ ఎన్నికల వాగ్దానం కాదు. పాలకులు ఇస్తే పాలితులు తీసుకునేది ప్రజాస్వామ్యం అసలే కాదు. ఈ విషయం రాష్ట్ర కాంగ్రెస్ నేతల దృష్టిలో ఉండటం అవసరం.
రాష్ట్రంలో బీజేపీ తన టెంటకిల్స్ చొప్పిస్తూంటే ప్రజల్తో సంబంధంలేని వాటితో పాలక, ప్రధాన ప్రతిపక్షాలు బంతులాట ఆడుకుంటున్నాయి. ప్రతిపక్షపాత్ర పోషించా ల్సింది నేడు ప్రజా ఉద్యమాలే. తాము హిందువులంకాదు, క్రిష్టియన్లంకాదు ”మా దేవుడు ప్రకృతి, మా మతం సర్నా మతం” అని జార్ఖండ్‌లోని గిరిజనులు తెగేసి చెప్పారు. దీనిపై రేపు జనాభా గణన జరుగుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర గిరిజనులను ఆలోచింప చేయాలి. స్థానిక స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వర్గ పోరాటాలను సామాజిక సమస్యలతో కలగలిపి చేపట్టడమే నేటి స్థితిలో వర్గ, సామాజిక శక్తుల కర్తవ్యం.