సామ్రాజ్యవాదులకు చెమటలు పట్టించిన ‘చే’

The 'che' that made the imperialists sweatకోట్లాది ప్రజలకు ఆయనొక స్ఫూర్తి ప్రదాత. యువతరానికి నిరంతర ప్రేరణ. సామాజ్య్రవాదులకు సింహస్వప్నం. ఆయన బతికింది కేవలం 39 సంవత్సరాలే అయినా, వందల ఏండ్లకు సరిపడా పోరాట స్ఫూర్తిని అందించిన చిరస్మరణీయుడు. నేటికీ చాలామంది వారి దుస్తులపై, వాహనాలపై ఆయన చిత్రాన్ని ముద్రించుకుం టారు. ముద్దుగా ‘చే’ అని కూడా పిలుచుకుంటారు. అమెరికా, దానికి వంతపాడుతున్న పెట్టుబడిదారి దేశాలను, వారు ప్రోత్సహించే నియంతలకు చెమటలు పట్టించిన అగ్నికణం. ఆయనే ప్రపంచ సోషలిస్టు నేత ఎర్నెస్ట్‌ చేగువేరా. 1928 జూన్‌ 14న అర్జెంటీనా దేశంలోని ”రొసారియా”లో వామపక్ష భావజాలం గల కుటుంబంలో ఐదవ సంతానంగా జన్మించిన ‘చే’ కడదాకా పేదల కోసం పోరాడిన విప్లవవీరుడు. ”నా కుమారుని నరాల్లో ప్రవహించే రక్తం ఐరిష్‌ తిరుగుబాటు దారులదై ఉండాలి” అని తన తండ్రి కోరుకున్నట్లుగా, ఆ ఆశయా లకు అనుగుణంగా పోరాట పటిమను అలవర్చు కున్న ధీరుడు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సంపాదించుకున్న చేగువేరా వైద్య చదువు చదివే రోజుల్లోనే, మోటార్‌ సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతా ప్రయాణించి, ఆనాటి సమాజంలో ఉన్న ధనిక, పేద అంతరాలు ప్రత్యక్షంగా చూసి చలించాడు. పేదల కష్టాలు కడతేర్చడానికి, సామ్రాజ్య వాదంపై విజయం సాధించడానికి ”సాయుధ విప్లవం” ఒకటే మార్గమని తలిచాడు. పేద ప్రజల జీవన పరిస్థితులు మెరుగు పరచడానికి మెరుపుతీగై, పెట్టుబడిదారి వ్యవస్థపై మెరుపుదాడికి గొరిల్లా యోధుడై, అమెరికా వంటి దేశాలకు వణుకు పుట్టించాడు.
1954లో గౌటిమాలలో ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో పనిచేశాడు. అయితే అమెరికా ఆ ప్రభుత్వాన్ని కూల దోయిటచే, మెక్సికో చేరుకున్నాడు. ఆ సమయంలో తన సహచరులతో మెక్సికో చేరుకున్న ఫెడరల్‌ కాస్ట్రోతో పరిచయమై క్యూబాలో అమెరికా ప్రోత్సహిస్తున్న నియంత బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాస్ట్రో చేస్తున్న పోరాటానికి మద్దతుగా అడుగులేశాడు. 1956-59 మధ్య జరిగిన గట్టి పోరాటంలో బటిస్టాను గద్దె దింపి, క్యూబా విప్లవ ఉద్యమంలో మహోన్నత పాత్ర పోషించి, ఫెడరల్‌ కాస్ట్రో అధ్యక్షతన ఏర్పడిన సామ్యవాద ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, బ్యాంకు అధ్యక్షుడుగా సేవలందించాడు. అనేక దేశాలు పర్యటిస్తూ, భారతదేశాన్ని కూడా 1959లో సందర్శించాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి సామ్రాజ్యవాద దేశాలపై ఉక్కుపాదం మోపాలనే ”చేగువేరా” నిరంతరం తపించాడు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో క్యూబా తరుపున పాల్గొని, దక్షిణ ఆఫ్రికాలోని జాతి వివక్షతపై, లాటిన్‌ అమెరికాలోని వివిధ దేశాల నియంతల పాలనపై, సామ్రాజ్యవాద దేశాల ప్రభావాన్ని గొంతెత్తి చాటాడు..వేలెత్తి చూపాడు. క్యూబా విప్లవానికి నాంది పలికాడు. రైతాంగ విప్లవాల నిర్మాణానికి దోహదం చేశాడు. కాస్ట్రో తరువాత క్యూబాలో అంతటి అధికారం, పట్టు కలిగిన బలమైన నేతగా ఉన్న సమయంలో, ఇతర పేద దేశాల్లో విప్లవాన్ని వ్యాప్తి చేయడానికి బయలుదేరాడు. కాస్ట్రో మాటను సైతం లెక్కచేయకుండా క్యూబాను వదిలి కాంగో వెళ్లాడు. తరువాత ”బొలివియా” చేరి అక్కడ ప్రజాపోరాటాల్లో ఉన్న సమయంలో 1967అక్టోబర్‌ 9న బొలివియా సైన్యంచే చంపబడ్డాడు. ”టైం మేగజైన్‌” ప్రకటించిన 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ”చేగువేరా” ఒకడిగా నిలిచాడంటే మాటలు కాదు,యువతకు ఆయనొక ప్రపంచ ఐకాన్‌.
అమెరికాతో అంటకాగుతూ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్‌పై చేగువేరా స్ఫూర్తితో యువత పోరాటం చేయాల్సిన అవసరమున్నది. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటికరిస్తూ, ప్రజలని మతోన్మాద ఉచ్చులో బిగిస్తూ, అదానీ, అంబానీ లాంటి కుబేరుల కోసమే పాలన సాగిస్తున్న మోడీని నిలువరించాల్సిన సమయమిది. నేడు నిత్యావసర వస్తువులు, కాయగూరలు, గ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయంటే, కారణం బడా పారిశ్రామిక వేత్తలే కాదు, వారి మేలుకోసం తోడ్పడుతున్న సర్కార్‌ మోడీదేనన్న అంశం మరవరాదు. గ్రామాల నుంచి మొదలుకుని పట్టణాలు, నగరాల్లో యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌, ఆపై మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టలేని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, నిలదీయలన్నా చేగువేరాను ఆదర్శంగా తీసుకుని ఉద్యమిం చమే అనివార్యం. ఆయన సిద్ధాంతం, పట్టుదల నేటి యువతకు ఆదర్శం కావాలి. ఆయన చిత్రంతో ఉన్న దుస్తులను ధరించడం కాదు, ఆయన ఆశయాలైన సామ్రాజ్య వాదాన్ని ప్రతిఘటిస్తూ, సామ్యవాదాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. పేదరిక నిర్మూలనకు, అవినీతి, అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించేతత్వాన్ని యువత పెంపొందించుకోవాలి. వాస్త వాలు అవగాహన చేసుకుంటూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, వలస కార్మికుల వెతలు భవిష్యత్తులో దరిచేరకుండా ఉండేలా ప్రజల్ని చైతన్యపరిచి ఉద్యమించాలి. అదే ‘చే’ నడిచిన దారి.
(నేడు చేగువేరా వర్థంతి)
– ఐ.ప్రసాదరావు, 9948272919