జమిలీ ఎన్నికలు, ఇండియా పేరును, భారత్‌గా మార్చటం తదితర అంశాలతో కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజా సమస్యలను పూర్తిగా పక్కదోవ పట్టిస్తోంది. వాటికి సంబంధించి దూకుడుగా వ్యవహరిస్తూ దేశాన్ని, ప్రజలను ప్రతీరోజూ అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతం ద్వారా తయారు చేసిన కొంగొత్త ఇంజక్షన్లను, విషపుచుక్కలను ప్రజల మెదళ్లలోకి ఎక్కించటం ద్వారా వాటిని మరోసారి మొద్దుబార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. తద్వారా 2024 పార్లమెంటు ఎన్నికల్లో తేలిగ్గా గట్టేక్కేందుకు దారుణమైన దారులను కాషాయదళం సిద్ధం చేసుకుంటోంది. ఈ విషయాలన్నింటిపై యావత్ దేశం గళమెత్తుతోంది. బీజేపీని ఓడిచేందుకు ‘ఇండియా’ తన సర్వశక్తులనూ ఒడ్డుతోంది. కానీ దేశంలో సమూల మార్పులు రావాలంటూ పదే పదే చెప్పే బీఆర్‌ఎస్ వైఖరి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకూ… డీఎంకే నుంచి ఎన్సీపీ దాకా ముక్తకంఠంతో కమలనాథుల దుర్నీతిని ఎండగడుతున్నాయి. కానీ ఘనత వహించిన మన బీఆర్‌ఎస్ బాస్ మాత్రం ‘గప్‌చుప్ సాంబారు బుడ్డీ…’ అనుకుంటూ గమ్మున కూకుండి పోయారు. ఆ మధ్య మహారాష్ట్ర పర్యటనలో నేను అధికార ఎన్డీయే కూటమికి, ప్రతిపక్ష ఇండియా కూటమికి సమదూరం పాటిస్తానంటూ ఆయన నొక్కి వక్కాణించిన విషయం సర్వ జనులందరికీ ఎరుకే. ఈ రెంటికీ సమదూరం పాటిస్తానంటూ బీరాలు పలికిన గులాబీ అధినేత… క్రమక్రమంగా కమల దళానికి దగ్గరవుతున్నారనేది సుస్పష్టం. అయితే ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలు, ఓట్లు, సీట్లు, కేసులు, కమీషన్ల కక్కుర్తిలో బూర్జువా పార్టీలు తమ తమ సిద్ధాంతాలను, విధానాలను గాలికొదిలేసిన దృష్టాంతాలు కోకొల్లలు. అలా విధానాలు, వైఖరులకు తిలోదకాలివ్వటంలో గులాబీ పార్టీది అందెవేసిన చెయ్యి. కానీ గతంలో ఫెడరల్ ఫ్రంట్ అనీ, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అంటూ బీరాలు పలుకుతూ… యావత్ దేశాన్నే మార్చేస్తానంటూ సవాళ్లు విసురుతున్న కారు పార్టీ, దాని సారు అత్యంత కీలకమైన సందర్భాల్లో తోక ముడుస్తుండటం విస్తుగొలిపే అంశం.
గతంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మొదలుకుని అనేక విషయాల్లో కేంద్రానికి మొట్టమొదటగా బీజేపీకి మద్దతిచ్చింది బీఆర్‌ఎస్సే. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరం తదితర సందర్భాల్లో సైతం ఆ పార్టీ గోడమీది పిల్లి వాటాన్ని ప్రదర్శించిందే తప్ప తన వైఖరిని ఎక్కడా వెల్లడించలేదు. రైతు చట్టాల విషయంలో ఇదే తంతు నడిచింది. వాటిని వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యాన రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధనాలను చేపట్టారు. ఆ తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్నదాతలతో ఆందోళన సాగిస్తానంటూ ప్రకటించిన అధినేత… ఆ తర్వాత ఆ సంగతే మరిచారు. ఆందోళన స్థానంలో బాధిత రైతు కుటుంబాలకు చెక్కులనివ్వటం ద్వారా తాను ‘రైతు బాంధవుడి’ననే పేరు తెచ్చుకోవటం కోసం తెగ తాపత్రయపడ్డారు. దేశ శ్రేయస్సు, ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ‘పెద్ద నోట్ల రద్దు… జీఎస్టీ’కి జై కొట్టామంటూ చిన్న సారు కేటీఆర్ పలుమార్లు మీడియాకు సర్ది చెప్పుకొచ్చారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ యావత్ భారతాన్నే కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ సర్కార్ తీరు తెన్నులు తెలిసి కూడా మొదట జై కొట్టటం… ఆ తర్వాత నాలుక్కరుచుకోవటం, అలా నటించడాన్ని గులాబీ పార్టీ బాగా ఒంటపట్టించుకున్నది.
‘ఊరందరిదీ ఒక దారి… ఉలిపి కట్టెది మరో దారన్నట్టు’ ఇప్పుడు జమిలి ఎన్నికలు, దేశ పేరు మార్పుపై సర్వత్రా చర్చ కొనసాగుతున్న తరుణంలోనూ బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నోరు మెదపక పోవటం గమనార్హం. పైగా వారి తర్వాత అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కీలక పాత్ర పోషించే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి స్థాయి వ్యక్తులు జమిలి మంచిదే… కానీ దానిపై లోతుగా చర్చ జరగాలంటూ ప్రకటించటం మరో వింత. ఇదే బీఆర్‌ఎస్ వైఖరిలోని డొల్లతనాన్ని తెలియజేస్తోంది. భారత రాష్ట్ర సమితి అని చెప్పుకుంటూ… ఆ పేరుతో దేశాన్ని ఉద్ధరిస్తానని తిరుగుతూ జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే అంశాలపట్ల, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్న సమయాల్లో స్పందించకపోవటమంటే అది పరోక్షంగా ఢిల్లీలోని పాలకపక్షానికి సహకరించటమే. అంతిమంగా అది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు, ఇక్కడి కోట్లాది మంది ప్రజలకు శాపమే… శరాఘాతమే. ‘అందుకే ఓ మహా శయా…’ మీ వైఖరేంటో తెలంగాణ ప్రజలకు ఇకనైనా జర చెప్పండి.