మీ అజెండా ఏంటి..?

What is your agenda?– ఆ తొమ్మిది అంశాలను అందులో చేర్చాలి
– వాటిపై పార్లమెంటులో చర్చ జరగాలి
– ప్రత్యేక సమావేశాలపై ప్రధానికి సోనియా లేఖ
న్యూఢిల్లీ: ఈనెల 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపునివ్వటం రాజకీయ వర్గాల్లో తీవ్రకు చర్చకు దారి తీసింది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు మోడీ ప్రభుత్వం ఎలాంటి అజెండానూ ప్రకటించలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ విషయం పై కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. ప్రధాని మోడీకి లేఖను రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. అజెండాలో తొమ్మిది అంశాలను చేర్చాలని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌పై తాజా ఆరోపణలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎంఎస్‌పీ పెంపు కోసం రైతుల డిమాండ్లు, మణిపూర్‌ పరిస్థితి, మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం, కుల గణన ఆవశ్యకత, భారత భూభాగం మరియు కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, పొరుగు దేశం ఆక్రమణ వంటి తొమ్మిది అంశాలను ఎజెండాలో చేర్చాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించారనీ, ఈ సమావేశాల అజెండా ఏమిటో మాకెవరికీ సమాచారం లేదని సోనియా వివరించారు. వచ్చే ఈ ప్రత్యేక సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని మేము కోరుతున్నామని పేర్కొన్నారు. కాగా, పార్లమెంటులో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చించడానికి ఇండియా కూటమిలోని పలు పార్టీలు మంగళవారం సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇంట్లో ఆయన అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్‌, డీఎంకే, సీపీఐ(ఎం), ఎన్సీపీ, సీపీఐ, ఆప్‌, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం వంటి పార్టీలు పాల్గొన్నాయి. ఎలాంటి అజెండానూ ప్రకటించకుండానే మోడీ ప్రభుత్వం సమావేశాలను నిర్వహిస్తున్నదని మల్లిఖార్జున్‌ ఖర్గే తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని భేటీ అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.ఈ ప్రత్యేక సమావేశాల్లో మోడీ సర్కారు కొన్ని వివాదాస్పద బిల్లులను తీసుకొచ్చే అవకాశమున్నదని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ నడుస్తున్నది. ఇందులో ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’, ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అమలు వంటివి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఇంత జరుగుతున్నా.. మోడీ ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ి అజెండా ఏంటో చెప్పకపోవటం గమనార్హం.