1980 దశకం శాంతి, ప్రగతి దిశలో ఒక గణనీయమైన తీరోగమనాన్ని చూసింది.మతోన్మాద శక్తులు,మన ప్రాచీన పవిత్ర స్థలాలకు సంబంధించిన చరిత్రను దుర్విని యోగం చేయడం ద్వారా క్రమక్రమంగా ద్వేషభావాన్ని పెంచేందుకు ఓ కొత్త సాధనాన్ని కనిపెట్టాయి. ఐదు దశాబ్దా లకు పైగా బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రాముని కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని లాల్ కష్ణ అద్వానీ నాయకత్వంలో ఒక రథయాత్ర జరిగింది.ఈ విభజన సమస్యను పెంచిన నేపథ్యంలో ఆగస్ట్ 15,1947 నాటికి ఉనికిలో ఉన్న ప్రార్థనా స్థలాల స్వభావాన్ని మార్చలేనటువంటి ఒక చట్టాన్ని పార్లమెంట్ చేసింది.
2019లో బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఈ చట్టాన్ని, భారత రాజ్యాంగంలో ఒక ప్రధానమైన భాగంగా, శాంతిని నెలకొల్పడంలో ఒక ముఖ్యమైన చర్యగా ప్రశంసించింది.బాబ్రీ మసీదు కూల్చివేత చర్యను నేరంగా ప్రకటించారు.మసీదు అడుగున ఒక దేవాలయం ఉన్న రుజువులు కూడా ఏమీలేవని తీర్పులో అభిప్రాయపడ్డారు.2000 సంవత్సరం తొలినాళ్ళలో బాబ్రీ మసీదు తవ్వకాల సమయంలో మరొక పురావస్తు శాస్త్రవేత్త అయిన జయా మీనన్ తో కలిసి పరిశీలకురాలిగా వ్యవహరించిన ఉన్నతశ్రేణి పురావస్తు శాస్త్రవేత్త ప్రొ.సుప్రియా వర్మ, ”బాబ్రీ మసీదు అడుగున ఎలాంటి దేవాలయం లేకుండా ఉండటమే కాదు,” 12వ శతాబ్దం నుండి 4-6వ శతాబ్దాలకు అంటే గుప్తుల కాలానికి ”వెనక్కి” వెళితే ”అక్కడ బౌద్ధ స్తూపం ఉన్నట్టు కనిపిస్తుంది” అని వివాదాస్పదంగా ప్రకటించిందని సబ్ రంగ్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం తెలుపుతుంది.
హిందూ మితవాదుల నేతత్వంలో మసీదును కూల్చివేసిన సమయంలో ”ఇది కేవలం ఆరంభం మాత్రమే, తరువాత కాశీ, మధురల వంతని” వారు అరిచారు. రెండు సంవత్సరాల క్రితం కాశీ, మధురల సమస్యను ముందుకు తెచ్చి, మతపరమైన ఆరాధనా స్థలాల చట్టం,1991 అమలులో ఉన్నప్పటికీ వాటిని సర్వే చేయించారు.ఆ సర్వే ఈ చట్ట పరిధిలోకి రాదనీ, హిందువులకు ఆ స్థలం పూర్వాపరాలు తెలుసుకునే హక్కు ఉందని అభిప్రాయపడుతూ జస్టిస్ చంద్రచూడ్ గేట్లు తెరిపించాడు. ఈ చర్య, వక్రీకరించబడిన చరిత్రను ఉపయోగించుకు నేందుకు, నమ్మించే చరిత్రను ఉపయోగించుకు నేందుకు,వారి ఎజెండాను ముందుకు తీసుకొని పోయేందుకు ప్రోత్సాహాన్నిచ్చింది. తమకు అయోధ్య, కాశీ, మధురలు ఇచ్చినట్లయితే మసీదుల కింద ఉన్న ఇతర హిందూ ఆరాధనా ప్రదేశాలు కావాలన్న డిమాండ్ మేం చేయము అని ప్రకటించిన శక్తులు అంతటితో ఆగడం లేదు. ప్రస్తుతానికి 12కు పైగా సర్వే కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
హిందువుల వాదనల కోసం కమాల్ మౌలా మసీదు, బాబా బుడాన్ గిరి దర్గా, హాజీ మాలంగ్ దర్గా లాంటి ఇంకా ఇతర అనేక మసీదుల సమస్యల వెంటపడుతున్నారు.చాలా పెద్ద జాబితానే ఉంది. సంభాల్ జమా మసీదు వేలం పరిధిలోకి వచ్చింది కాబట్టి హిందువులకు మరిన్ని స్థలాల్ని ఇవ్వాలని వాదించడానికి బయల్దేరిన హిందూసేన శతాబ్దాల నాటి అజ్మర్ దర్గాను ఇవ్వాలని పట్టుబడుతుంది.
ఈ కేసుల్లో కొన్ని సందేహాస్పద డాక్యుమెంట్లు ప్రజల దష్టిని ఆకర్షించే రీతిలో ప్రాచుర్యంలోకి వచ్చాయి.వీటిలో చాలా వాటిలో బ్రిటీష్ అధికారుల పాత్ర దారుణంగా ఉంది. ఉదా:- బాబర్ నామా అనే తన అనువాద పత్రంలో, బెవరిడ్జ్, ఎలాంటి రుజువు లేకుండా మసీదు కింద ఒక గుడి ఉండి ఉండవచ్చు అని ఫూట్ నోట్‌లో (పుట కింద వివరణ) పేర్కొంది.చరిత్రను వక్రీకరించడం, దేవాలయాలను ధ్వంసం చేయడం,సంపదను దోచుకోవడం, ప్రత్యర్థిగా ఉన్న రాజును అవమానించడం లాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే, బౌద్ధ విహార్లను ధ్వంసం చేయడానికి ప్రధానమైన కారణం మతం. ”జగన్నాథ దేవాలయం ఒక ప్రాచీన బౌద్ధ దేవాలయం. దీనిని, ఇతర దేవాలయాలను మనం స్వాధీనం చేసుకొని వాటిని తిరిగి హైందవీకరించామన్న”వాస్తవాన్ని స్వామీ వివేకానంద తెలియజేశాడు. దయానంద సరస్వతి, శంకరాచార్యుని తోడ్పాటు గురించి,”సత్యార్థ్ ప్రకాష్” అనే తన గ్రంథంలో వివరిస్తూ ఇలా పేర్కొన్నాడు. ”ఆయన దేశ వ్యాప్తంగా పదేండ్లపాటు పర్యటించి, జైన మతాన్ని తిరస్కరించి, వైదిక మతాన్ని సమర్థించాడు. నేడు భూమి నుండి తవ్వగా బయటపడిన విరిగిపోయిన విగ్రహాలన్నీ శంకరుని కాలంలోనే విరిగి పోయాయి.అయితే అదే సమయంలో భూమిలో అక్కడక్కడ దొరికిన వాటిని విరిగిపోతాయనే భయంతో జైనులే పూడ్చిపెట్టారు.”
పురాతన భారతీయ చరిత్రలోని బౌద్ధ కథనం ప్రకారం, మౌర్య రాజవంశంలో చివరి బౌద్ధ రాజుల్లో (అశోకుడు కూడా ఒకడు) చివరివాడైన బహద్రథను 184 బిసిఇలో పుశ్యామిత్ర శుంగ అనే బ్రాహ్మణుడు హత్య చేసి,ప్రఖ్యాత బౌద్ధ రాజ్యవంశ పాలనను అంతం చేసి, శుంగ రాజవంశ పాలనను స్థాపించాడు. బౌద్ధులను దారుణంగా హింసించిన పుశ్యామిత్రుడు,బౌద్ధ, జైన మతాలను ఏ విధంగా ధ్వంసం చేశాడో వివరించే ఒక బౌద్ధ సంస్కత రచన ”దివ్యవదన”ను అత్యుత్తమ ప్రాచీన భారతీయ చరిత్రకారుడైన డి.ఎన్.ఝా ప్రస్తావించాడు. ”అతడు పెద్ద సంఖ్యలో సైన్యంతో కవాతు చేస్తూ,బౌద్ధ స్తూపాల్ని ధ్వంసం చేస్తూ, మఠాలను తగులబెట్టి, బౌద్ధ సన్యాసులను చంపి, ఇప్పుడు సియాల్ కోట్‌గా పిలువబడే సకలలో ఒక్కొక్క శ్రమణ(వేదాలను వ్యతిరేకించే)కు వంద దినార్ల బాహుమతిని ప్రకటించాడు.” కుషానుల కాలంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అభివద్ధి చెందుతున్న పట్టణమైన మధురలో భూటేశ్వర్,గోకర్ణేశ్వర్ లాంటి నేడున్న కొన్ని బ్రాహ్మణ దేవాలయాలు ప్రాచీన కాలంలో బౌద్ధ ప్రదేశాలుగా ఉన్నాయి.
ప్రసిద్ధి చెందిన జానపద కథలలో భాగంగా ఉన్న చరిత్రను హిందూ జాతీయవాద శక్తులు ప్రచారం చేస్తున్నాయి.దీని మూలాలు,మతోన్మాద చరిత్ర రచనా శాస్త్రాన్ని ప్రోత్సాహించిన ”విభజించు-పాలించు” అనే బ్రిటీష్ విధానంలో ఉన్నాయి.దీనిలో రాజులను వారి మతాలకు ప్రతినిధులుగా చూపించారు.అనేక మంది ముస్లిం రాజులు పాలించిన మధ్యయుగ కాలంపైనే ప్రధానం గా దష్టిని కేంద్రీకరిస్తున్నారు.ఈ కాలంలో సంపద కోసం అనేక దేవాలయాలను కొల్లగొట్టారు, ఓడిపోయిన రాజులను అవమానం పాల్జేసేందుకు అనేక ఇతర దేవాలయాలను ధ్వంసం చేశారు. అసలు మరిచిపోయిన,మన జ్ఞాపకాల్లో నుంచి తుడిచివేసిన విషయమేమంటే,ఔరంగజేబు హిందూ దేవాలయాల (కామఖాయ దేవీ దేవాల యం, ఉజ్జయినిలోని మహాకాళి దేవాలయం)కు విరాళాలి చ్చాడు. రాజాహర్షదేవ్ లాంటి హిందూ రాజులు కల్హాన్, రాజతరంగిణి దేవాలయాల సంపదను కొల్లగొట్టేందుకు దేవోట్టపటాన్ నాయక్ అనే ఒక ప్రత్యేక అధికారిని నియమించాడు. మరాఠా రాజులు శ్రీరంగ పట్టణంలో ఒక దేవాలయాన్ని ధ్వంసం చేసిన విషయం మరుగున పడిపోయింది. బౌద్ధ మతాన్ని తుడిచిపెట్టే మౌర్యుల తదనంతర కాలం వలె కాకుండా మతం ఈ కాలంలో అత్యంత తక్కువ పాత్రను పోషించింది. సమాజంలో మత విభజనలు తీవ్రమయ్యే విధంగా భారత రాజకీయ, న్యాయ వ్యవస్థలు ద్వారాలను తెరిచాయి. నేటి అవసరం ఏమిటి? మసీదుల కింద దేవాలయాలను వెతకడం, లేక భాక్రానంగల్ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభిస్తూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నిర్వహించినట్లు, ”భారత దేశంలో స్వాతంత్య్రం తరువాత శాస్త్ర, పారిశ్రామిక ప్రగతిని బలోపేతం చేయడానికి ప్రారంభించబడుతున్న శాస్త్ర పరిశోధనా సంస్థలు, స్టీల్ ప్లాంట్లు, పవర్ ప్రాజెక్ట్‌లను వివరించడానికి” ‘ఆధునిక భారతదేశ దేవాలయాలను’ నిర్మించడం. భారతదేశం ఎంపిక చేసుకునే మార్గమే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
(”న్యూస్ క్లిక్ ” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
రామ్ పునియానీ