ట్రిబ్యునల్‌తో మీకేంటి సంబంధం?

– వాడివేడిగా గోదావరి బోర్డు సమావేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
గోదావరి నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్‌ వేయాలనే ఏపీ విజ్ఞప్తిని బోర్డు సమావేశంలో పెట్టడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం ఈ అంశాన్ని ఏపీ, కేంద్రం వద్దే తేల్చుకోవాలనీ, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌-85 ప్రకారం బోర్డుకు దక్కిన అధికారాలకే పరిమితం కావాలని తెలంగాణ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ అభ్యంతరాలతో ఈ అంశాన్ని చర్చించబోమని బోర్డు చైర్మెన్‌ ముకేష్‌కుమార్‌ సిన్హా ప్రకటించారు. శుక్రవారం బోర్డు సమావేశం చైర్మన్‌ ఎంకే సిన్హా అధ్యక్షతన వాడివేడిగా జరిగింది. దీనికి తెలంగాణ నుంచి ఈఎన్సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి తరపున సంయుక్త కార్యదర్శి భీంప్రసాద్‌, ఈఎన్సీ(కరీంనగర్‌) శంకర్‌, సీఈ శంకర్‌ నాయక్‌, అంతరాష్ట్ర ఎస్‌ఈలు కోటేశ్వరరావు, శ్రీధర్‌రావు దేశపాండే, గోదావరి బేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్య ప్రసాద్‌తో పాటు ఏపీ నుంచి నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శితో పాటు నీరు ( హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర) కుమార్‌, ఈఈ గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డు సమావేశం ఎజెండాలో కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం జారీ చేసిన టీవోఆర్‌(టర్న్‌ అండ్‌ రిఫరెన్స్‌)ను చేర్చగా. ట్రిబ్యునల్‌ పరిధిలో ఉన్న అంశాన్ని చర్చించడాన్ని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలనే ప్రతిపాదనలను తెలంగాణ వ్యతిరేకించింది. అంతరాష్ట్ర సరిహద్దులోనే టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలనీ, జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్హెచ్పీ) కింద ఏర్పాటు చేయాలని కోరింది. ఇక తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ఎస్‌ఆర్‌ఎస్పీ-2 విస్తరణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతల పధకాలతో కాళేశ్వరం అదనపు టీఎంసీల, కుద్దిలను అడ్డుకోవాలని ఏపీ ఈ సందర్భంగా డిమాండ్‌ చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల్లో మూడింటికి టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం లభించిందనీ, కుష్ఠి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే అందిస్తామని తెలంగాణ గుర్తు చేసింది. గోదావరిలో న్యాయమైన వాటా ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నామని తెలంగాణ స్పష్టం చేసింది.