ఆ బిల్లుల పరిస్థితేమిటో..?

– స్పందించని మేడమ్‌
– రాజ్‌భవన్‌లోనే ఆర్టీసీ, ఎమ్మెల్సీల బిల్లు
– రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన వాటితో కలిపి మొత్తం 12 బిల్లులు పెండింగ్‌లోనే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య నెలకొన్న గ్యాప్‌ బిల్లులపై ప్రభావం చూపుతోంది. పాత వాటితో కలిపి రాష్ట్ర శాసనసభ, మండలి ఇటీవల ఆమోదించి పంపిన మొత్తం 12 బిల్లులకు రాజ్‌భవన్‌ ఇంకా ఆమోదముద్ర వేయలేదు. వాటిపై గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై ఇప్పటి వరకూ స్పందించలేదు. కీలకమైన ఆర్టీసీ బిల్లు, గవర్నర్‌ కోటాలో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులకు సంబంధించినవి కూడా ఇందులో ఉండటం గమనార్హం. గత కొంతకాలంగా ఇటు రాజ్‌భవన్‌కు, అటు ప్రగతి భవన్‌కు మధ్య పరిస్థితి ఉప్పూ, నిప్పూలాగా మారిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ తమిళి సై, సీఎం కేసీఆర్‌ అనివార్య పరిస్థితుల్లో తప్ప ఎక్కడా అధికారికంగా ఒకే వేదికను పంచుకోవటం లేదు. ఇటీవల రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవంలో తప్ప వారిద్దరూ మిగతా కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌, సీఎం మర్యాదపూర్వకంగా కలవటం, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనటం ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితి కొనసాగుతున్న సంగతి విదితమే. ఇది ఇప్పుడు బిల్లులపై ప్రభావాన్ని చూపుతున్నది. ఈ క్రమంలోనే గతంలో ప్రభుత్వం పంపిన మూడు బిల్లులను గవర్నర్‌ తిరస్కరించారు. ఒక బిల్లును ఆమె తిప్పి పంపారు. ఈ నాలుగింటినీ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో రెండోసారి ఆమోదించిన ప్రభుత్వం.. వాటిని తిరిగి రాజ్‌భవన్‌కు పంపింది. వాటితోపాటు కొత్తగా మరో 8 బిల్లులను కూడా ఆమోదించి గవర్నర్‌కు పంపారు. ఇది జరిగి పది రోజులు కావస్తున్నా… రాజ్‌భవన్‌ వీటిపై స్పందించకపోవటం గమనార్హం. వీటిని గవర్నర్‌ ఆమోదిస్తేనే ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయటానికి అవకాశముంటుంది. ఆ తర్వాతే అవి చట్ట రూపంలోకి వచ్చి అమలవుతాయి.
మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌… పలు నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు. ప్రజలకు హామీల మీద హామీలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామంటూ ప్రకటించారు. సామాజిక పొందికల పరంగా కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రావణ్‌కు గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీ పదవులను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు గతనెలాఖరులో నిర్వహించిన మంత్రివర్గంలో ఆమోదించారు. సదరు బిల్లులను గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు. కానీ ఇంతవరకూ ఆమె స్పందించకపోవటం గమనార్హం. దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే కొంత సమయం తీసుకున్నా… అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లుల్ని గవర్నర్‌ అనివార్యంగా ఆమోదించాల్సిందేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే బిల్లులపై వైఖరి చెప్పకుండా రాజ్‌భవన్‌ దాట వేస్తోందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.