బంగ్లాదేశ్‌ మనకు నేర్పుతున్న పాఠమేంటి?

ఆమె బంగ్లాదేశ్‌ పాలక పార్టీ అవామీ లీగ్‌ నాయకురాలు. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, బంగ్లాదేశ్‌ జాతిపితగా పిలిచే షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తె. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్‌ హసీనా పేరొందారు. షేక్‌ హసీనా 1996 నుంచి 2001 మధ్య .. అనంతరం 2009 నుంచి తాజాగా రాజీనామా చేసేవరకు బంగ్లాదేశ్‌ను పాలించిన నేత. ఏళ్ల దాదాపు రెండు దశాబ్దాల పాలనలో బంగ్లాదేశ్‌ ఆర్థికంగా అభివృద్ధి చెందిన మాట వాస్తవం. జీడీపీ వృద్ధిలో వరల్డ్‌ బ్యాంక్‌ నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెడీమేడ్‌ దుస్తుల హబ్‌ గా ఎదిగింది. మరోవైపు విపరీతమైన అవినీతి కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిపో యింది. నిరుద్యోగ సమస్యకు తోడు రిజర్వేషన్లతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపడంతో పరిస్థితి అదుపుతప్పి ప్రధాని పదవీచ్యుతురాలయ్యే పరిస్థితికి దారితీసింది.
అసలేం జరిగింది? ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణా మాలకు దారితీశాయి. ఆందోళనలతో రగిలిపోయిన రచ్చలో వందలాది మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్‌ అట్టుడికిపోయింది. నాలుగోసారి వరుసగా గెలిచి పదహారేండ్లుగా దేశాన్ని పాలించిన షేక్‌ హసీనా తప్పుకో వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రజావ్యతిరేక విధానాలు, అసంబద్ధ నిర్ణయాలు, వివాదాలు తలెత్తే అంశాల పట్ల జాగ్రత్త వహించకపోవడంతోనే బంగ్లాకు ఈ దుస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకుల వాదనా. ఎందుకంటే ఆర్థికంగా ఎంత అభివృద్ధి ఉన్నా సరే..ప్రతిపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే అది నిర్బంధపాలన కిందకే వస్తుంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు, అల్లర్లు, ఆందోళనలు ఆ కోవలో నుంచి పుట్టుకొ చ్చినవే. విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వణికిపోయింది. ప్రధాని రాజీనామా చేయడంతో దేశం సైనిక పాలనలోకి వెళ్లిపోయింది.
ఆ రిజర్వేషన్ల వల్లే ఆందోళనలు
పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని ఇక్కడ యుద్ధవీరులుగా చెబుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడింట ఒక వంతు వారి పిల్లలకు రిజర్వ్‌ చేశారు. మరికొన్ని ఉద్యోగాలు మహిళలు, మైనారిటీలు, వికలాంగులకు రిజర్వయి ఉంటాయి.యుద్ధవీరుల పిల్లల కోసం మూడింట ఒకవంతు పోస్ట్‌లు కేటాయించడం వివక్షతో కూడుకున్నదని, ప్రతిభ ఆధారంగానే రిక్రూట్‌మెంట్‌ జరగాలని కొందరు విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 2018లో ఇలాంటి నిరసనలే వెల్లువెత్తడంతో షేక్‌ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దుచేసింది. కానీ, ఆ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్‌ ప్రారంభంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తాజా ఆందోళనలకు దారితీసింది. హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను రద్దు చేయాలని అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో, తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 93 శాతం ఉద్యోగాలను మెరిట్‌ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 5 శాతం, మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్‌ జెండర్‌లకు ఒక శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా దేశంలో నిరసనలు ఆగలేదు. కోటా రద్దు డిమాండ్‌ను వదిలి షేక్‌ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్‌తో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి.ఈ ఉద్రిక్త పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో షేక్‌ హసీనాను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ కొన్ని నిమిషాల గడువు పెట్టింది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యా దేశం వెడిచి వెళ్లాలని చెప్పినట్లు సమాచారం.
బంగ్లా సంక్షోభంతో భారత్‌ అలర్ట్‌
ప్రధాని షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేయగానే భారత్‌కు చేరుకున్నారు.యూపీలోని ఘజియాబాద్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ఆమె అక్కడి నుండి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా వారు నిరాకరించినట్టు వార్తలు. బంగ్లాదేశ్‌ రాజకీయ సంక్షోభంతో భారత్‌ అలర్ట్‌ ఒక్కసారిగా అలర్ట్‌ అయింది. బార్డర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించి సరిహద్దు గ్రామాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌ డీజీ కోల్‌కతాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్టు సమా చారం. మరోవైపు భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు రెగ్యులర్‌గా నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్‌ రైల్వే ప్రకటించింది. కరోనా తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. ఉక్రెయిన్‌ వివాదంతో బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకునే ఇంధనం నుంచి నిత్యా వసరాల వరకు అన్నీ ధరలు 20శాతం వరకు పెరిగాయి. యువతకు ఉద్యోగాలు లేవు. కనీసం రోజు గడవడమే కష్టంగా మారింది. ఇవే విద్యార్థులను విధుల్లోకి వచ్చి ఆందోళన చేయడానికి కారణమయ్యాయి. విద్యార్థుల్లో ఉన్న ఆగ్రహావేశాలను బంగ్లాదేశ్‌లోని అపోజిషన్‌ పార్టీ, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ అవకాశంగా మలుచుకుంది.
మన దేశం నేర్వాల్సిన పాఠం
ప్రజల సౌకర్యాలతో పాటు ధరల నియంత్రణ, కొనుగోలు శక్తి పెంచి, ఉపాధినిచ్చే కార్యక్రమాలు, పథకాలు చేపట్టాలి. కానీ బంగ్లాలో కొన్నేండ్లుగా షేక్‌ హసినా పరిపాలనలో అభివృద్ధితో పాటు అసమానతలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. అవినీతి, బంధుప్రీతి, అసంబద్ధ నిర్ణయాలు పౌరుల్ని వీధుల్లోకి రప్పించాయి. ఇప్పటికే పాకిస్థాన్‌, శ్రీలంకలో ఏం జరిగిందో చూశాము. నిధుల్లేక ఐఎంఎఫ్‌ నుంచి తెచ్చిన అప్పులు తీర్చడానికి ప్రజలపై పన్నుల భారం మోపడంతో తిరుగుబాటు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. పాలకుల తప్పిదాలు, అనుసరిస్తున్న విధానాలపైనే దేశ భవిష్యత్తు, ప్రజల భద్రత ఆధారపడి ఉంటాయనేది చరిత్ర నేర్పుతున్న పాఠం. ప్రజల్ని విస్మరించి పాలిస్తే గనుక బంగ్లాదేశ్‌ పరిస్థితి రేపు మనదేశానికి ఎదురవ్వచ్చు. తగిన జాగ్రత్తలు మన పాలకులు తీసుకోవాలి. ప్రతిపక్షాలను నిర్భందించి, ఏకఛత్రాధిపత్య పాలన సాగిస్తున్న మన ప్రధాని మోడీ ఆ విధానానికి స్వస్తి పలకాలి. బంగ్లాదేశ్‌ వైఫల్యాలను ఒక గుణపాఠంగా తీసుకుని ప్రజానుకూల పాలన సాగించాలి. లేదంటే కాలగర్భంలో ప్రజలు వేసే ఓటుతో కనుమరుగవకు తప్పదు!

– జాజుల దినేష్‌, 9666238266